క్రీడాంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా స్పోర్ట్స్‌ క్లబ్ ల ఏర్పాటు

ప్రతిభ ఉన్నా సరైన గుర్తింపు లభించని గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా స్పోర్ట్స్‌ క్లబ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక, క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. గ్రామీణ స్థాయి స్పోర్ట్స్‌ క్లబ్‌ల ఏర్పాటుపై గురువారం తిరుపతిలో మంత్రి రోజా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గుర్తింపు, ప్రోత్సాహం లేకపోవడం వల్ల వెనకబడిపోతున్న క్రీడాకారులకు అండగా ఉండేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

ప్రభుత్వంతో పాటు దాతలు కూడా క్రీడా క్లబ్‌లకు తగిన సహకారం అందించాలని కోరారు. క్రీడాంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా స్పోర్ట్స్‌ క్లబ్‌లు, పాలసీ తీసుకొస్తున్నామని చెప్పారు. సీఎం జగన్‌ పాలనలో క్రీడా రంగానికి మంచి గుర్తింపు లభించిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో గెలిచిన వారికి ప్రభుత్వం కోట్లాది రూపాయల నగదు ప్రోత్సాహకం అందజేసిందని గుర్తుచేశారు. ఉద్యోగాలు, అకాడమీలకు భూములు కూడా కేటాయించి ప్రోత్సహిస్తోందని వివరించారు.

క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్, శాప్‌ ఎండీ ఎన్‌.ప్రభాకర్‌రెడ్డి  మాట్లాడుతూ.. ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించేందుకు విద్యా శాఖతో కలిసి సంయుక్తంగా స్పోర్ట్స్‌ క్లబ్‌లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో శాప్‌ అధికారులు, కోచ్‌లు, కళాశాలల పీడీలు, క్రీడా సంఘాల ప్రతినిధులు, క్రీడాకారులు పాల్గొన్నారు. 

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/rk-roja-comments-sports-clubs-andhra-pradesh-1450575