గుండ్లకమ్మ రిజర్వాయర్

ప్రకాశం జిల్లాలోని మద్దిపాడు, చీమకుర్తి, సంతనూతల పాడు, నాగులుప్పలపాడు, జె.మగలూరు, కొరిశపాడు, ఇంకొల్లు, చినగంజాం మరియు ఒంగోలు మండలాలలో రైతులకు ఖరీఫ్ సీజన్లో 62,368 ఎకరాలకు నీరందించగా.. రబీ సీజన్లో 80,060 ఎకరములకు సాగునీరు అందించే లక్ష్యంతో కందుల ఓబులరెడ్డి గుండ్లకమ్మ జలాశయం ప్రాజెక్టును రూపకల్పన చేసారు. ఒంగోలుతో పాటు 43 గ్రామాలలోని 2.56 లక్షల ప్రజానీకానికి త్రాగునీరు వినియోగానికి అందించేలా ప్రభుత్వం దీన్ని నిర్మాణం చేసింది. ఈ జలాశయం ప్రకాశం జిల్లాలో, మడ్డిపాడు మండలంలోని చిన్న మల్లవరం గ్రామం దగ్గర గుండ్లకమ్మ నది మీద నిర్మాణం చేసారు. 3 మట్టికట్టల (ఎడమ, గార్జ్ పోర్షన్, కుడి) ద్వారా గుండ్లకమ్మ జలాశయము నిర్మించబడింది. ఇందులో 3.859 టిఎంసిల నీటిని నిల్వ చేసుకునే కెపాసిటీ కలిగి వుంది.

ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతిపాదించబడిన సాగు మరియు త్రాగునీటి అవసరాల కొరకు 12.845 టిఎంసిల నీటిని వినియోగింపబడుతుంది. ఈ ప్రాజెక్టు పరిధిలోగల ఆయకట్టు ప్రాంతంలో ప్రధానంగా ఆరుతడి పంటలు పండిస్తారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ద్వారా ఇప్పటివరకు 60 వేల ఎకరాలకు నీరు అందించడం జరిగింది. దీనితో పాటు గుండ్లకమ్మ జలాశయము దిగువ వున్న గ్రామాలకు ఒంగోలు పట్టణమునకు త్రాగునీటిని కూడ ఈ ప్రాజెక్టు ద్వారానే అందిస్తున్నారు.