గొరక చేపల హేచరీలకు ప్రభుత్వ అనుమతులు

    గొరక (తిలాపియా).. అత్యంత చౌక, ముళ్లు తక్కువగా ఉండే కాలువ చేప. రోడ్‌ సైడ్‌ రెస్టారెంట్లలో విరివిగా వాడే ఈ చేపలకు అమెరికా, సింగపూర్, చైనా, యూరోపియన్‌ దేశాల్లో మంచి డిమాండ్‌ ఉంది. ఈ చేపల ఉత్పత్తిలో ప్రపంచంలోనే చైనా మొదటి స్థానంలో ఉంది. మన దేశంలో వీటి వినియోగం తక్కువే. మన రాష్ట్రం నుంచి ఎక్కువగా విదేశాలకు పిల్లెట్స్‌ రూపంలో ఎగుమతి చేస్తుంటారు. విదేశాల్లో ఉండే డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ చేపల సాగును ప్రోత్సహించే లక్ష్యంతో ఈ చేపపిల్లల ఉత్పత్తి కోసం ముందుకొచ్చే ప్రైవేటు హేచరీలకు అనుమతివ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం రాష్ట్రస్థాయిలో స్టీరింగ్‌ కమ్‌ మానిటరింగ్‌ కమిటీని ఏర్పాటు చేస్తూ మత్స్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య ఉత్తర్వులు జారీచేశారు.

    మత్స్యశాఖ కమిషనర్‌ కె.కన్నబాబు నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీలో సీఐఎఫ్‌ఏ విజయవాడ రీజనల్‌ సెంటర్‌ సైంటిస్ట్‌ ఇన్‌చార్జి, ఎంపెడా విజయవాడ రీజనల్‌ సెంటర్‌ డిప్యూటీ డైరెక్టర్, స్టేట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ ప్రిన్సిపల్‌తో పాటు కృష్ణాజిల్లా మానికొండలోని ఆర్‌జీసీఏలోని తిలాపియా సెంటర్‌ ప్రాజెక్టు మేనేజర్‌ సభ్యులుగా ఉంటారు. ఇప్పటికే తిలాపియా హేచరీ ఏర్పాటు కోసం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఆనంద గ్రూప్‌ దరఖాస్తు చేసింది. ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత హేచరీ ఏర్పాటుకు అనుమతి ఇచ్చే విషయంలో నిర్ణయం తీసుకుంటుంది. ఇతర జిల్లాల నుంచి కూడా ఈ హేచరీల ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చే అవకాశాలున్నట్టు అంచనా వేస్తున్నారు.

    Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/tilapia-fish-hatcheries-andhra-pradesh-1371499