కౌలుదారులకు పంట సాగుదారు హక్కు

  • ఈ నెల 30 వరకు ఆర్‌బీకేల వద్ద మేళాలు 
  • కొత్తగా 5 లక్షల మందికి సీసీఆర్‌సీల జారీ లక్ష్యం 
  • వీటి ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలుదారులకు రైతు భరోసా వర్తింపు 
  • ఇతరులకు రాయితీపై విత్తనాలు, పంట రుణాలు, సున్నా వడ్డీ రాయితీ, ఇన్‌పుట్‌ సబ్సిడీ, 
  • ఉచిత పంటల బీమా వంటి పథకాల వర్తింపు

  భూ యజమానులకు నష్టం వాటిల్లకుండా కౌలు రైతులకు (వాస్తవ సాగుదారులు) పంట సాగుదారు హక్కు పత్రాల (సీసీఆర్‌సీ)ను జారీ చేసేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఈ కార్యక్రమానికి శుక్రవారం శ్రీకారం చుట్టిన సర్కారు ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగించనుంది. రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బీకే) వద్ద సీసీఆర్‌సీ మేళాలను నిర్వహిస్తోంది. పంట సాగుదారు హక్కు పత్రాల (సీసీఆర్‌సీ) చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత గడచిన రెండేళ్లలో 6,87,474 మందికి సీసీఆర్‌సీలు జారీ చేయగా, 2021–22 వ్యవసాయ సీజన్‌కు సంబంధించి కొత్తగా మరో 5 లక్షల మందికి వాటిని జారీ చేయాలని నిర్ణయించింది. వీరందరికీ నిబంధనల ప్రకారం రైతు భరోసా, రాయితీపై విత్తనాలు, పంట రుణాలు, సున్నా వడ్డీ రాయితీ, ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఉచిత పంటల బీమా, కనీస మద్దతు ధర వంటి ప్రయోజనాలను వర్తింపచేయనుంది. 

  ప్రయోజనాలెన్నో.. 
  రాష్ట్రంలో 76,21,118 మంది రైతులుండగా.. వారిలో 16,00,483 మంది కౌలుదారులు ఉన్నారు. సాగు భూమిలో 70 శాతానికి పైగా వీరు కౌలుకు చేస్తుంటారని అంచనా. గతంలో వీరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందని ద్రాక్షగా ఉండేవి. ఆగస్టు 2019లో అమల్లోకి వచ్చిన పంట సాగుదారు హక్కు పత్రాల (సీసీఆర్‌సీ) చట్టం కౌలు రైతులకు రక్షణగా నిలిచింది. ఈ చట్టం కింద 11 నెలల కాల పరిమితితో జారీ చేస్తున్న కౌలు హక్కు పత్రాల ద్వారా విత్తనాలు, ఎరువులు, యంత్ర పరికరాలు రాయితీపై పొందడంతోపాటు తాము పండించిన పంటను కనీస మద్దతు ధరకు అమ్ముకునే వెసులుబాటు కలుగుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలు రైతులకు వైఎస్సార్‌ రైతు భరోసా కింద రూ.13,500 పెట్టుబడి సాయం అందుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టిలతోపాటు అన్నివర్గాల కౌలు రైతులకు ప్రభుత్వం అమలు చేస్తున్న పంట రుణాలు, సున్నా వడ్డీ రాయితీ, పంట నష్టపరిహారం, ఉచిత పంటల బీమా వంటి అన్ని పథకాల లబ్ధిని పొందే వెసులుబాటు కల్పించింది. భూ యజమానుల అంగీకారంతో ఇప్పటివరకు  సీసీఆర్‌సీలు పొందిన కౌలు రైతులు తమ పత్రాలను రెన్యువల్‌ చేసుకోవడంతో పాటు మరో 5 లక్షల మందికి కొత్తగా సీసీఆర్‌సీలు జారీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ఇందుకోసం మేళాలు నిర్వహిస్తోంది. మేళాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలుదారులకు సీసీఆర్‌సీలు జారీ చేసి.. వాటిని వైఎస్సార్‌ రైతు భరోసా పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయించడం ద్వారా వారికి ఈ ఏడాదికి సంబంధించి తొలి విడత వైఎస్సార్‌ రైతు భరోసా సాయం అందించాలని సంకల్పించింది. సాధ్యమైనంత ఎక్కువ మందికి భరోసా లబ్ధి చేకూర్చాలన్న సంకల్పంతో ఈ నెల 30వ తేదీ వరకు సీసీఆర్‌సీలు జారీ చేస్తారు. 

  భూ యజమానులు నిర్భయంగా ముందుకు రావచ్చు 
  సీసీఆర్‌సీ పత్రాలపై సంతకం చేసే విషయంలో భూ యజమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదు. 11 నెలల కాలంలో పండించిన పంటపై  తప్ప.. భూమిపై కౌలుదారులకు ఎలాంటి హక్కులు ఉండవు. దీనివల్ల భూ యజమానులు కౌలు రైతులకు రాయితీపై విత్తనాలు, వైఎస్సార్‌ రైతు భరోసా, పంట రుణాలు, సున్నా వడ్డీ రాయితీ, ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఉచిత పంటల బీమా, కనీస మద్దతు ధర రావడానికి  సహకరించిన వారవుతారు. సాగుదారులకు సీసీఆర్‌సీలు జారీ విషయంలో భూ యజమానులు నిర్భయంగా ముందుకు రావచ్చు.  
  – హెచ్‌.అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయ శాఖ 

  Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/landowners-need-not-worry-about-signing-ccrc-documents-1370558