కూరగాయల సేకరణకు ‘అమూల్ మోడల్‌’ TN Manjunath’s ‘Humus’ follows Amul Model to create Agri-Fresh produce supply chain

  శ్వేత విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్ పాల సహకార ఉద్యమం ఆధారంగా శ్యామ్ బెనెగల్  దర్శకత్వంలో ‘మంథన్’ (1976) అనే సినిమా వచ్చింది. గుజరాత్‌లోని ఆనంద్‌లో పాల సహకార సంస్థ ‘అమూల్’ ఆవిర్భావం దీని ఇతివృత్తం. కర్ణాటకతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాల రైతుల నుండి తాజా పండ్లు, కూరగాయలను సేకరించి అందించే ‘హ్యూమస్’ (HUMUS) సంస్థను ప్రారంభించేందుకు టిఎన్ మంజునాథ్‌ను ప్రేరేపించింది ఈ ‘మంథన్’ మూవీనే.

  కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు నుండి దాదాపు 1,000 మంది రైతుల నుండి 100 రకాలకి పైగా పండ్లు, కూరగాయలను హ్యూమస్ (HUMUS) సేకరిస్తుంది. వాటిని బెంగళూరులోని యలహంక, జెపి నగర్, విద్యారణ్యపురలలో ఏర్పాటు చేసిన మూడు రిటైల్ అవుట్‌లెట్‌లలో విక్రయిస్తుంది. మార్కెట్ రేట్లపై 20% తగ్గింపుతో తాజా కూరగాయలను, పండ్లను వినియోగదారులకు హ్యూమస్ సరఫరా చేయడం విశేషం. ఈ విక్రయ కేంద్రాలు వారంలోని అన్ని రోజుల్లోనూ ఉదయం 5 నుండి రాత్రి 9.30 గంటల వరకు పని చేస్తాయి.

  “అమూల్ మోడల్” నుండి మేము నేర్చుకున్న అంశాలలో ఒకటి కలెక్షన్ పాయింట్లను ఏర్పాటు చేయడం” అని మంజునాథ్ చెబుతారు. 2019లో తన వ్యాపార భాగస్వామిగా  భార్య శిల్పా గోపాలయ్యతో కలిసి ఆయన ‘హ్యూమస్’ ప్రారంభించారు. ‘హ్యూమస్’ సేకరణ కేంద్రాల్లో రైతులు APMC (Agricultural Produce Market Committee)లకు సాధారణంగా ఇచ్చే ఏజెంట్ కమీషన్ 10 శాతాన్ని చెల్లించనవసరం లేదు. పైగా రవాణాపై మరో 5% ఆదా అయ్యే వెసులుబాటు ఉంటుంది.

  తాజా వ్యవసాయోత్పత్తుల సరఫరా వ్యవస్థ

  రైతు కుటుంబం నుంచి వచ్చిన మంజునాథ్ బెంగళూరులోని ఇంజనీరింగ్ కళాశాలలో టీచింగ్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు. రైతుబిడ్డగా రైతుల కోసం కోసం ఏదైనా చేయాలన్న సదాశయంతో ఆయన ‘హ్యూమస్’ పేరుతో ఒక Agri-Fresh produce supply chain ప్రారంభించారు.

  “మేము వ్యవసాయానికి సంబంధించి వ్యాల్యూ చెయిన్ సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాము. అంటే ఉత్పత్తి, ప్రాసెసింగ్, సేకరణ, మార్కెటింగ్ అనే నాలుగు ప్రధాన అంచెలను అనుసంధానించడం. వినియోగదారులలోను, రైతులలోను నమ్మకాన్ని పెంపొందించడానికి మేము ప్రస్తుతం సేకరణ, అమ్మకాలు, మార్కెటింగ్‌పైనే దృష్టి పెట్టాము. అయితే అన్ని అంచెలనీ చేరుకునేందుకు మాకు కనీసం ఒక దశాబ్దం పట్టవచ్చు” అని మంజునాథ్ చెప్పారు.

