కేంద్ర ప్రభుత్వ మిషన్‌ అంత్యోదయ సర్వేలో వైజాగ్ 2వ స్థానం

  గిరిజనుల జీవన చిత్రానికి ప్రతి రూపాలు సంతలు.. ఇవి వారి ఆత్మీయ అనురాగాలకు ప్రతీకలు. మన్యం వాసుల దైనందిన జీవితంలో సంతకు ఎంతో ప్రాధాన్యముంది. తాము పండించిన వ్యవసాయ ఉత్పత్తులైనా, సేకరించిన అటవీ ఉత్పత్తులైనా గిరిపుత్రులు సంతకు తెచ్చే విక్రయిస్తుంటారు. గిరిజనుల జీవితాల్లో వినోదం, వ్యాపారం, వ్యవహారం..అన్నింటికీ ఏకైక వేదిక సంత. విశాఖ మన్యంలో రోజుకో ప్రాంతంలో నిత్య జాతర వాతావరణాన్ని తలపించేలా వారపు సంతలు జరుగుతుంటాయి. తాజాగా దేశవ్యాప్తంగా సంతలపై ఎక్కువగా ఆధారపడే అత్యధిక గ్రామాలున్న జిల్లాల జాబితాలో విశాఖపట్నం స్థానం సంపాదించుకుంది. 

  దేశంలో సంతలపై ఆధారపడే అత్యధిక గ్రామాలున్న జిల్లాల జాబితాలో విశాఖపట్నం రెండో స్థానంలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వ మిషన్‌ అంత్యోదయ–2019లో భాగంగా ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ)కి చెందిన భారతీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ పాలసీ సంస్థ ఏడాదిపాటు దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించింది. విశాఖ ఏజెన్సీలోని 776 గ్రామాలు నిత్యావసరాలతో పాటు ఇతర వస్తువుల కొనుగోలుకు వారపు సంతలపైనే ఆధారపడుతున్నాయని పేర్కొంది. 937 ఏజెన్సీ గ్రామాలతో ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లా తొలి స్థానంలో ఉంది. దేశంలోని 95 వేల గ్రామాలు వారపు సంతలపైనే ఆధారపడుతున్నాయని సర్వేలో వెల్లడైంది. సర్వే పూర్తి వివరాలను ఇండియన్‌ డేటా పోర్టల్‌లో అందుబాటులో ఉంచింది.  

  776 గిరిజన గ్రామాలకు ముఖ్యాధారం.. 


  విశాఖ జిల్లాలో మొత్తం 11 గిరిజన మండలాల పరిధిలోని 776 ఏజెన్సీ గ్రామాలకు ఈ సంతలే ప్రధాన ఆదాయ వనరుగా నిలుస్తున్నాయి. గిరిజన గ్రామాలే కాకుండా సమీపంలో ఉన్న ప్రాంతాల ప్రజలు కూడా ఏజెన్సీలో నిర్వహించే వారపు సంతలకు ఎక్కువగా వెళ్తుంటారు. విశాఖ ఏజెన్సీలో మొత్తం 35 నుంచి 40 ప్రాంతాల్లో ఆయా వారాల్లో సంతలు నిర్వహిస్తుంటారు. వీటిలో ప్రధానంగా పాడేరు నియోజకవర్గ పరిధిలో.. పాడేరు (శుక్రవారం), మద్దిగరువు (గురువారం), సంతబయలు (మంగళవారం), గుత్తులపుట్టు (గురువారం), వి.మాడుగుల (మంగళవారం), అన్నవరం (సోమవారం), చింతపల్లి (బుధవారం), జీకే వీధి (గురువారం), పెదవలస (శుక్రవారం), దారకొండ (ఆదివారం), ఆర్వీనగర్‌ (సోమవారం)లో వారపుసంతలు జరుగుతాయి. అరకు నియోజకవర్గ పరిధిలో..అరకు (శుక్రవారం), పెదబయలు (సోమవారం), హుకుంపేట (శనివారం), కించమండ (సోమవారం). సుంకరమెట్ట (ఆదివారం), బూసిపుట్టు (మంగళవారం), ముంచంగిపుట్టు (శనివారం), రూడకోట (సోమవారం), అనంతగిరి (సోమవారం), డముకు (బుధవారం), కాశీపట్నం (బుధవారం)లో వారపు సంతలు జరుగుతుంటాయి.  

  అన్నీ దొరికే అంగడి… 


  దశాబ్దాల చరిత్రతో పల్లె జీవనానికి ప్రతీకలుగా సంతలు మారాయి. సగటు మనిషికి అవసరమైన అన్ని వస్తువులూ సంతలో అందుబాటులో ఉంటున్నాయి. నిత్యావసరాలు, పండ్లు, కూరగాయలు, దుస్తులు, సాగుకు అవసరమయ్యే సామాగ్రి, పసుపు, రాజ్‌మా, కాఫీ, మిరియాలు, కోళ్లు, మేకలు, గొర్రెలు, పశువులు.. గుండు పిన్ను నుంచి స్మార్ట్‌ ఫోన్‌ వరకూ అన్ని వస్తువులూ సంతల్లో లభ్యమవుతుంటాయి. మార్కెట్‌లో దొరకని చాలా వస్తువులు సంతల్లో లభ్యమవుతుండటం గమనార్హం. ప్రధానంగా గిరిజన మహిళల కట్టుబొట్టుకు అవసరమైన వస్తువుల్ని వ్యాపారులు అందుబాటులో ఉంచుతారు. ఒక్కో సంతలో రూ.20 లక్షల వరకూ కనీస వ్యాపార లావాదేవీలు జరుగుతాయి. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు జరిగే సీజన్‌లో సంతల్లో రూ.50 నుంచి రూ.కోటి వరకు వ్యాపారం జరుగుతుండటం విశేషం. 

  Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/vizag-district-got-second-place-mission-antyodaya-1379725