కొవిడ్ పై రాష్ట్రమంతా.. ఒకేలా ఆంక్షలు

  • కోవిడ్‌పై సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశం
  • అన్ని జిల్లాల్లో ఒకే మాదిరిగా కర్ఫ్యూ సడలింపులు
  • 144 సెక్షన్‌తో ఉదయం 6 నుంచి రాత్రి 9 వరకు అనుమతి
  • రాత్రి 9 గంటల తరువాత దుకాణాలన్నీ మూసివేయాలి
  • రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు కట్టుదిట్టంగా కర్ఫ్యూ 
  • కోవిడ్‌ నియంత్రణ చర్యలు కఠినంగా అమలు
  • దుకాణాల్లో సిబ్బంది నుంచి వినియోగదారుల దాకా మాస్కులు తప్పనిసరి
  • ఉల్లంఘనలకు పాల్పడితే దుకాణాలకు భారీ జరిమానా
  • అవసరమైతే రెండు మూడు రోజులు మూసివేతకు ఆదేశాలు
  • ఉల్లంఘనల ఫొటోలు పంపినా జరిమానాల విధింపు.. ఇందుకుప్రత్యేకంగా వాట్సాప్‌ నంబర్‌ 
  • మాస్కు ధరించకుంటే రూ.100 జరిమానా కచ్చితంగా అమలు

  ఉపాధ్యాయులందరికీ టీకాలు
  పాఠశాలలు తెరిచేముందు టీచర్లందరికీ వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలి. ప్రభుత్వ, ప్రైవేట్‌ స్కూళ్ల టీచర్లందరికీ టీకాలు ఇవ్వాలి. వ్యాక్సిన్‌ అందుబాటును బట్టి డిగ్రీ విద్యార్థులకు వ్యాక్సినేషన్‌ చేపట్టాలి. ఆయా కాలేజీల్లోనే క్యాంపులు ఏర్పాటు చేసి టీకాలు ఇవ్వాలి.

  సీజనల్‌ వ్యాధులపై జాగ్రత్త
  వర్షాకాలం ప్రారంభమైనందున సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి. కోవిడేతర వ్యాధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. ఔషధాలు పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో అందుబాటులో ఉంచాలి. 

  సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 15 నుంచి అన్ని జిల్లాల్లో ఒకేలాగా మాదిరిగా కోవిడ్‌ నియంత్రణ చర్యలను కట్టుదిట్టంగా అమలు చేయాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. దుకాణాల్లో సిబ్బంది నుంచి వినియోగదారుల వరకూ అంతా మాస్కులు తప్పనిసరిగా ధరించాల్సిందేనని, ఉల్లంఘనలకు పాల్పడితే దుకాణాల యజమానులకు భారీ జరిమానా విధించాలని స్పష్టం చేశారు. అవసరమైతే రెండు మూడు రోజులు దుకాణాల మూసివేతకు ఆదేశాలు జారీ చేయాలన్నారు. కోవిడ్‌ నియంత్రణ చర్యలను పాటించకుండా ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఎవరైనా ఫొటోలు తీసి పంపినా జరిమానాలు విధించాలని, దీనికోసం ప్రత్యేకంగా వాట్సాప్‌ నంబర్‌ కేటాయించాలని సూచించారు. మాస్కులు ధరించడంతోపాటు భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలన్నారు. మాస్కు ధరించకుంటే రూ.100 జరిమానాను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. ‘కోవిడ్‌ తగ్గుతోంది.. తగ్గింది మళ్లీ పెరగకుండా ఉండాలంటే అందరికీ వ్యాక్సినేషన్‌ తప్పనిసరి. అది పూర్తయ్యేవరకు ఈ నిబంధనలన్నీ తప్పనిసరిగా అనుసరించాలి’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కోవిడ్‌ నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌పై సీఎం జగన్‌ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. ముఖ్యాంశాలు ఇవీ..
  అధికారులతో సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

  నేటి నుంచి అంతటా ఒకేలా సడలింపులు
  రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఒకేలాగా కర్ఫ్యూ సడలింపులు అమలు చేయాలి. ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకూ కర్ఫ్యూ సడలించాలి. కర్ఫ్యూ సడలింపు సమయంలో రాష్ట్రవ్యాప్తంగా కఠినంగా 144 సెక్షన్‌ అమలు చేయాలి. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకూ కట్టుదిట్టంగా కర్ఫ్యూ అమలు కావాలి. రాత్రి 9 గంటల తరువాత దుకాణాలన్నీ మూసివేయాలి.  

