కొత్తగా మరో 19 ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌లు

  • ఇప్పటికే 13 జిల్లాల్లో 14 వైరాలజీ ల్యాబ్‌లు 
  • నియోజకవర్గాల స్థాయిలో ఏర్పాటు కానున్న కొత్త ల్యాబ్‌లు 
  • ఇకపై ఎక్కువ పరీక్షలు చేయడంతోపాటు వేగంగా ఫలితాలు 

  ఎక్కువ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడంతోపాటు వేగంగా ఫలితాలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 19 చోట్ల ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో 13 జిల్లాల్లో 14 వైరాలజీ ల్యాబ్‌లు ఉన్నాయి. వీటికి రోజుకు 90 వేలకు పైగా టెస్టులు చేసే సామర్థ్యం ఉంది. మొత్తం 14 ల్యాబ్‌ల్లో 89 ఆర్టీపీసీఆర్‌ మెషిన్లు పనిచేస్తున్నాయి. కాగా, కరోనా థర్డ్‌ వేవ్‌ వచ్చినా, భవిష్యత్‌లో మరిన్ని ఎక్కువ టెస్టులు చేయాల్సి వచ్చినా 14 ల్యాబ్‌లకు తోడు కొత్తగా ఏర్పాటు చేస్తున్న 19 ల్యాబ్‌లు ఉపయోగపడనున్నాయి. ఇప్పటివరకు జిల్లా కేంద్రాలకే పరిమితమై ఉన్న ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌లను ఇప్పుడు నియోజకవర్గాల స్థాయిలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఎక్కడ వీటిని పెడితే బాగుంటుందో కలెక్టర్ల నుంచి నివేదికలు తెప్పించి.. ఆ మేరకు 19 చోట్ల అందుబాటులో ఉంచనుంది. 

  ఒక్కో ల్యాబ్‌కు రూ.80 లక్షల వ్యయం 

  కొత్త ల్యాబ్‌ల రాకతో పరీక్ష ఫలితాల్లో జాప్యం తగ్గుతుంది. పైగా రోగుల నమూనాలను జిల్లా కేంద్రాలకు పంపే ఇబ్బందులు తప్పుతాయి. ఒక్కో ల్యాబ్‌లో రోజుకు 800 టెస్టులు చొప్పున మొత్తం 19 కొత్త ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌ల్లో 15 వేలకు పైగా పరీక్షలు చేయొచ్చు. ఒక్కో ల్యాబ్‌కు ప్రభుత్వం రూ.80 లక్షల వరకూ వ్యయం చేస్తోంది. రెండు నెలల్లో ఈ ల్యాబ్‌ల ఏర్పాటు పూర్తవుతుంది. కాగా, ప్రస్తుతమున్న 14 ల్యాబ్‌లను కూడా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే ఏర్పాటు చేసిందన్న సంగతి తెలిసిందే.    

  వేగంగా ఫలితాలు.. 
  ఇప్పటివరకు జిల్లా కేంద్రాల్లోనే ల్యాబ్‌లు ఉన్నాయి. వీటిపైన లోడు ఎక్కువవడంతో ఫలితాల్లో జాప్యం జరుగుతోంది. ఇప్పుడు కొత్తగా వచ్చే ల్యాబ్‌లతో ఈ జాప్యాన్ని నివారించవచ్చు. అవసరమనుకుంటే ఈ ల్యాబ్‌ల్లో మెషిన్లు పెంచి మరిన్ని టెస్టులు చేసే వెసులుబాటూ ఉంది. ప్రస్తుతం మనకున్న 14 ల్యాబొరేటరీల్లో 89 ఆర్టీపీసీఆర్‌ మెషిన్లు పనిచేస్తున్నాయి. 
  –మల్లికార్జున, సీఈవో, ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌  

  Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/another-19-new-rtpcr-labs-andhra-pradesh-1370554