క్రిస్‌ సిటీ – పారిశ్రామిక నగర నిర్మాణంలో కీలక అడుగు

  • క్రిస్‌ సిటీకి పర్యావరణ అనుమతులు 
  • మంజూరు చేసిన కేంద్ర పర్యావరణ శాఖ
  • కృష్ణపట్నం వద్ద 11,095.9 ఎకరాల్లో రూ.5,783.84 కోట్లతో నిర్మాణం 
  • జ్యుడిషియల్‌ ప్రివ్యూ ఆమోదం
  • త్వరలో టెండర్లు పిలవనున్న ఏపీఐఐసీ

రాష్ట్ర ఫ్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న క్రిస్‌ సిటీ పారిశ్రామిక నగర నిర్మాణంలో కీలక అడుగు పడింది. కేంద్ర పర్యావరణ శాఖ పూర్తిస్థాయి అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. పర్యావరణానికి ఎటువంటి హాని లేకుండా, వ్యర్థాలను శుద్ధి చేయాలని, భూగర్భ జలాలను, సహజ సిద్ధంగా ఉన్న కాలువలు, చెరువులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా నిర్మాణం చేపట్టాలని  ఉత్తర్వుల్లో పేర్కొంది. తొలి దశ ప్రాజెక్టుకు జ్యుడిషియల్‌ ప్రివ్యూ ఆమోదం కూడా లభించింది.

చెన్నై–బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లోభాగంగా కృష్ణపట్నం వద్ద మొత్తం 11,095.9 ఎకరాల్లో రూ.5,783.84 కోట్లతో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. నిక్‌డిట్‌ నిధులతో అభివృద్ధి చేస్తున్న క్రిస్‌ సిటీ కోసం ఏపీఐఐసీ నిక్‌డిట్‌ కృష్ణపట్నం ఇండస్ట్రియల్‌ సిటీ డెవలప్‌మెంట్‌ లిమిటెడ్‌ పేరుతో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసింది. టెక్స్‌టైల్, ఆటోమొబైల్, ఫుడ్‌ ప్రాసెసింగ్, ఇంజనీరింగ్, ఎంఎస్‌ఎంఈ రంగాల పరిశ్రమలను ఇక్కడ ఏర్పాటు చేస్తారు.

ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకొస్తే 2,96,140 మందికి ప్రత్యక్షంగా, 1,71,600 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని అంచనా. తొలిదశలో 2,006.09 ఎకరాలు అభివృద్ధి చేస్తారు. తొలి దశకు రూ.1,500 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. తొలి దశ నిర్మాణానికి జ్యుడిషియల్‌ ప్రివ్యూ నుంచి కూడా ఆమోదం లభించిందని, త్వరలోనే టెండర్లు పిలుస్తామని ఏపీఐఐసీ చీఫ్‌ ఇంజనీర్‌ శ్రీనివాస్‌ ప్రసాద్‌ తెలిపారు. సుమారు రూ.1,054.63 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలుస్తారు. క్రిస్‌ సిటీ నిర్మాణ సమయంలో రోజుకు 500 కిలో లీటర్లు, ప్రాజెక్టు పూర్తయ్యాక పరిశ్రమలకు రోజుకు 99.7 మిలియన్‌ లీటర్ల నీరు అవసరమవుతుందని అంచనా వేశారు. ఈ నీటిని 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న కండలేరు రిజర్వాయర్‌ నుంచి సరఫరా చేయనున్నారు.

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/environmental-permits-kris-city-ap-1455547