  5 % లోపు ఉన్నందువల్లే సడలింపులు..
  పాజిటివిటీ రేటు 5 శాతం లోపు ఉన్నందువల్లే సడలింపులు కల్పించాం. అయితే కోవిడ్‌ నియంత్రణ చర్యలు కఠినంగా అమలు చేయాలి. ప్రజలు గుమిగూడకుండా ఆంక్షలు విధించాలి. మార్కెట్లు తదితర బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలి.

  ఫోకస్డ్‌గా పరీక్షలు
  ఫీవర్‌ సర్వే అనంతరం ఫోకస్డ్‌గా టెస్టులు చేయాలి. జ్వరం, ఇతర లక్షణాలున్న వారికి పరీక్షలు చేసి తగిన మందులు అందించాలి. కేసుల సంఖ్యను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వెంటనే తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాలి.

  కోవిడేతర వ్యాధుల పట్ల జాగ్రత్తలు..
  వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి. కోవిడేతర వ్యాధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. పీహెచ్‌సీల వారీగా సమీక్ష చేసి తగిన చర్యలు చేపట్టాలి. మచిలీపట్నం, అవనిగడ్డ ప్రాంతాల్లో ఎక్కువగా పాము కాట్లు బారిన పడే ప్రమాదం ఉన్నందున ఇంజక్షన్లు సిద్ధంగా ఉంచాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో డెంగ్యూ లాంటి వ్యాధులు వర్షాకాలంలో ప్రబలే అవకాశం ఉంది. వాటికి సంబంధించిన ఔషధాలు పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో అందుబాటులో ఉంచాలి. ఆ మందులు కూడా డబ్ల్యూహెచ్‌వో, జీఎంపీ ప్రమాణాలతో ఉండాలి.

  నాడు – నేడుపై దృష్టి పెట్టాలి..
  వైద్యశాఖలో నాడు – నేడులో భాగంగా పీహెచ్‌సీల వరకు కాంపౌండ్‌ వాల్‌ల నిర్మాణం చేపట్టాలి. పనులపై పూర్తి స్ధాయిలో దృష్టి సారించాలి. పెండింగ్‌ పనులపై ధ్యాస పెట్టాలి.

  థర్డ్‌ వేవ్‌ సన్నద్ధత..
  థర్డ్‌ వేవ్‌ వస్తుందన్న హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి. పిల్లల వైద్యుల నియామకం, ప్రభుత్వ ఆస్పత్రుల్లో సన్నద్ధతపై పూర్తి స్థాయిలో సమీక్షించాలి. మందులు కూడా సిద్ధంగా ఉండాలి.

  సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌(నాని), పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, కోవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ చైర్మన్‌ డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ వ్యాక్సినేషన్‌) ఎం.రవిచంద్ర, 104 కాల్‌ సెంటర్‌ ఇన్‌చార్జి ఏ.బాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్‌ ఏ. మల్లిఖార్జున, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ వి.విజయరామరాజు, హెల్త్‌ యూనివర్సిటీ వీసీ శ్యామప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

  ఆక్సిజన్‌ ప్లాంట్లపై..
  రాష్ట్రవ్యాప్తంగా 97 చోట్ల 134 పీఎస్‌ఎ ప్లాంట్ల (ఆక్సిజన్‌ ప్లాంట్లు) ఏర్పాటుకు సంబంధించి సమీక్ష సందర్భంగా అధికారులు వివరాలను అందచేశారు. ఆగస్టు నెలాఖరునాటికి పూర్తి కానున్నట్లు తెలిపారు. 50 పడకలు దాటిన ప్రతి ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్ల ఏర్పాటుపై పురోగతిని సీఎం జగన్‌ తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్లు సంబంధిత ప్రైవేట్‌ ఆస్పత్రులకు ఈమేరకు ఆదేశాలు ఇచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. దీనిపై దృష్టి సారించి ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలని సీఎం ఆదేశించారు. గర్భిణిలకు వ్యాక్సినేషన్‌ ప్రారంభించినట్లు ఈ సందర్భంగా అధికారులు చెప్పారు. 

  ఉభయ గోదావరికి ఊరట
  అన్ని జిల్లాల్లో ఒకేలా కర్ఫ్యూ సడలింపులకు సంబంధించి మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేయనుంది. ఉభయ గోదావరి జిల్లాల్లో ఇప్పటిదాకా ఉదయం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే కర్ఫ్యూ సడలింపు అమల్లో ఉంది. గురువారం నుంచి ఉభయ గోదావరితో పాటు అన్ని జిల్లాల్లో ఒకే మాదిరిగా ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకూ కర్ఫ్యూ సడలింపు అమల్లోకి రానుంది. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకూ అన్ని జిల్లాల్లో ఒకేలాగా కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. 

  Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/cm-ys-jaganmohan-reddy-orders-review-covid-19-1378362