కోవిడ్‌ కిట్ల నుంచి బెడ్లు దాకా.. 3 గంటల్లో రెడీ 104 Call Center

  • కోవిడ్‌ సమస్య ఏదైనా సరే.. 104 వెంటనే పరిష్కారం చూపాలి
  • ఆస్పత్రి.. క్వారంటైన్‌.. హోం ఐసొలేషన్‌.. ఏం చేయాలో సూచించాలి
  • ‘స్పందన’ వీడియో కాన్ఫరెన్స్‌లో  కోవిడ్‌ నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌పై ఉన్నతాధికారులకు సీఎం వైఎస్‌ జగన్‌ మార్గనిర్దేశం   
  • 104 కాల్‌సెంటర్‌ సమర్ధంగా పనిచేసేలా కలెక్టర్లు దృష్టి పెట్టాలి
  • క్లస్టర్లుగా ప్రైవేట్‌ కోవిడ్‌ ఆస్పత్రులు.. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లతో తనిఖీలు 
  • ప్రభుత్వ ఆస్పత్రుల సామర్థ్యానికి తగినట్లుగా పూర్తి స్థాయిలో వైద్య, పారామెడికల్‌ సిబ్బంది 
  • ఖాళీల భర్తీకి వెంటనే వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూలు.. 48 గంటల్లోగా నియామకాలు పూర్తి చేయాలి
  • లాక్‌డౌన్‌తో ప్రభుత్వానికన్నా ప్రజలకు నాలుగింతలు నష్టం
  • పుకార్లు, తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తే అరెస్టు, జైలు

  104 కాల్‌సెంటర్‌ పూర్తి స్థాయిలో సమర్థంగా పని చేసేలా కలెక్టర్లు శ్రద్ధ తీసుకోవాలి. ఆ నంబర్‌కు ఫోన్‌ చేసిన వారికి తక్షణమే పరిష్కారం చూపాలి. ఆస్పత్రికి వెళ్లడమా? క్వారంటైన్‌కు పంపడమా? హోం ఐసొలేషనా?.. ఏం చేయాలన్నది స్పష్టంగా చెప్పాలి. కోవిడ్‌కు సంబంధించిన అన్ని సమస్య లకు 104 నంబర్‌ వన్‌ స్టాప్‌ సొల్యూషన్‌ అన్నది ప్రజల్లోకి బలంగా వెళ్లాలి. ఆ స్థాయిలో కాల్‌ సెంటర్‌ పని చేయాలి. 104కి ఫోన్‌ చేసిన వెంటనే 3 గంటల్లోగా బెడ్‌తో సహా రోగులకు ఏది అవసరమో అది కేటాయించాలని మనం లక్ష్యంగా పెట్టుకున్నాం. 104 కాల్‌సెంటర్‌లో తగిన సంఖ్యలో వైద్యులు అందుబాటులో ఉండాలి. అన్ని వ్యవస్థలు 104తో అనుసంధానం కావాలి.
  – సీఎం వైఎస్‌ జగన్‌

  48 గంటల్లో నియామకాలు..
  పడకల సామర్థ్యానికి తగినట్లుగా అన్ని ఆస్పత్రులలో వైద్య సిబ్బంది, పారా మెడికల్‌ సిబ్బంది పూర్తి స్థాయిలో ఉండాలి. ఎక్కడ ఖాళీలున్నా వెంటనే వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహించండి. 48 గంటల్లో నియామకాలు పూర్తి చేయాలి.
  – సీఎం వైఎస్‌ జగన్‌

  సాక్షి, అమరావతి: కోవిడ్‌ నియంత్రణ, నివారణకు సంబంధించి 104కి ఫోన్‌ చేసిన మూడు గంటల్లోగా కోవిడ్‌ కిట్ల నుంచి బెడ్స్‌ వరకు ఏదైనా సరే వెంటనే కేటాయించాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. 104 కాల్‌సెంటర్‌ మరింత సమర్థంగా పనిచేసేలా కలెక్టర్లు దృష్టి సారించాలని సూచించారు. జిల్లా స్థాయిలో ప్రైవేట్‌ కోవిడ్‌ ఆస్పత్రులను క్లస్టర్లుగా విభజించి ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లతో నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది, పారా మెడికల్‌ సిబ్బంది పూర్తి స్థాయిలో ఉండాలని స్పష్టం చేశారు. ఖాళీల భర్తీకి వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహించి 48 గంటల్లోగా నియామకాలను పూర్తి చేయాలన్నారు.

