రోగులకు అసౌకర్యం కల్పించే ప్రవేటు హాస్పిటల్స్ కి భారీ జరిమానా

    ప్ర‌స్తుత కరోనా వ్యాప్తి స‌మ‌యంలో సామాన్యులు ఎంత‌టి విప‌త్క‌ర ప‌రిస్థితుల‌ను ఎదుర్కుంటున్నారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇలాంటి స‌మ‌యాల్లో మాన‌వ‌త్వంతో వ్య‌వ‌హ‌రించాల్సిన ప్రవేట్ ఆస్ప‌త్రులు.. డ‌బ్బులు పిండుకుంటున్నాయి. మాన‌వీయ విలువ‌లు చూపించ‌కుండా.. ప్ర‌జ‌ల్ని పీడిస్తున్న ఆస్ప‌త్రుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలని సీఎం జ‌గ‌న్ ఆదేశించిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో కొవిడ్ చికిత్సలో నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేట్ ఆస్పత్రులపై విజిలెన్సు దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 72 కేసుల్లో వివిధ ప్రైవేట్ ఆస్పత్రులకు జరిమానా విధించినట్లు ఏపీ స‌ర్కార్ తెలిపింది. ఇటీవల చేసిన దాడుల్లో రూ.11.30 కోట్ల మేర ప్రైవేట్ ఆస్పత్రుల నుంచి జరిమానా వసూలు చేసినట్లు అధికారులు తెఇపారు. మొత్తం 94 ఫిర్యాదుల్లో 72 ఫిర్యాదులు ఆస్పత్రుల్లో అవకతవకలపై వచ్చాయని వివ‌రించారు. ఆస్పత్రుల్లో ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు కంటే అధికంగా ఛార్జీలు వసూలు చేయటం, అత్యవసర ఇంజెక్షన్ల విషయంలో అవకతవకలపై ఈ కంప్లైంట్లు అందినట్లు ప్రభుత్వం తెలిపింది. ఆస్పత్రుల వెలుపల కూడా మరో 22 కేసులు నమోదు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. గుంటూరు జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రుల నుంచి అత్యధికంగా రూ.4.53 కోట్ల మేర జరిమానా వసూలు చేసినట్లు స్పష్టం చేసింది.

    ఆరోగ్యశ్రీ పరిధిలోని ఆస్పత్రులతోపాటు తాత్కాలిక అనుమతి పొందిన ఆస్పత్రులు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఆరోగ్యశ్రీ కింద 50 శాతం పడకలు కేటాయించడంతో పాటు ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులను వసూలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. అధిక ఫీజులు వసూలు చేసిన ఆస్పత్రులకు జరిమానా వేయడంతోపాటు, కేసులు నమోదు చేసి క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అధికారులు హెచ్చ‌రిస్తున్నారు.

    Source: https://tv9telugu.com/andhra-pradesh/11-crore-30-lakh-fine-to-private-hospitals-in-ap-due-heavy-corona-fee-481668.html