శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం వేములవాడకు చెందిన బొడ్డ గంగాధర్ సరిహద్దు భద్రతా దళంలో బంగ్లాదేశ్–పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో పనిచేస్తున్నారు. అమ్మమ్మ, తల్లితోపాటు వేములవాడలో ఉంటున్న ఆయన చెల్లెలు లావణ్య ఇంటర్ పూర్తి చేశారు. చెల్లెలికి ఏదైనా ఉపాధి మార్గం చూపదగిన యంత్ర పరికరాల కోసం ఇంటర్నెట్లో వెదుకుతున్న గంగాధర్‌కు ఓ మినీ రైస్ మిల్లు కనిపించింది. దీన్ని తయారు చేసిన చత్తిస్ఘఢ్లోని కంపెనీని సంప్రదించారు. మూడు అడుగుల ఎత్తులో ఉన్న చిన్న మిల్లుకు కొన్ని సవరణలు సూచించారు. అవసరమైతే ఎక్కడికైనా తీసుకెళ్లడానికి వీలుగా చక్రాలు కూడా పెట్టించి ఏడాది క్రితం రూ. 40 వేలకు కొనుగోలు చేశారు. వేములవాడలోనే లావణ్య చిన్న రేకుల షెడ్డులో ఈ మినీ రైస్ మిల్లును, దానితోపాటు చిన్న పిండి మరను కూడా ఏర్పాటు చేసుకొని, తల్లి తోడ్పాటుతో తానే నిర్వహిస్తూ ఉపాధి పొందుతున్నారు.
ఈ మినీ రైస్ మిల్ ద్వారా 80 కిలోల సాంబ మసూరి ధాన్యం మరపడితే 51 కిలోల బియ్యం వస్తున్నాయని, 3 హెచ్‌పి మోటారు కావడంతో విద్యుత్తు ఖర్చు కూడా తక్కువగానే ఉందని లావణ్య తెలిపారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యంతో మరపట్టించిన బియ్యాన్ని కిలో రూ. 40కి అమ్ముతూ మంచి ఆదాయం పొందుతున్నానని లావణ్య ఆనందం వ్యక్తం చేస్తోంది. వేరే ఊళ్లో దూరాన ఉండే పెద్ద రైస్ మిల్లు దగ్గరకు వ్యయ ప్రయాసలకు ఓర్చి వెళ్లాల్సిన అవసరం ఇక లేదని, గ్రామంలోనే కొన్ని కిలోల ధాన్యాన్ని సైతం మరపట్టుకోవచ్చని ఈ మినీ మిల్లు చూశాక అర్థమైందన్నారు. చిన్న రైతులు, గ్రామాల్లో మహిళలు, యువతులు ఈ మిల్లు ద్వారా తన మాదిరిగా ఉపాధి పొందొచ్చని లావణ్య సూచిస్తున్నారు.
మినీ రైస్ మిల్ పని చేసే విధానం:
- మూడు అడుగుల ఎత్తు, బరువు 65 కిలోలు,కావాల్సిన చోటుకు తీసుకెళ్ళాల్సిన విధంగా అడుగున నాలుగు వైపులా చక్రాల ఏర్పాటు.
- గంటకు 100–150 కిలోల ధాన్యాన్ని మరపడుతుంది. ఒకే సారీ 8 కిలోల ధాన్యాన్ని నింపుకునే సౌకర్యం వుంది.
- వంద కిలోల ధాన్యానికి 55–60 కిలోల బియ్యం వస్తాయి.
- 3 హెచ్‌పీ మోటార్‌తో పనిచేయటం వల్ల ఈ యంత్రానికి సింగిల్ ఫేజ్ విద్యుత్ కనెక్షన్ ఉన్నా సరిపోతుంది. అవసరమైతే సెకండ్ ఫేజ్ తీసుకోవాల్సి వుంటుంది.
- వడ్లు పొడవు, లావును బట్టి జాలీని మార్చే 3 రకాల జాలీలుంటాయి.