జగనన్న చేదోడు

పేదల అభ్యున్నతి కోసం వరుస సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్ రెడ్డి ‘జగనన్న చేదోడు’  పథకానికి శ్రీకారం చుట్టారు. సొంత షాపు కలిగిన రజకులకు, నాయీబ్రాహ్మణులకు మరియు టైలర్లకు వారి జీవన ప్రమాణాల మెరుగుకై ‘జగనన్న చేదోడు’ పథకం ద్వారా సంవత్సరానికి రూ.10,000/-ల ఆర్ధిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది.

లభ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.10,000 చొప్పున నగదు జమ చేయగా.. ఈ పథకంలో భాగంగా మొత్తం 2,47,040 మంది లబ్దిదారులకు రూ.247.04 కోట్ల ఆర్దిక సాయం అందించారు. ఈ డబ్బును నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి జమ చేసారు. పాత అప్పులకు జమ చేసుకోలేని విధంగా ముందుగానే బ్యాంక్‌లతో ప్రభుత్వం సంప్రదింపులు చేసింది. లబ్దిదారుల అన్‌ఇన్‌కంబర్డ్‌ అకౌంట్లకు ఈ నగదు జమ చేయనున్నారు. ఈ డబ్బును లబ్దిదారులు తమ వృత్తికి కావాల్సిన పనిముట్లను కొనుగోలు చేసుకునేందుకు ఈ ఆర్థిక సాయాన్ని వినియోగించుకోవచ్చని ప్రభుత్వం చెబుతోంది.

అర్హతలు:

 • మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో నెలకు రూ. 10,000/- మరియు పట్టణ ప్రాంతాలలో అయితే రూ.12,000/- కంటే తక్కువ ఉండాలి.
 • మొత్తం కుటుంబానికి 3 ఎకరాలు మాగాణి భూమి లేదా 10 ఎకరాలు మెట్ట లేదా మాగాణి మరియు మెట్ట భూములు రెండు కలిపి 10 ఎకరాలు మించరాదు.
 • కుటుంబంలో ఏ ఒక్కరు ప్రభుత్వ ఉద్యోగి లేదా పింఛనుదారుడై ఉండరాదు.
 • పట్టణ ప్రాంతంలో సొంత గృహ నిర్మాణపు స్థలము 1000 చదరపు అడుగులు కంటే తక్కువ ఉండాలి.
 • కుటుంబ సభ్యులలో ఏ ఒక్కరికైనా 4 వీలర్ (నాలుగు చక్రములు) సొంత వాహనము ఉన్నట్లైతే (ఆటో, టాక్సీ మరియు ట్రాక్టర్ ఇందునకు మినహాయింపు) అనర్హులుగా పరిగణించబడును.
 • కుటుంబంలో ఏ ఒక్కరు ఆదాయపు పన్ను చెల్లించే పరిధిలో వుండరాదు.
 • ఆధార్ కార్డు కలిగి ఉండాలి.
 • ప్రభుత్వం జారీచేసిన సమగ్ర కులధృవీకరణ పత్రం (S.C., S.T., B.C., Minority, E. B.C) కలిగి ఉండవలెను.
 • షాపులున్న టైలర్లు అనగా అన్ని కులములకు చెందినవారు (S.C., S.T., B.C, Minority, E. B.C) టైలరింగ్ వృత్తి పైనే అనగా ప్రధాన వృత్తిగా స్వీకరించి దానిపై పూర్తిగా ఆధారపడి జీవనోపాధిగా జీవనం కొన సాగిస్తున్న వారు మాత్రమే ఈ పధకానికి అర్హులు.
 • షాపు కలిగి దానినే జీవనాధారంగా వృత్తి చేసుకుంటున్న రజకులు మరియు నాయిబ్రాహ్మణులు సంబంధిత కులధృవీకరణ పత్రం కలిగినవారు అర్హులు.

జాబితాలో పేరు లేని వారు దరఖాస్తు చేసుకునే విధానము:

 • అర్హత కల్గిన వారు కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డుతో పాటు స్వయంగా గ్రామ/వార్డు సచివాలయాలలో గాని లేదా గ్రామ/వార్డు వాలంటీర్ల ద్వారా గాని దరఖాస్తు చేసుకోవచ్చు.
 • దరఖాస్తు చేసిన లబ్ధిదారులకు నిర్దేశించిన ప్రక్రియలు అన్ని పూర్తి చేసి అర్హత కలిగిన వారికి సంవత్సరానికి రూ. 10,000/- ఒకసారి మంజూరు చేసే జగనన్న చేదోడు పధకం ద్వారా లబ్ధి చేకూర్చబడుతుంది.

లభ్ధిదారులకు కావాల్సిన సలహాలు, సూచనలు మరియు ఫిర్యాదుల కోసం ఉచితంగా కాల్ చేయాల్సిన టోల్-ఫ్రీ నంబర్ 1902