కొత్తగా 176 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు

  • భవనాలకు రూ.346 కోట్లు, సిబ్బంది వేతనాలకు ఏటా రూ.165 కోట్లు 
  • 104 కాల్‌ సెంటర్‌కు ఒకేరోజు 16,856 కాల్స్‌ 
  • రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లకు కొరత లేదు 
  • ఆక్సిజన్‌ సరఫరాను పెంచుతున్నాం 
  • రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ 

  రాష్ట్రంలో కొత్తగా 176 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. ఇందులో 7 ట్రైబల్‌ పీహెచ్‌సీలు కూడా ఉన్నాయన్నారు. ఒకే పీహెచ్‌సీ ఉన్న మండలంలో రెండోది కూడా ఉంటుందని చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో మంగళవారం సింఘాల్‌ మీడియాతో మాట్లాడారు. ప్రతి మండలంలో రెండు పీహెచ్‌సీల ఏర్పాటుకు రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించిందన్నారు. ఇందులో భాగంగా పీహెచ్‌సీల భవన నిర్మాణాలకు రూ.346 కోట్లు, సిబ్బంది వేతనాలకు ఏటా రూ.165 కోట్లు రికరింగ్‌ వ్యయమవుతుందని తెలిపారు.

  రాష్ట్రంలో భారీగా కరోనా టెస్టులు పెంచామని, డిశ్చార్జిల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోందన్నారు. ప్రస్తుతం 6,319 ఐసీయూ పడకలుండగా.. 5,743 పడకల్లో రోగులు చికిత్స పొందుతున్నారని చెప్పారు. చాలా జిల్లాల్లో ఐసీయూ పడకలు ఖాళీగా లేవన్నారు. రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల కొరత లేదని.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 21,898 ఇంజక్షన్లు ఉన్నాయని, మరో 12 వేలు మంగళవారం వచ్చాయని వెల్లడించారు. ప్రైవేటు ఆస్పత్రులకు ఒకే రోజు 14,030 ఇంజక్షన్లు ఇచ్చామన్నారు. గత 24 గంటల్లో 446 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ సరఫరా చేశామని తెలిపారు. మరో 3 ట్యాంకర్లను కూడా ఏర్పాటు చేసి అదనపు సరఫరాకు ఉపయోగిస్తామన్నారు. కాగా, 104 కాల్‌ సెంటర్‌కు ఒకేరోజు 16,856 కాల్స్‌ వచ్చాయన్నారు.  

  రెండో డోస్‌ వారికే ప్రాధాన్యత 
  రాష్ట్రంలో కరోనా టీకా నిల్వలు తక్కువగా ఉన్న కారణంగా రెండో డోసు తీసుకునేవారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఈ నెల 15లోగా కేంద్రం నుంచి 9 లక్షల డోసుల టీకా వస్తుందని.. ముందుగా రెండో డోసు తీసుకునేవారికి జాప్యం కాకుండా చూస్తామని తెలిపారు. ప్రజా సంబంధాల్లో (ఆర్టీసీ, బ్యాంకు, మీడియా ఉద్యోగులు) ఉన్నవారికి రెండో ప్రాధాన్యతగా టీకా వేస్తామన్నారు. వీరిలోనూ 45 ఏళ్లు దాటినవారికే ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.  

  Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/newly-176-primary-health-centers-ap-1361531