సమగ్ర వ్యవసాయంలో అడవి బిడ్డల అద్భుత సాగు

  • రబ్బరును ప్రాసెసింగ్‌ చేస్తున్న గిరిజనులు
  • సాగులో మెళకువలు తెలుసుకుంటూ.. సాంకేతిక శిక్షణ పొందుతూ..
  • చిరుధాన్యాలు, రబ్బరు ప్రాసెసింగ్‌తో లాభాల ఆర్జన
  • మేకలు, పెరటి కోళ్లు, తేనెటీగల పెంపకంతో అదనపు ఆదాయం
  • సామాజిక చెరువుల్లో చేపల సాగుతో రెట్టింపు సంపాదన
  • విస్తరాకుల తయారీతో గిరిజన మహిళలకు జీవనోపాధి
  • విలువ ఆధారిత ఉత్పత్తుల ఎగుమతులు కూడా..
  • కేవీకే ద్వారా క్షేత్రస్థాయికి వైఎస్సార్‌ ఉద్యాన వర్సిటీ పరిశోధనలు
  • గిరిజనులకు తోడ్పాటునందిస్తున్న పందిరిమామిడి విజ్ఞాన కేంద్రం

కొండవాలు ప్రాంతాల్లో సంప్రదాయ పంటలు పండించుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న అడవి బిడ్డలు ఇప్పుడు అద్భుతాలు సృష్టిస్తున్నారు. సమగ్ర వ్యవసాయ విధానంలో పంటలు పండిస్తూ తమ సుస్థిరాభివృద్ధికి బాటలు వేసుకుంటున్నారు. వైఎస్సార్‌ ఉద్యాన వర్సిటీ పరిశోధనా ఫలితాలను పందిరిమామిడి కృషి విజ్ఞాన కేంద్రం క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంతో పాటు ప్రభుత్వం తరఫున వారికి అవసరమైన ఆర్థిక తోడ్పాటునిస్తోంది. దీంతో వారు సాగులో మెళకువలు, సాంకేతిక శిక్షణ పొందుతూ సంతృప్తికర స్థాయిలో ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. జీవన ప్రమాణాలను మెరుగుపర్చుకుంటూ పిల్లలనూ బాగా చదివించుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంత గిరిజనులు సాగులో సాధిస్తున్న విజయాలపై ప్రత్యేక కథనం..

సమగ్ర వ్యవసాయ విధానంలో వరి ఆధారిత పంట–పాడి–మత్స్య సాగు చేసేందుకు కృషి విజ్ఞాన కేంద్రం అడవి బిడ్డలను ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా జీడి మామిడి అంటు కట్టు విధానం, అపరాలు, చేపల సాగు, రబ్బర్, చిరు ధాన్యాలు, జీడి మామిడి ప్రాసెసింగ్, మేకలు, గొర్రెలు, పెరటి కోళ్లు, తేనెటీగలు, పుట్ట గొడుగులు, నర్సరీ పెంపకంతో పాటు పనసతో సహా వివిధ రకాల పంటల విలువాధారిత ఉత్పత్తులు, వర్మీ కంపోస్ట్‌ తయారీపై గడిచిన మూడేళ్లుగా గిరిజనులకిస్తున్న శిక్షణ కార్యక్రమాలు ఇప్పుడు సత్ఫలితాలిస్తున్నాయి. ఎంతలాగంటే.. మత్స్య సంపద ద్వారా 57 శాతం, వరి సాగు ద్వారా 24 శాతం, ఉద్యాన పంటల ద్వారా 5.13 శాతం, మేకల పెంపకం ద్వారా 4.8 శాతం ఆదాయాన్ని వీరు ఆర్జిస్తున్నారు.

రెట్టింపు ఆదాయమే లక్ష్యంగా..
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న శిక్షణతో ఏజెన్సీలో చిరుధాన్యాల సాగు రెండేళ్లలో  గణనీయంగా పెరిగింది. వీటిని ప్రాసెస్‌ చేసి అమ్మడం ద్వారా గిరిజనులు ఏటా రూ.27వేల ఆదాయాన్ని అదనంగా ఆర్జించగలుగుతున్నారు. అలాగే..
► రబ్బరు సాగును ప్రోత్సహించేందుకు కేవీకే ద్వారా సాగులో మెళకువలపై అధికారులు రెండేళ్లుగా శిక్షణనిస్తూనే రబ్బర్‌ టాపింగ్, ప్రాసెసింగ్‌ పరికరాలు సమకూర్చుతున్నారు. దీంతో నేడు ఎగుమతి చేయదగ్గ నాణ్యమైన రబ్బర్‌ షీట్‌లను ఉత్పత్తి చేయగలుగుతున్నారు. ఆరునెలల పాటు సేకరించే రబ్బర్‌ పాల ద్వారా ఒక్కో రైతు రూ.2.5 లక్షలు ఆర్జిస్తున్నారు. 


