గిరిజనుల ఉపాధికి జీసీసీ భరోసా

  • విశాఖ ఏజెన్సీ అరకు సంతబయలులో గిరిజన ఉత్పత్తులను కొనుగోలుచేస్తున్న జీసీసీ అధికారులు
  • అటవీ, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుతో అండగా నిలుస్తున్న సంస్థ

అడవినే నమ్ముకుని కొండ కోనల్లో నివసించే గిరిజనులకు రాష్ట్ర గిరిజన కో ఆపరేటివ్‌ కార్పొరేషన్‌ (జీసీసీ) అండగా నిలుస్తోంది. వారు సేకరించే అటవీ ఉత్పత్తులతో పాటు పండించే పంటలను కొనుగోలు చేస్తూ ఆర్థికంగా లబ్ధి చేకూరుస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఏజెన్సీ ప్రాంతాలతో పాటు శ్రీశైలం ఐటీడీఏ పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలోని సుమారు లక్షన్నర గిరిజన కుటుంబాలకు జీవనోపాధిని కల్పిస్తోంది. గిరిజనులు జొన్న, సజ్జలు, రాగులు, కంది పంటలతో పాటు అక్కడక్కడా వరి పండిస్తున్నారు. తేనె, కుంకుళ్లు, చింతపండు, ఉసిరి తదితర అటవీ ఉత్పత్తులు సేకరిస్తుంటారు.

గిరిజనులు తమ గ్రామాలను వదిలి బయటకు రావాల్సిన అవసరం లేకుండా ఎక్కడికక్కడ ఏర్పాటు చేసిన 962 డిపోల ద్వారా ఆయా ఉత్పత్తులన్నిటినీ జీసీసీ కొనుగోలు చేస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు రూ.5.23 కోట్ల విలువైన 6,320.30 క్వింటాళ్ల వ్యవసాయ, అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించి, రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించిన అటవీ ఉత్పత్తుల కొనుగోలు విషయంలో మద్దతు ధరను ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకుని అమలు చేస్తోంది. కేవలం అటవీ ఉత్పత్తులు సేకరించే గిరిజన కుటుంబాలకు రూ.98.19 లక్షలు జీసీసీ ద్వారా అందాయి.

కాఫీ రైతులకు ప్రోత్సాహం
మరోవైపు ప్రభుత్వ ప్రోత్సాహంతో అనువైన చోట కాఫీ తోటల పెంపకాన్ని గిరిజనులు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఇప్పటివరకు రూ.1.21 కోట్ల  విలువైన 2,005.16 క్వింటాళ్ల అరబికా ఫార్చెమెంట్, అరబికా చెర్రీ, రోబస్టా చెర్రీ రకం కాఫీ గింజలను జీసీసీ సేకరించింది. అదే సమయంలో 760 గిరిజన కాఫీ రైతు కుటుంబాలకు రూ.1.36 కోట్ల వ్యవసాయ పరపతి కల్పించింది. గిరిజనుల అవసరాలు తీర్చడంపై జీసీసీ దృష్టి కేంద్రీకరిస్తోంది. 16 పెట్రోల్‌ బంకులు, 10 ఎల్‌పీ గ్యాస్‌ పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేసింది. వీటి ద్వారా 11,704.32 కోట్ల విలువైన పెట్రోల్, గ్యాస్, కందెనల అమ్మకాలు చేపట్టింది. అలాగే ‘గిరిజన్‌’ బ్రాండ్‌ కింద అటవీ ఉత్పత్తులతో తయారయ్యే సబ్బులు, కారం, పసుపు పొడుల వంటి వస్తువులకు రూ.16.01 కోట్ల విలువైన మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించింది.

75 వన్‌ధన్‌ వికాస్‌ కేంద్రాల ఏర్పాటు
ప్రధానమంత్రి వన్‌ధన్‌ వికాస్‌ యోజన ద్వారా 21,280 మంది సభ్యులతో కూడిన 1,125 గ్రూపులతో 75 వన్‌ధన్‌ వికాస్‌ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జీసీసీ ఆధ్వర్యంలో ఈ కేంద్రాలు అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేయడమే కాకుండా గ్రామాల్లోనే శుద్ధి (ప్రాసెసింగ్‌) చేయడం ద్వారా ఉత్పత్తులకు అదనపు విలువను జోడిస్తారు. ఈ విధంగా తయారైన వస్తువులను సభ్యులు తిరిగి జీసీసీకి లేదా తమకు ఇష్టమొచ్చిన చోట అమ్ముకునే వెసులుబాటు కల్పించారు. ఈ వన్‌ధన్‌ వికాస్‌ కేంద్రాలు కొత్తగా మరో 188 ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించింది.