కరోనా కష్టకాలంలో విద్యార్థులకు జగనన్న వసతి దీవెన

  ఏపీలో సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారు సీఎం జగన్. ఓ వైపు కరోనాతో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నా.. ఇచ్చిన మాట ప్రకారం విద్యార్థులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. జగనన్న వసతి దీవెన నగదును తల్లుల ఖాతాలోకి జమ చేశారు.

  ఏపీలో సంక్షేమానికి పెద్ద పీట వేస్తూనే ఉన్నారు సీఎం జగన్.. కరోనా కష్టకాలంలో సంక్షేమ పథకాలను ఆపడం లేదు. రెట్టింపు చేస్తున్నారు. తాజాగా కరోనా సయయంలో అంతా తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. రాష్ట్రంలో విద్యార్థులకు శుభవార్త చెప్పారు. జగనన్న వసతి దీవెన పథకం కింద అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 1,048.94 కోట్ల నగదును విడుదల చేశారు. ఈ మేరకు 2020-2021 సంవత్సరానికి మొత్తం 10,89,302 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఈ నగదు జమ కానుంది. తాడేపల్లిలోని సీఎం జగన్‌ క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి తొలి విడత నగదు అందరి ఖాతాల్లో జమచేశారు సీఎం జగన్.

  మన పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే అతి పెద్ద కానుక ఉన్నత చదువులే అని అభిప్రాయపడ్డారు. అందుకే తమ ప్రభుత్వం విద్యా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. ప్రతి విద్యార్ధి ప్రపంచంతో పోటీ పడాలే చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్కరి చదువుకు పేదరికం అడ్డు కాకూడదని సీఎం జగన్‌ అభిప్రాయపడ్డారు. ప్రతి ఏడాది రెండు వాయిదాల్లో జగనన్న వసతి దీవెన నగదు జమ చేస్తామని స్పష్టం చేశారు. పాలిటెక్నిక్, ఐటీఐ, డిగ్రీ ఆపై కోర్సులు చదివే విద్యార్ధులకు సాయం అందిస్తున్నామన్నారు. విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నేరుగా డబ్బు జమ చేస్తున్నామని, తల్లులే నేరుగా ఫీజులు కట్టడం వల్ల జవాబుదారీతనం వస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. కోవిడ్ కష్ట కాలంలోనూ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని గుర్తు చేశారు. 10.89లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.1048.94 కోట్లు జమ చేస్తున్నామని సీఎం చెప్పారు.

  జగనన్న వసతి దీవెన ద్వారా 2,270 కోట్లు సాయం చేశామన్నారు. అలాగే జగనన్న వసతి దీవెన ద్వారా విద్యారంగంలో డ్రాప్ అవుట్‌లు చాలా వరకు తగ్గాయని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది నుంచి సీబీఎస్‌ఈ సిలబస్‌ను తీసుకొస్తామన్నారు. అలాగే వచ్చే ఏడాది నుంచి అమ్మఒడి పథకానికి ఆప్షన్లు ఇచ్చామని, అమ్మఒడి పథకం కింద డబ్బు లేదా ల్యాప్‌టాప్ ఇస్తామని.. ఏదీ కావాలన్నది విద్యార్థుల తల్లిదండ్రులే ఎంచుకోవాలన్నారు. అలాగే అంగన్‌వాడీలను వైఎస్ఆర్‌ ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మారుస్తున్నామని వివరించారు.

  నాడు-నేడు కింద ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నామని గుర్తు చేశారు. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నామని సీఎం జగన్‌ పేర్కొన్నారు. పది, ఇంటర్ పరీక్షలపైనా మరోసారి క్లారిటీ ఇచ్చారు సీఎం జగన్. టెన్త్‌, ఇంటర్ పరీక్షలపై విమర్శలు సరికాదని, ప్రతి విద్యార్ధి భవిష్యత్‌ కోసం తాను ఆలోచిస్తాను అన్నారు. విపత్కర పరిస్థితుల్లో కూడా కొంత మంది విమర్శలు చేస్తున్నారని, అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే విధమైన పాలసీ లేదన్నారు. పరీక్షల విషయాన్ని కేంద్రం రాష్ట్రాలకే వదిలేసిందని గుర్తు చేశారు. కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయని, టెన్త్‌, ఇంటర్ సర్టిఫికెట్లపైనే విద్యార్ధుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని తెలిపారు. మార్కులను బట్టే ఏ విద్యార్ధికైనా కాలేజీలో సీటు వస్తుందని గుర్తుచేశారు.

  కరోనా కల్లోలం సమయంలోనూ సంక్షేమ పథకాలను సీఎం జగన్ అమలు చేస్తున్నారని అధికార పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా విద్యార్థుల బంగారు భవితే లక్ష్యంగా గత వారం జగనన్న విద్యా దీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు మొదటి త్రైమాసికం కింద 671.45 కోట్లు వారి తల్లుల ఖాతాలకు సీఎం జమ చేశారని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు వసతి, భోజన ఖర్చులకు 1,048.94 కోట్లు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమచేశారని కొనియాడుతున్నారు.

  దేశంలో ఎక్కడా లేని విధంగా ఏటా రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు చొప్పున, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేల చొప్పున, డిగ్రీ, ఆపై కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున వసతి, భోజన ఖర్చులను చెల్లించేందుకు ‘జగనన్న వసతి దీవెన’ కార్యక్రమానికి సీఎం రూపకల్పన చేశారు. ‘జగనన్న వసతి దీవెన’ పథకం ద్వారా ఇప్పటికే రూ.1,220.99 కోట్లను చెల్లించారు. మొదటి విడతగా రూ.1,048.94 కోట్లను చెల్లించారు. దీంతో ఇప్పటివరకు జగనన్న వసతి దీవెన కింద రూ.2,269.93 కోట్లు చెల్లించారు.

  Source: https://telugu.news18.com/news/andhra-pradesh/kurnool-andhra-pradesh-cm-jagan-releases-jagananna-vasathi-deevena-fund-in-camp-office-vijayawada-ngs-853726.html