గన్నవరం ఎయిర్ పోర్ట్ లో కొత్త రన్‌వే ప్రారంభం

    గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణలో భాగంగా నూతనంగా నిర్మించిన రన్‌వే ను ఈనెల 15న ప్రారంభించనున్నట్లు కలెక్టర్‌ జె. నివాస్‌ తెలిపారు. బుధవారం నగరంలోని కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ గిరి మధుసూదనరావు జిల్లా కలెక్టర్‌ను కలిసి విమానాశ్రయ విస్తరణ పనుల గురించి వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ నివాస్‌ మాట్లాడుతూ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం 700 ఎకరాల్లో విస్తరణ పనులు చేపట్టామని తెలిపారు. ఈ పనులకు సంబంధించి ఎయిర్‌ పోర్టు అథారిటీకి జిల్లా యంత్రాంగం అవసరమైన సహకారాన్ని అందిస్తామన్నారు.

    ఇంకా పెండింగ్‌లో ఉన్న భూసేకరణ, రహదారుల విస్తరణకు సంబంధించి రెవెన్యూ అధికారులతో సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. విమానాశ్రయంలో చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని విమానాశ్రయం సమీపంలో ఏర్పాటు చేయనున్న ప్‌లై ఓవర్‌కు సంబంధించి అవసరమైన ప్రతిపాదనలను కూడా సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్‌ నివాస్‌ అధికారులను కోరారు. ఈ సమావేశంలో జీఎం మహ్మద్, వివిధ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

    Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/vijayawada-airport-new-runway-inaugurates-july-15-1375324