కేటాయింపులకు లోబడే ప్రాజెక్ట్‌ల నిర్మాణం

    కేటాయింపులకు లోబడే ఆంధ్రప్రదేశ్‌లో ప్రాజెక్ట్‌ల నిర్మాణం జరుగుతోందని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు. ఏపీ ప్రాజెక్ట్‌లపై తెలంగాణ అభ్యంతరాలు సరికాదన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కేటాయించిన నీటిని మాత్రమే వాడుకుంటున్నాం. తెలంగాణలో అనుమతులు లేకుండానే ప్రాజెక్ట్‌లు చేపడుతున్నారు. తెలంగాణలో కల్వకుర్తి, నెట్టెంపాడు సామర్థ్యం పెంచుకున్నారు. రాజోలిబండ ప్రాజెక్ట్‌కి 4 టీఎంసీల కేటాయింపు ఉంది. ఏపీ ప్రయోజనాలు కాపాడటంలో సీఎం జగన్‌ ముందుంటారు. అలానే ఎక్కడా కేటాయింపులు మించి వెళ్లడం లేదు. 

    840 అడుగులకు లెవెల్ పడిపోతే ఏపీ చుక్కనీరు తీసుకునే అవకాశం లేదు. వంశధార ట్రిబ్యునల్ నుంచి నేరడి ప్రాజెక్ట్ కట్టేందుకు అనుమతి ఇచ్చింది. త్వరలో ప్రారంభిస్తాం. వైఎస్ జగన్ సీఎం అయ్యాక రెండు రాష్ట్రాలు కలిసుండాలి అని కోరుకున్నారు. ఒక అడుగు ముందుకు వేసి స్నేహ హస్తం అందించే మనిషి వైఎస్ జగన్. కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాజెక్టులు సృష్టించబడ్డాయి. వాటి కెపాసిటీ పెంచుకునేందుకు మాత్రమే మేము ప్రయత్నం చేస్తున్నాం’’ అని అన్నారు.

    Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/minister-anil-kumar-yadav-comments-water-projects-1372826