జగనన్న వసతి దీవెన

పేద విద్యార్థుల కోసం శ్రీకారం చుట్టిన మరో పథకం ఇది. విద్యార్థులకు ఏటా వసతి దీవెన ద్వారా ప్రభుత్వం 20వేలు అందిస్తోంది. డిగ్రీ, పీజీ చిదివే విద్యార్థులకు రెండు విడతలుగా  20వేలు ఇస్తారు. వసతి, భోజనం ఖర్చుల కోసం విద్యార్థుల తల్లుల అకౌంట్లలోనే నేరుగా డబ్బు జమ చేస్తారు. లక్షా 87వేల మంది విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుంది. వసతి దీవెన కింద 2వేల 300 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.

          ప్రభుత్వం ఏటా రెండు విడతలుగా విద్యార్థులకు సాయం అందిస్తుంది. ఐటీఐ విద్యార్థులకు ఏడాదికి రూ.10వేలు.. పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15వేలు.. మిగిలిన విద్యార్థులకు రూ.20వేలు అందజేస్తారు. ఈ పథకానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు, ఈబీసీ, అంగవైకల్యం ఉన్న విద్యార్థులు అర్హులు.

అర్హతలు:
కుటుంబ వార్షిక ఆదాయం రూ.2,50,000/- లోపు ఉన్నవారు అర్హులు.

కుటుంబానికి వ్యవసాయ భూమి మాగాణి అయితే 10 ఎకరాలు కన్న తక్కువ లేదా మెట్ట భూమి అయితే 25 ఎకరాలకన్న తక్కువ లేదా మాగాణి మరియు మెట్ట కలిపి 25 ఎకరాలు లోపు ఉన్నవారు అర్హులు.


కుటుంబ సభ్యులలో ఏ ఒక్కరు ప్రభుత్వ ఉద్యోగి / ఆదాయ పన్ను చెల్లింపుదారు / పెన్షన్ దారుడు ఉన్న యెడల అర్హులు కారు ( పారిశుధ్య కార్మికులు మినహా).

పాలిటెక్నిక్, ఐటీఐ, డిగ్రీ ఆపై చదువులు ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, యూనివర్శిటీలు, బోర్డుల్లో చదివేవారు అర్హులు. డే స్కాలర్, కాలేజ్ అటాచ్‌ హాస్టల్స్, డిపార్ట్‌మెంట్ అటాచ్ హాస్టల్స్‌లో ఉండే విద్యార్థులకు అవకాశం ఉంది.

ఈ పథకం వర్తించాలంటే విద్యార్థులకు 75శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలి.

ప్రైవేట్ యూనివర్శిటీలు, డీమ్డ్ యూనివర్శిటీల్లో చదివేవారు అనర్హులు. కరెస్పాండెన్స్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్సులు చదివేవారు అనర్హులు.


పట్టణ ప్రాంతములో 1,500 చ.అ.లు కన్నా తక్కువ బిల్డప్ ఏరియా (నివాస మరియు వాణిజ్య భవనం) కలిగిన కుటుంబం అర్హులు.

జాబితాలో పేరు లేనివారు దరఖాస్తు చేసుకొనే విధానము:


2019-20 సంవత్సరంలో అనర్హత జాబితాలో వున్నవారు అభ్యంతరములు వున్నట్లైతే, ఆ వారి అర్హత ఋజువులతో గ్రామ | వార్డు సచివాలయం ద్వారా “నవశకం” లాగిన్ లో అభ్యంతరములు దాఖలు చేసిన యెడల వాటిని పరిశీలించి తగు చర్య గైకొనబడును.

2020-21 విద్యా సంవత్సరంలో కళాశాలలు తెరచిన పిమ్మట అర్హతగల విద్యార్థులు తమ దరఖాస్తులను వారి కళాశాల ద్వారా ” జ్ఞానభూమి ” పోర్టల్ నందు నమోదు చేసుకొనవచ్చును.

లేదా దరఖాస్తులను గ్రామ / వార్డు వాలంటీర్ల ద్వారా కాని, లేదా స్వయంగా గ్రామ / వార్డు సచివాలయం నందు గాని దరఖాస్తు చేసుకోవచ్చు.