తేనెటీగల పెంపకం యూనిట్‌లో ఉత్పత్తిని పరిశీలిస్తున్న గిరిజన రైతులు

► అటవీ ప్రాంతంలో విరివిగా లభించే అడ్డాకుల ద్వారా గిరి మహిళల ఆర్థికాభివృద్ధికి బాటలు వేయాలన్న సంకల్పంతో మారేడుమిల్లి మండలం బోధగండి పంచాయతీ మంగంపాడు గ్రామంలో విస్తరాకుల పరిశ్రమను ఏర్పాటుచేశారు. ఫలితంగా నేడు ఒక్కో మహిళ రూ.3వేల పెట్టుబడితో నెలకు రూ.18వేలు ఆర్జిస్తోంది. 
► పెరటి కోళ్ల పెంపకం ద్వారా మరింత ఆదాయం ఆర్జించేందుకు వీలుగా  హైదరాబాద్‌లోని జాతికోళ్ల పరిశోధనా కేంద్రం నుంచి శ్రీనిధి, వనశ్రీ, వనరాజా, గాగస్, అశీల్, కడక్నాథ్‌ వంటి మేలు జాతి కోడి పిల్లలను అధికారులు తెప్పించి పంపిణీ చేస్తున్నారు. వీటి పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక శిక్షణనిస్తున్నారు. ఇలా ప్రతిఏటా 2వేల కోళ్లను 200 గిరిజన మహిళలకు అందజేస్తుండడంతో ఇళ్ల వద్దే ఉంటూ గిరిజన మహిళలు అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు.
► మేకలు, గొర్రెల పెంపకాన్ని లాభసాటిగా మార్చేందుకు హింగోలిలో కేవీకే అభివృద్ధి చేసిన అధిక వ్యాధి నిరోధకశక్తి కలిగిన ఉస్మానాబాది రకం మేకలను ఒక్కొకరికి మూడు చొప్పున ఇస్తున్నారు. 10–12 నెలల వయస్సు వరకు పెంచిన తర్వాత ఒక్కోదాన్ని రూ.8వేల నుంచి రూ.10వేల విక్రయిస్తూ అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. 


► ఇక పనస విలువాధారిత ఉత్పత్తుల తయారిపైనా శిక్షణనివ్వడంతో గిరిజనులు ప్రతినెలా రూ.12వేల అదనపు ఆదాయం పొందుతున్నారు. 
► తేనెటీగల పెంపకంపైనా శిక్షణనివ్వడంతో సొంత పొలాలతో పాటు అటవీ ప్రాంతంలో కూడా విలువాధారిత తేనె ఉత్పత్తును తయారుచేస్తున్నారు. తద్వారా ఏటా రూ.40 వేల అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. 
► అంతేకాదు.. పుట్ట గొడుగుల పెంపకం యూనిట్లను ఏర్పాటుచేసి పాల పుట్ట గొడుగులు, గులాబీ, తెలుపు ముత్యపు చిప్ప పుట్ట గొడుగుల పెంపకంపై తర్ఫీదు ఇస్తున్నారు.

గిరిజన రైతులకు మేకల యూనిట్‌ను అందజేస్తున్న అధికారులు 

పెట్టుబడి పోనూ 50వేలు మిగులుతోంది
నేను పదో తరగతి చదువుకున్నా. నాకున్న రెండున్నర ఎకరాల్లో వర్షాధారంపై ఆధారపడి కొర్రలు, రాగులు పండించి సంతలకుపోయి అమ్ముకుంటే పెట్టుబడి పోను రూ.17,500 మిగిలేది. ప్రభుత్వం మినీ మిల్లెట్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను అందించింది. ప్రాసెసింగ్‌ చేసి ఎలా అమ్మాలో స్థానిక కేవీకే ద్వారా శిక్షణ పొందాను. ఇప్పుడు అదనంగా మరో రూ.32,300 ఆదాయం వస్తోంది. మొత్తం మీద రూ.49,800 మిగులుతోంది.
– పల్లలబొజ్జ్డి నారాయణరెడ్డి, బొద్దగుంట, వై.రామవరం మండలం

మేకల పెంపకంతో అదనపు ఆదాయం
గతంలో నాలుగు ఎకరాల్లో వరి, మినుము, కందులు సాగుచేసేవాడిని. పంట పండితే నాలుగు డబ్బులు లేకుంటే పస్తులుండాల్సి వచ్చేది. స్థానిక కేవీకే ద్వారా ఉస్మానాబాదీ రకానికి చెందిన రెండు మేకలు, ఓ మేకపోతు తీసుకున్నా. ఈతకు రెండు పిల్లల చొప్పున ఏడాదికి నాలుగు పిల్లలు వస్తున్నాయి. మరోవైపు.. వ్యవసాయం ద్వారా ఏటా రూ.55వేల ఆదాయం.. ఏటా 3–4 మేకలను అమ్ముకోవడం ద్వారా అదనంగా మరో రూ.24వేలు వస్తోంది.
– కంగల రామస్వామి దొర, ఐ.పోలవరం, రంపచోడవరం మండలం 

