గిరిజనుల కోసం ప్రత్యేక విద్యాకార్యక్రమాలు

రాష్ట్రంలో 8 ప్రత్యేక  గిరిజన బాలికల డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు సన్నాహాలు

ఇంతవరకు పట్టణ ప్రాంతాలకే పరిమితం అయిన ఇంజనీరింగ్‌, మెడికల్‌ విద్య ఇక నుంచి గిరిజనులకు కూడా అందుబాటులోకి రానుంది. విజయనగరం జిల్లాలో గిరిజన యూనివర్సిటీ, ఇంజనీరింగ్‌ కళాశాల, విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ట్రైబల్‌ మెడికల్‌ కాలేజీ ఏర్పాటు కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే విజయనగరం జిల్లా సాలూరులో ట్రైబల్‌ యూనివర్సిటీని మంజూరు చేసింది. ఈ కళాశాలల నిర్మాణాలకు సంబంధించి పనులు ప్రారంభించేందుకు గాను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల ఆన్‌లైన్‌ ద్వారా శంకుస్థాపన చేశారు.

విజయనగరం జిల్లాలో ట్రైబల్‌ యూనివర్సిటీ
విద్యా ప్రమాణాల మెరుగు కోసం, ఎందరో గిరిజనుల బతుకుల్లో విద్యా సౌరభాలు నింపడానికి గిరిజన విశ్వవిద్యాలయం విజయనగరం జిల్లాలో ఏర్పాటైంది. సాలూరు నియోజకవర్గంలోని పాచిపెంట, రామభద్రాపురం మండలం కోటక్కి మధ్య సెంట్రల్‌ ట్రైబల్‌ వర్సిటీ నిర్మాణం జరగనుంది. సాలూరు, బొబ్బిలి నియోజకవర్గాలను కలుపుతూ ఈ వర్సిటీ ఉంటుంది. సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. యూనివర్సిటీ రెండు సంవత్సరాల క్రితమే ప్రారంభమైంది. ప్రస్తుతం విజయనగరంలోని ఆంధ్రా యూనివర్సిటీ పీజీ సెంటర్‌లో దీన్ని నిర్వహిస్తున్నారు. భవనాల నిర్మాణాలు పూర్తి కాగానే కొత్త భవనాల్లోకి విద్యార్థులు ప్రవేశిస్తారు. ఇక్కడ మొత్తం ఏడు కోర్సులు ఉన్నాయి. ప్రతి కోర్సులో 20 సీట్లు ఉన్నాయి. మొత్తం 140 సీట్లు యూనివర్సిటీలో అందుబాటులో ఉన్నాయి.

కోర్సుల వివరాలు
ఎమ్మెస్సీ కెమిస్ట్రీ (మెడిసినల్‌ కెమిస్ట్రీ), మాస్టర్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌, మాస్టర్‌ ఆఫ్‌ జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌, ఇంటిగ్రేటెడ్‌ బీఎస్సీ (ఎంపీసీ) + ఎమ్మెస్సీ కెమిస్ట్రీ (స్పెషలైజేషన్‌ మెడిసినల్‌ కెమిస్ట్రీ), ఇంటిగ్రేటెడ్‌ బీబీఏ+ ఎంబీఏ (ట్రావెల్‌ టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌), బీఎస్సీ + ఎమ్మెస్సీ జియాలజీ, పీజీ డిప్లొమా ఇన్‌ ట్రావెల్‌ టూరిజం, అండ్‌ హాస్పటాలిటీ మేనేజ్‌మెంట్‌.