  ఉత్పత్తి ఆధారిత వ్యవసాయ నమూనా నుండి అమ్మకాలతో నడిచే మోడల్‌కు మనం మారడం అవసరం  అని మంజునాథ్ అంటారు. “ఇది అమ్మకాలతో నడిచే వ్యవసాయ నమూనాగా ఉండాలని మేము భావిస్తున్నాము. మన రైతులు పంటల దిగుబడితో ఉత్పత్తిని సాధిస్తారు. దానిని విక్రయించడానికి ఎంతో కష్టపడతారు. కాబట్టి, డిమాండ్ గురించి మనకు స్పష్టమైన ఆలోచన ఉంటే, ఉత్పత్తి క్రమబద్ధీకరించబడుతుంది. మేము నడుపుతున్న అవుట్‌లెట్ల ద్వారా మాతో సంబంధం ఉన్న రైతులకు మేము అవసరమైన డేటాను అందిస్తూ ఉంటాము”అని ఆయన వివరించారు.

  “హ్యూమస్‌”కు దిబ్బరహల్లి, అట్టిబెలె, పాండవపుర, ఊటీ, సీకేపల్లి, మలూర్‌లలో ఆరు సేకరణ కేంద్రాలు ఉన్నాయి. రైతుల నుండి తక్కువ మొత్తంలో సైతం వారి పండ్లు, కూరగాయలను తీసుకోవడమే తమ సేకరణ కేంద్రాల విజయానికి కారణమని మంజునాథ్ చెప్పారు.

  “తమ ఉత్పత్తులను ఏపీఎంసీకి పంపాలంటే ఒక రైతు ఒకే పంట పద్ధతిని ఎంచుకోవాల్సి ఉంటుంది. 100-500 కిలోల కూరగాయలను ఉత్పత్తి చేసే రైతుకు, రవాణా ఛార్జీలను పరిగణనలోకి తీసుకుంటే ఏపీఎంసీకి వాటిని తీసుకెళ్లడం అంత సౌకర్యంగా ఉండదు. అదే సమయంలో, మేము చిన్న పరిమాణాలను కూడా తీసుకుంటాము. పైగా మేము వ్యవసాయ కేంద్రాలకు దగ్గరగా ఉన్నాము. మాతో పనిచేసే రైతులు తమ ఉత్పత్తులను మోటారు సైకిళ్ళపై కూడా తీసుకువస్తారు”అని ఆయన వివరిస్తారు.

  ఈ మోడల్‌ను మరింత విస్తరించడం గురించి మాట్లాడుతూ, అమూల్ మాదిరిగా, ‘హ్యూమస్’ రాష్ట్రంలోని ప్రతి హోబ్లి (50 గ్రామాల సేకరణ)లో కలెక్షన్ పాయింట్లను కలిగి ఉండాలని భావిస్తోంది. కర్ణాటకలోని ద్వితీయశ్రేణి నగరాలకు కూడా కార్యకలాపాలను విస్తరించాలని ఈ కంపెనీ యోచిస్తోంది.

  రైతులకు గిట్టుబాటు ధర

  హ్యూమస్ కస్టమర్, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి శ్రీనివాస ప్రసాద్ మాట్లాడుతూ, మార్కెట్‌తో పోలిస్తే తక్కువ ధరలు ఉండడంతో పాటు, ఒక రైతుకు గిట్టుబాటు ధర దక్కడం తనకెంతో నచ్చిందనీ, తాను ఈ విక్రయకేంద్రానికి రావడానికి ఇదొక కారణమనీ అన్నారు. “రైతు నుండి నేరుగా పండ్లు, కూరగాయలు ఇక్కడకు వస్తాయని నేను గమనించాను. ఇలాంటి మోడళ్లు ఇంకా పెరగాలి. అయితే వీటిలో సేంద్రియ ఉత్పత్తులు ఎక్కువగా ఉంటే బాగుంటుంది” అని ఆయన చెప్పారు.

