గిరిజన గ్రామాల అభివృధ్ధిలో ప్రత్యేక మొబైల్‌ యాప్‌

ఏపీలో గిరిజన గ్రామాల వివరాలు, అక్కడి మౌలిక సదుపాయాలను తెలుసుకోవడం ఇకపై సులభతరం కానుంది. అందుకోసం గిరిజన సంక్షేమ ఐటీ విభాగం ప్రత్యేక మొబైల్‌ యాప్‌ను రూపొందించింది. గ్రామాల్లోని ఆరోగ్య కేంద్రాలు, రోడ్లు, భవనాలు, పాఠశాలలు లాంటి అన్ని మౌలిక సదుపాయాలను, ఇతర ఆస్తులను సర్కారీ విభాగాలు తెలుసుకునేందుకు ఈ మొబైల్‌ అప్లికేషన్‌ ఉపయోగపడుతుంది.

ఏపీ సెంటర్‌ ఫర్‌ ఫైనాన్షియల్‌ సిస్టమ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ గిరిజన గ్రామాలకు చెందిన మొత్తం సమాచారాన్ని ఆయా విభాగాల నుంచి సేకరించి క్రోడీకరిస్తుంది. త్వరలో ఈ యాప్ అందుబాటులోకి రానుంది. దీన్ని ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో చూసుకోవచ్చు. మొబైల్, కంప్యూటర్‌ సిస్టమ్‌లో డౌన్‌లోడ్ కూడా‌ చేసుకోవచ్చు. ఈ యాప్‌లో గ్రామ ప్రొఫైల్‌లో గృహాలు, జనాభా వివరాలు, పెన్షనర్ల సంఖ్య, డ్వాక్రా సంఘాల సంఖ్య, సంక్షేమ సహాయకుడి పేరు, గ్రామ వాలంటీర్ల సంఖ్య, వ్యవసాయ భూమి ఎన్ని ఎకరాలు ఉందనే వివరాలు ఉంటాయి.

ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రొఫైల్‌లో 35 ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన వివరాలు ఉంటాయి. వ్యవసాయం, ఏపీఎస్‌ఆర్‌టీసీ, విద్య, వినోదం, పాడి, పశుసంవర్థక, పోలీస్‌స్టేషన్, ఆర్టీఏ, రెవెన్యూ విభాగం, గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్, ఫైబర్‌నెట్, ఫిషరీస్, ఫుడ్‌– సివిల్‌ సప్లైస్, ఫైనాన్స్, ఫైర్‌ స్టేషన్, ఫారెస్ట్, జీసీసీ, హెల్త్, హార్టికల్చర్, ఐటీడీఏ, ఇరిగేషన్‌ సోర్స్, గ్యాస్‌ అండ్‌ పెట్రోల్, జువెనైల్‌ వెల్ఫేర్, లేబర్‌ విభాగం, పంచాయతీ రాజ్,సెర్ప్, స్వయం సహాయక బృందాలు, వసతి గృహాలు, టెలికాం, వెటర్నరీ, మహిళ– శిశు సంక్షేమం, సెరికల్చర్, నైపుణ్యాభివృద్ధి, ఇతర విభాగాలు ఉన్నాయి. హెల్త్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ ద్వారా రోగులకు వైద్య సాయాన్ని అందించే అనువర్తనాన్ని ఈ అప్లికేషన్‌లో డెవలప్ చేశారు. డ్యాష్‌ బోర్డులో పూర్తి వివరాలు ఉంటాయి.