  కోవిడ్‌ నియంత్రణకు ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని, మాస్క్‌లు ధరించాలని, శానిటైజర్లు వాడాలని విజ్ఞప్తి చేశారు. ఏ కార్యక్రమంలోనూ 50 మందికి మించి చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కోవిడ్‌పై పుకార్లు సృష్టించడం, తప్పుడు సమాచారం ప్రసారం చేయడం లాంటి చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరించడంతోపాటు అరెస్టు చేసి జైలుకు పంపాలని ఆదేశించారు.  కోవిడ్‌ నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌పై కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులకు సీఎం మార్గనిర్దేశం చేశారు. ‘స్పందన’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆ వివరాలివీ.. కోవిడ్‌ ఆస్పత్రులు–బెడ్లు: కోవిడ్‌ చికిత్స కోసం అన్ని జిల్లాల్లో 355 ఆస్పత్రులను కలెక్టర్లు గుర్తించగా వాటిలో 28,377 బెడ్లున్నాయి. ప్రస్తుతం 17,901 బెడ్లు ఆక్యుపై అయ్యాయి. ఆ ఆస్పత్రులలో వైద్యం పూర్తిగా ఉచితం. మందులు కూడా ఫ్రీగా ఇవ్వాలి. 
  కలెక్టర్లతో వీడియో కాన్ఫెరెన్స్‌లో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

  జేసీలు పూర్తి దృష్టి సారించాలి..
  జేసీలు (గ్రామ, వార్డు సచివాలయాలు – అభివృద్ధి) ఇక నుంచి కోవిడ్‌పైనే దృష్టి పెట్టాలి. ఆ అధికారి అదేపనిలో నిమగ్నం కావాలి. అప్పుడే అనుకున్న స్థాయిలో సేవలందించగలుగుతాం. ప్రభుత్వ ఆస్పత్రులు, కోవిడ్‌ చికిత్స చేస్తున్న ప్రైవేట్‌ ఆస్పత్రులు, కోవిడ్‌ చికిత్స అందించే ఆరోగ్యశ్రీ ఆస్పత్రులను కూడా జేసీ పర్యవేక్షించాలి. నాణ్యతతో కూడిన ఆహారం, శానిటేషన్, ఔషధాల లభ్యత, తగినంత మంది వైద్యులు, పారా మెడికల్‌ సిబ్బంది, హెల్ప్‌డెస్క్‌లు, ఆరోగ్యమిత్రలు, సీసీటీవీ కెమెరాలు పని చేస్తున్నాయా? లేదా? అన్నది ప్రతి రోజూ చూడాలి. దాదాపు 355 కోవిడ్‌ ఆస్పత్రులు (ప్రభుత్వ ఆస్పత్రులు, కోవిడ్‌ చికిత్సకు అనుమతించిన ప్రైవేట్‌ ఆస్పత్రులు, కోవిడ్‌ చికిత్స చేస్తున్న ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు) వద్ద నిరంతరం పర్యవేక్షణ జరగాలి. 

  కోవిడ్‌ కేర్‌ సెంటర్లు (సీసీసీ)..
  జిల్లాలో తగినన్ని కోవిడ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం అన్ని జిల్లాల్లో 59 సీసీసీలు పని చేస్తుండగా 33,327 బెడ్లున్నాయి. కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో నాణ్యతతో కూడిన ఆహారం, శానిటేషన్, ఔషధాల లభ్యత, వైద్యులు, పారా మెడికల్‌ సిబ్బంది, హెల్ప్‌ డెస్క్‌లు, ఆరోగ్యమిత్రలు, సీసీటీవీ కెమెరాలు, రోగులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నారా? లేదా? అన్నది ప్రతి కలెక్టర్‌ చూడాలి. ఎక్కడా బెడ్ల కొరత లేకుండా కలెక్టర్లు శ్రద్ధ చూపాలి.

  ఆక్సిజన్‌ సరఫరా..
  ప్రస్తుతం రోజుకు 320 నుంచి 340 మెట్రిక్‌ టన్నుల లిక్విడ్‌ ఆక్సిజన్‌ సరఫరా అవుతోంది. ఇది ప్రస్తుతానికి సరిపోతోంది. ఆక్సిజన్‌ అవసరమైన వారికి తప్పనిసరిగా వెంటనే ఇవ్వాలి. ఆక్సిజన్‌ లెవెల్‌ 94 కంటే తక్కువ ఉంటే వెంటనే అందచేసేలా చర్యలు తీసుకోవాలి.