  ఈ అంశంపై మంజునాథ్ స్పందిస్తూ, తమ వ్యాపార నమూనా రైతులను క్రమంగా సేంద్రియ వ్యవసాయ విధానాలవైపుకు మరలించేందుకు వీలు కల్పిస్తుందన్నారు. అయితే ఇందుకు కొంత సమయం పడుతుందని చెప్పారు. “సేంద్రియ పద్ధతిలో దిగుబడి తక్కువగా ఉంటుందన్న అపోహ ఉంది. కానీ అది నిజం కాదు. కొన్నేళ్లుగా ఎరువుల పరిశ్రమ రైతులను తప్పుదోవ పట్టించి, నేలలో సమృద్ధిగా పోషకాలు ఉన్నప్పటికీ రసాయనాలను వాడేలా చేసింది. ఇది దిగుబడిని పెంచింది. కానీ అది స్వల్పంగా మాత్రమే. ఇలా రసాయన వ్యవసాయం పెరగడం మూలాన సేంద్రియ సాగు కాస్తా తగ్గిపోయింది. దీని వల్ల ఇవాళ వ్యవసాయం కేవలం 5% మాత్రమే ఇప్పుడు సేంద్రియంగా ఉంది. ఇంకోవైపు రసాయన వ్యవసాయం మూలంగా మన భూగర్భజల మట్టాలు క్షీణిస్తున్నాయి.”అని మంజునాఖ్ అన్నారు.

  ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్గానిక్ వ్యవసాయం దిశగా తక్షణ మార్పు ఆచరణాత్మకం కాదని ఆయన వ్యాఖ్యానించారు. “మేము ఈ రైతుల నుండి దీర్ఘకాలం వారి ఉత్పత్తులు సేకరించగలిగితే వారిలో విశ్వాసం నెలకొంటుంది. అప్పుడు రసాయన ఆధారిత వ్యవసాయం నుండి సేంద్రియ వ్యవసాయానికి దశలవారీగా మారడం వీలవుతుంది. అలా కాకుండా వెంటనే వారి సాగు పద్ధతులను మార్చమని వారిని అడగడం ఆచరణాత్మకం కాదు” అని ఆయన అభిప్రాయపడ్డారు.

  కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనల గురించి అడిగినప్పుడు మంజునాథ్, రైతులకు మార్కెట్లు లేదా ఏపీఎంసీల మధ్య దేన్నైనా ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. వ్యవసాయ రంగం కార్పొరేటైజేషన్‌కు దారితీస్తుందని రైతు సంఘాలు చేస్తున్న వాదనను ఆయన అంగీకరించలేదు.

  “మన వ్యవసాయ రంగం భారీ స్థాయిలో ఉంది. ఏ ఒక్క ప్రైవేటు సంస్థ కూడా ఈ రంగాన్ని పూర్తిగా నియంత్రించలేదు. టెలికాం పరిశ్రమలో ఇటువంటి గుత్తాధిపత్యం జరిగింది. ఎందుకంటే అది టెక్-ఎనేబుల్ రంగం. కానీ వ్యవసాయరంగం ప్రజలు లేదా రైతుల భాగస్వామ్యంతోనే నడుస్తుంది” అని ఆయన వ్యాఖ్యానించారు.

  విక్రయకేంద్రాల నిర్వహణతో పాటు ‘హ్యూమస్’ రైతులకు రసాయన రహిత వ్యవసాయంపై కూడా అవగాహన కల్పిస్తోంది. తాజాగా ఉన్నప్పుడే పండ్లు, కూరగాయలను విక్రయకేంద్రాలకు చేర్చడం ఎంతో అవసరమని ‘హ్యూమస్’ రైతులకు వివరిస్తుంది. అప్పుడే వినియోగదారుల నుంచి సరైన ధర లభిస్తుందని ‘హ్యూమస్’ భావిస్తుంది.

  గుజరాత్ “అమూల్ మోడల్‌”ను అనుసరించి మంజునాథ్ అగ్రి-మార్కెటింగ్‌లో సరికొత్త ట్రెండ్ సృష్టించారు. పలు చోట్ల తాజా పండ్లు, కూరగాయల సేకరణ కేంద్రాలను నెలకొల్పడం ద్వారా ఆయన ఆధ్వర్యంలోని ‘హ్యూమస్’ రైతుల ఆదరణ చూరగొంటోంది. ఈ మోడల్ మిగతా రాష్ట్రాలలోని ఔత్సాహికులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది.

  మరిన్ని వివరాలకు ఈ క్రింది చిరునామాను సంప్రదించవచ్చు.

  HUMUS – Fair Price Market For Fruits & Vegetables

  All Days: 5 am – 9:30 pm

  Mobile: 9148641454

  Tel: 8884244700

  Email: md@humus.co.in

  https://www.humus.co.in/
  https://www.facebook.com/manjunatha.tn