యూనివర్సిటీలో చదువుకునేందుకు గిరిజనులు, గిరిజనేతరులు దరఖాస్తు చేసుకోవచ్చు. సెంట్రల్‌ యూనివర్సిటీ మాదిరిగానే రిజర్వేషన్లు అమలు చేస్తారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రస్తుతం ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఎంట్రెన్స్‌ పరీక్ష నిర్వహించి వర్సిటీ ప్రవేశాలు కల్పించింది. కొత్త భవనాలు వచ్చి పూర్తి సౌకర్యాలు ఏర్పాటైన తరువాత ఇందులో రీసెర్చ్‌ కోర్స్‌లు కూడా ప్రారంభమవుతాయి. ప్రస్తుతం ట్రైబల్‌ యూనివర్సిటీకి విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ) మెంటార్‌గా వ్యవహరిస్తోంది. గిరిజన విశ్వవిద్యాలయానికి కావలసిన మౌలిక సదుపాయాలు, అకడమిక్‌ వ్యవహారాల్లో ఏయూ తన సహాయ సహకారాన్ని అందిస్తోంది. అలాగే, విజయనగరం జిల్లా కురుపాం మండలం తేకరఖండి గ్రామంలో గిరిజన ఇంజనీరింగ్‌ కళాశాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. దీనికి 105.32 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల నిర్ణయం తీసుకుంది. రూ.153 కోట్లతో నిర్మించనున్న ఈ ఇంజనీరింగ్‌ కాలేజీ 2021-22 విద్యాసంవత్సరం నుంచి అందుబాటులోకి రానుంది. ఇందులో ఈసీఈ, సీఎస్‌ఈ, సివిల్, మెకానికల్, ఈఈఈ బ్రాంచిలు అందుబాటులో ఉండనున్నాయి. ఈ కళాశాల జేఎన్‌టీయూ- కాకినాడకు అనుబంధంగా ఉంటుంది. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి ఈ ప్రాంతం నుంచి బయటకు వచ్చి..శ్రీకాకుళం జిల్లా దాటి విశాఖ జిల్లాకు వెళుతున్నారు. ఈ ఇంజనీరింగ్‌ కళాశాల నిర్మాణం పూర్తి అయితే ఇక నుంచి ఆ సమస్య కూడా తీరిపోతుంది.  

విశాఖ జిల్లాలో వైఎస్సార్‌ ట్రైబల్‌ మెడికల్‌ కళాశాల
విశాఖ జిల్లాలోని మన్యం విద్యార్థులు మెడికల్‌ విద్యను తమ ముంగిట్లోనే చదువుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోంది. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన పాడేరులో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ ట్రైబల్‌ మెడికల్‌ కళాశాలను ఏర్పాటు చేస్తోంది. ఈ కాలేజీ నిర్మాణానికి ఇప్పటికే రూ.500 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. మొత్తం 35.01 ఎకరాల్లో 17 భవనాలు నిర్మిస్తున్నారు. ఈ మెడికల్‌ కళాశాల భవన నిర్మాణాలు మూడేళ్లలో పూర్తి కానున్నాయి. భవన నిర్మాణాలను పరిశీలించి కేంద్రం అనుమతి ఇస్తుంది. అంటే మూడేళ్లలో ఈ కళాశాల అందుబాటులోకి రానుంది.  

గిరిజన జూనియర్‌ బాలికల కాలేజీల ఏర్పాటు
గిరిజన సంక్షేమ శాఖ ఎనిమిది జూనియర్‌ కాలేజీలను నిర్మించడానికి ప్రతిపాదనలు తయారు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఒక్కో కాలేజీలో మొదటి సంవత్సరంలో 160 మంది, రెండో సంవత్సరంలో 160 మందిని చేర్చుకుంటారు. ఇవన్నీ బాలికల కాలేజీలు కావడం విశేషం.

కాలేజీలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తారంటే…
1. శ్రీకాకుళం జిల్లా భామిని, మెలియాపుట్టి
2. విశాఖ జిల్లా కొయ్యూరు మండలం మర్రిపాలెం, చింతపల్లి మండలం లోతుగెడ్డ
3. తూర్పు గోదావరి జిల్లా చింతూరు
4. పశ్చిమ గోదావరి జిల్లా ముక్కునూరు
5. గుంటూరు జిల్లా బొల్లాపల్లి
6. నెల్లూరు జిల్లా ఓజిలి గ్రామాల్లో కాలేజీలు నెలకొల్పనున్నారు.

రూపుమారిన గిరిజన గురుకులాలు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక గురుకుల విద్యాసంస్థల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఈ విద్యాసంస్థల్లో అత్యాధునికమైన వర్చువల్‌ తరగతి గదుల వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో పాటుగా విద్యాసంస్థల కేంద్రీకృత పర్యవేక్షణ కోసం కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాన్ని, సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసి గిరిజన విద్యలో విప్లవాత్మకమైన మార్పులను ప్రభుత్వం తెచ్చింది. అలాగే, విద్యార్థులకు ఆరోగ్యకరమైన వాతావరణంలో వంటలు చేసి వడ్డించాలన్న లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గిరిజన గురుకులాల్లో వంటగదుల యాంత్రీకరణ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రయోగాత్మకంగా చేపట్టింది.