జగనన్న కాలనీల్లో భూగర్భ విద్యుత్‌ సరఫరా

  • 432 లేఅవుట్లలో భూగర్భ విద్యుత్‌ సరఫరా
  • 16,573 లేఅవుట్లలో స్తంభాల ద్వారా కరెంట్‌
  • రూ.6,475.41 కోట్లతో సమగ్ర నివేదిక సిద్ధం
  • ఎంతవాడినా తట్టుకునేలా ట్రాన్స్‌ఫార్మర్లు
  • అడుగడుగునా వీధి దీపాల వెలుగులు
  • ఇంటింటికీ హైటెక్‌ హంగులతో కరెంట్‌
  • డీపీఆర్‌పై నేడు ముఖ్యమంత్రి సమీక్ష

  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో అత్యాధునిక హంగులతో విద్యుత్‌ సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించిన సమగ్ర నివేదిక 90 శాతం తయారైనట్లు గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్‌ తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దీనిపై గురువారం సమీక్షిస్తారని చెప్పారు. జగనన్న కాలనీల్లో పటిష్టంగా విద్యుత్‌ పంపిణీకి అన్ని చర్యలు చేపట్టారు. లే అవుట్లలో ఇళ్ల సంఖ్య, వినియోగించే విద్యుత్‌ ఆధారంగా ముందే లోడ్‌ను అంచనా వేశారు. భవిష్యత్తులో లోడ్‌ పెరిగినా తట్టుకునేలా ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయనున్నారు. అత్యాధునిక సాంకేతికతకు ఇందులో ప్రాధాన్యమిస్తున్నారు. ప్రతి వీధిలో రాత్రి వేళ అధిక వెలుగులు విరజిమ్మేలా వీధి దీపాలను అమరుస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్‌ అంతరాయాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సహజసిద్ధమైన గాలి, వెలుతురు వినియోగించుకుంటూ తక్కువ విద్యుత్‌ వినియోగం జరిగేలా విదేశీ సాంకేతికతతో నిర్మాణాలు చేపట్టనున్నారు.

  పోల్స్‌ కనిపించకుండా పవర్‌..
  జగనన్న కాలనీల్లో ప్రత్యేక విద్యుత్‌ లైన్ల ఏర్పాటుకు రూ.6,475.41 కోట్లు ఖర్చు కానుందని అంచనా వేశారు. 500 ఇళ్ల కన్నా ఎక్కువ ప్లాట్లు ఉండే లే అవుట్లలో పూర్తిగా భూగర్భ విద్యుత్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దీనివల్ల కాలనీల్లో వీధి దీపాలకు మినహా పెద్దగా విద్యుత్‌ పోల్స్‌ అవసరం ఉండదు. భూగర్భ విద్యుత్‌ వ్యవస్థ వల్ల ప్రకృతి వైపరీత్యాల సమయాల్లోనూ అంతరాయాలు చోటు చేసుకునే అవకాశం ఉండదని ఉన్నతాధికారులు తెలిపారు. తక్కువ ఇళ్లు ఉండే లే అవుట్లలో మాత్రం విద్యుత్‌ లైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 

  మరో 2,271 లేఅవుట్లకు నెలాఖరుకు డీపీఆర్‌
  కోర్టు వివాదాల్లో ఉన్నవి, వ్యక్తిగతంగా ఇంటి స్థలం ఉన్నవారిని మినహాయిస్తే ఇప్పటివరకూ 17,005 లే అవుట్లకు సంబంధించి 18,77,263 ఇళ్ల విద్యుదీకరణపై అధికారులు దృష్టి పెట్టారు. 17,92,225 ఇళ్లకు సంబంధించి 14,734 లేఅవుట్ల పరిధిలో విద్యుదీకరణకు సమగ్ర నివేదికలు (డీపీఆర్‌) రూపొందించారు. ఇందులో భూగర్భ విద్యుత్‌ సరఫరా చేసే లే అవుట్లు 432, ఇళ్లు 8,36,705 ఉన్నాయి. మరో 2,271 లేఅవుట్లకు సంబంధించి 85,038 ఇళ్లకు విద్యుదీకరణ డీపీఆర్‌ ఈ నెలాఖరుకు సిద్ధం కానున్నట్లు అధికారులు తెలిపారు. 

  50 శాతం భూగర్భ విద్యుత్తే
  జగనన్న కాలనీల్లో 50 శాతం వరకూ భూగర్భ విద్యుదీకరణకే ప్రాధాన్యమిస్తున్నాం. ఇప్పటికే 90 శాతం డీపీఆర్‌లు పూర్తయ్యాయి. మిగతా డీపీఆర్‌లు ఈ నెలాఖరుకు పూర్తవుతాయి. రెండు దశల విద్యుదీకరణ ప్రక్రియను 2023కి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. విద్యుదీకరణకు అయ్యే మొత్తాన్ని రుణంగా తీసుకుని డిస్కమ్‌లకే అందిస్తాం. దీనికి ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుంది. 
  – అజయ్‌జైన్‌ (గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి) 

  Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/underground-power-supply-432-layouts-ysr-jagananna-colonies-1373377