నెలకు రూ.11,500 ఆదాయం
రెండేళ్ల క్రితం మాకు శ్రీనిధి, వనశ్రీ, గఘస్‌ కోళ్లను అందించారు. పొలం పనులు చేసుకుంటూ వాటిని పెంచుకుంటున్నా. ఏడాది వయస్సున్న కోడిని రూ.500 నుంచి రూ.600లకు అమ్ముతున్నా. గుడ్లు, కోళ్ల అమ్మకాల ద్వారా నెలకు రూ.11,500 నికర ఆదాయం వస్తోంది.
– కాలుం రామతులసి, ఐ.పోలవరం, రంపచోడవరం మండలం

సొంతంగా మార్కెటింగ్‌ 
మూడేళ్ల క్రితం తేనెటీగల పెంపకాన్ని చేపట్టా. శిక్షణ, సాంకేతిక సలహాలతో సొంత పొలంతో పాటు అటవీ ప్రాంతంలో తేనెటీగల పెంపకం యూనిట్లు పెట్టా. 3 నెలలకోసారి 60 కేజీల తేనె, 20 కేజీల మైనం తీస్తున్నా. వాటి ద్వారా నెలకు రూ.16వేల చొప్పున ఆర్జిస్తున్నా. గతేడాది నుంచి తేనె విలువా«ధారిత ఉత్పత్తులైన మురబ్బ, అల్లం తేనె, విప్పపువ్వు తేనేలతో పాటు మైనంతో తయారుచేసిన క్రాక్‌క్రీమ్, లిప్‌బామ్‌ వంటి ఉత్పత్తులను తయారుచేసి ‘గిరిమధుర నేచురల్‌ ప్రొడక్టŠస్‌’ పేరిట మార్కెటింగ్‌ చేస్తున్నా. 
– జగతా భావన కృష్ణ, రంపచోడవరం

సాంకేతికంగా ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యం
ప్రభుత్వాదేశాల మేరకు గిరిజనుల్లో ఆదాయ వనురులను పెంపొందించడమే లక్ష్యంగా ఉద్యాన వర్సిటీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున విస్తరణ కార్యక్రమాలు అమలుచేస్తున్నాం. మైదాన ప్రాంతాల్లో మాదిరిగానే ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన  రైతులను సాంకేతికంగా ముందుకు తీసుకెళ్లేందుకు శిక్షణతో పాటు ఆర్థిక తోడ్పాటునూ అందిస్తున్నాం.
– డాక్టర్‌ టి. జానకీరామ్, వైస్‌ చాన్సలర్, వైఎస్సార్‌ ఉద్యాన వర్సిటీ, తాడేపల్లిగూడెం 


 ఇంటి వద్దే జాతి కోళ్లు పెంచుకుంటున్న గిరిజనులు

తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలం మర్రివాడ గ్రామానికి చెందిన ఎం. సావిత్రి కుటుంబ సభ్యులు 13మంది సంఘంగా ఏర్పడి వరి, జీడి మామిడి పంటలు సాగుచేస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో స్థానిక సామాజిక చెరువులో బొచ్చు, గడ్డిమోసు, శీలావతి వంటి చేçపలను సాగుచేస్తున్నారు. ఇలా ఏటా ఆహార ధాన్యాల ద్వారా రూ.34వేలు, కూరగాయల సాగు ద్వారా రూ.24 వేలు, మత్స్యసాగు ద్వారా రూ.73వేలు ఆర్జిస్తున్నారు. కడక్‌నాథ్, గాఘస్‌ కోళ్ల పెంపకం ద్వారా మరో రూ.16,800 ఆదాయాన్ని పొందుతున్నారు. 

ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన మారేడుమిల్లి మండలం పందిరిమామిడి గ్రామానికి చెందిన కత్తుల సోమిరెడ్డి. గతంలో వీళ్లు 70మంది కలిసి కూరగాయలు పండిస్తే ఒక్కొక్కరికి రూ.7వేలకు మించి వచ్చేది కాదు. కానీ, ఇప్పుడు వీరంతా రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో రబ్బరు సాగు, ప్రాసెసింగ్‌లో శిక్షణ పొంది ప్రాసెసింగ్‌ యూనిట్‌ తీసుకున్నారు. ఇప్పుడు నాణ్యమైన రబ్బరును ఉత్పత్తి చేస్తూ ఓ సంఘంగా ఏర్పడ్డారు. కేరళ వంటి రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ఫలితంగా.. గడిచిన ఆర్నెల్లలో 1,200 కేజీల రబ్బరును ప్రాసెస్‌ చేసి ఎగుమతి చేయడంద్వారా ఒక్కొక్కరం రూ.2.5 లక్షలు ఆర్జించామని.. ఖర్చులు పోనూ ఒక్కో రైతుకు రూ.1.50 లక్షలు మిగులుతోందని సోమిరెడ్డి చెబుతున్నాడు.  

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/wonderful-cultivation-tribals-agency-areas-east-godavari-district-1435803