కొత్తగా మరో 29,961 మందికి పింఛను

    • రాష్ట్ర వ్యాప్తంగా 61.46 లక్షల మందికి పంపిణీ

    రాష్ట్ర వ్యాప్తంగా మరో 29,961 మంది పేదలకు ప్రభుత్వం కొత్తగా ఈ నెలలో పింఛన్లు మంజూరు చేసినట్టు పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. 1,726 మంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి ప్రతి నెలా రూ.10 వేల చొప్పున, మరో 28,235 మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితరులకు సాధారణ పింఛన్లను ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసినట్టు పేర్కొన్నారు.

    వీరందరికీ జూన్‌ ఒకటో తేదీ నుంచే అధికారులు పింఛను డబ్బులు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. కొత్తగా మంజూరు చేసిన వారితో కలిపి జూన్‌ ఒకటో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 61,46,908 మందికి పింఛన్ల పంపిణీ జరుగుతుందన్నారు. ఇందుకు రూ.1,497.63 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం సోమవారం సాయంత్రానికే ఆయా గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. మంగళవారం తెల్లవారుజాము నుంచే వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి బయో మెట్రిక్‌ విధానంలో డబ్బులు పంపిణీ చేయనున్నారు.

    Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/another-29961-people-will-receive-new-pension-ap-1367887