  నిరంతర తనిఖీలు..
  జిల్లా స్థాయిలో కోవిడ్‌ ఆస్పత్రులను క్లస్టర్లుగా విభజించి ఇన్‌ఛార్జ్‌లను నియమించాలి. జిల్లా స్థాయి ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ల ద్వారా నిరంతర తనిఖీలు జరపాలి. అందులో ఔషధ నియంత్రణ విభాగం అధికారులు కూడా ఉంటారు. వీటన్నింటినీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం కోసం రాష్ట్ర స్థాయిలో ఒక టాస్క్‌ఫోర్స్‌ను కూడా ఏర్పాటు చేశాం.

  50 మందికి మించి వద్దు..
  ప్రజలు ఒకే చోట గుమికూడకుండా జాగ్రత్తలు పాటించాలి. పెళ్లిళ్లకు కేవలం 50 మందికి మాత్రమే అనుమతి ఉంది. జిమ్‌లు, పార్కుల్లో అందరూ ఒకేచోట చేరకుండా చూడాలి. ఎక్కడా ఆర్థిక కార్యకలాపాలు ఆగిపోకూడదు. అదే సమయంలో కోవిడ్‌ నిబంధనలు తప్పనిసరి. ఏ కార్యక్రమంలోనూ 50 మందికి మించి చేరకూడదు.

  వారి పట్ల కఠినంగా వ్యవహరించండి..
  పుకార్లు, తప్పుడు సమాచారం ప్రచారం చేసే వారిపట్ల కఠినంగా వ్యవహరించండి. అరెస్టు చేయండి. అలాంటి వారిని జైలుకు పంపే అధికారం కూడా మీకు (అధికార యంత్రాంగం) ఉందన్న విషయం మర్చిపోవద్దు. ఈ విషయంలో అవసరమైతే ఎస్పీలు కఠినంగా వ్యవహరించాలి. ప్రతి రోజూ అధికారిక బులెటిన్‌ ఇస్తారు. దాన్నే అందరూ తీసుకోవాలి. కోవిడ్‌ వల్ల ఇప్పటికే అందరూ భయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో లేనిపోని పుకార్లు సృష్టించి అసత్యాలు ప్రచారం చేస్తే, ప్రజల్లో ఆందోళన తీవ్రమవుతుంది. కాబట్టి అసత్య ప్రచారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించొద్దు.

  లాక్‌డౌన్‌తో ప్రజలకు నాలుగింతలు నష్టం..
  కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో కలెక్టర్లు వచ్చే కొద్ది నెలలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. లాక్‌డౌన్‌ వల్ల ప్రభుత్వానికి ఒక్క రూపాయి నష్టం కలిగితే సామాన్యుడికి నాలుగు రూపాయలు నష్టం వాటిల్లుతుంది. గత ఏడాది లాక్‌డౌన్‌ వల్ల ప్రభుత్వానికి దాదాపు రూ.20 వేల కోట్ల నష్టం జరిగితే ప్రజలకు దాదాపు రూ.80 వేల కోట్ల నష్టం జరిగింది.

  కోవిడ్‌తో కలసి జీవించక తప్పని పరిస్థితి..
  దేశంలో ప్రస్తుతం నెలకు 7 కోట్ల వాక్సిన్‌ ఉత్పత్తి జరుగుతుండగా అందులో కోవాక్సిన్‌ కోటి డోస్‌లు తయారవుతున్నాయి. మిగతాది కోవిషీల్డ్‌. రాష్ట్రంలో 45 ఏళ్లకు పైబడిన వారిలో ఇప్పటివరకు 11.30 లక్షల మందికి రెండు డోసులు, దాదాపు 45.48 లక్షల మందికి సింగిల్‌ డోస్‌ వ్యాక్సిన్‌ ఇచ్చారు. 18 – 45 ఏళ్ల వారికి కూడా వాక్సిన్‌ ఇస్తాం. అందరూ కోవిడ్‌తో కలసి జీవించక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. అయినప్పటికీ మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి. అందరికీ టీకాల కార్యక్రమం పూర్తయ్యే వరకు కోవిడ్‌ జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. 

  – ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, బొత్స సత్యనారాయణ, చీఫ్‌ కమిషనర్‌ ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్‌ సీఎస్‌ వై.శ్రీలక్ష్మి, గృహ నిర్మాణ శాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌జైన్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ గిరిజాశంకర్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ విజయకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

  Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/104-call-centre-more-popular-orders-cm-ys-jaganmohanreddy-1357154