జగనన్న విద్యాకానుకలో అదనంగా మరో కొత్త వస్తువును చేర్చిన జగన్ సర్కారు..! YS Jagan Mohan Reddy

  ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల నమోదును గణనీయంగా పెంచడంతో పాటు, మెరుగైన ఫలితాలు సాధించడమే ధ్యేయంగా జగనన్న విద్యాకానుక వంటి వినూత్న కార్యక్రమానికి ఏపీ సర్కారు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.

  ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల నమోదును గణనీయంగా పెంచడంతో పాటు, మెరుగైన ఫలితాలు సాధించడమే ధ్యేయంగా జగనన్న విద్యాకానుక వంటి వినూత్న కార్యక్రమానికి ఏపీ సర్కారు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు వారి విద్యాభ్యాసానికి అవసరమైన వస్తువులను జగనన్న విద్యా కానుక కిట్ల రూపంలో అందిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టిన నేపథ్యంలో ప్రభుత్వం అందిస్తున్న జగనన్న విద్యాకానుకలో కొత్తగా డిక్షనరీని చేర్చారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియా ప్రవేశపెట్టేందుకు ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న నేపథ్యంలో విద్యార్థులు కూడా ఇంగ్లీష్ నేర్చుకునేందుకు వీలైన వాతావరణం కల్పిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. డిక్షనరీ ఉపయోగం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాని నాణ్యత కూడా బాగుండాలని అధికారులను ఆదేశించారు.

  1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు అందించే జగనన్న విద్యాకానుక కిట్లలో 3 జతల యూనిఫారం, షూ, 2 జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగు, పాఠ్యపుస్తకాలు, వర్క్ బుక్ లు, నోట్‌ బుక్ లతో పాటు ఈసారి కొత్తగా డిక్షనరీని ఇవ్వనున్నారు. వైఎస్సార్‌ ప్రీ ప్రైమరీ స్కూళ్లలో ఇంగ్లిష్‌– తెలుగు డిక్షనరీ ద్వారా పిల్లలు ప్రతి రోజూ ఒక పదం చొప్పున నేర్చుకునేలా చూడాలని, ఈ తరహాలోనే అంగన్‌వాడీల్లో కూడా ఒక కార్యక్రమాన్ని అమలు చేయాలని సీఎం సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడంపై అభిప్రాయసేకరణ నిర్వహించగా తల్లిదండ్రుల కమిటీ 93.88 శాతం, విడిగా తల్లిదండ్రులు 96.17 శాతం సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు తెలుగు ఒక భాషగా ఉండనుంది.

  ప్రస్తుత కాలంలో ఇంగ్లీషు మీడియం చదవాలంటే ఆర్థిక భారంగా మారిన పరిస్థితిని గుర్తించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేదలకు మంచి విద్యాప్రమాణాలు అందించాలనే ఉద్దేశంతో అంగన్‌వాడి నుంచి ఉన్నతవిద్య వరకు విప్లవాత్మక మార్పులు చేపట్టారు. ఇంగ్లిష్‌లో చదువుకొని భవిష్యత్‌లో ఉన్నత స్థానాలు అందుకుంటారనే ఆశతో తల్లిదండ్రులు తమ స్థోమతకు మించి ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు కట్టి చదివిస్తున్నారు. ఆ తర్వాత అప్పులపాలవుతున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లోనే ఇంగ్లిష్ మీడియం అమలు చేస్తే అన్ని వర్గాల వారికి ఇంగ్లిష్ మీడియం చదువులు, ఇంగ్లిష్ నైపుణ్యాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల ఎంహెచ్‌ఆర్‌డీ విడుదల చేసిన నూతన విద్యా విధానం ముసాయిదాలో సైతం పాఠశాల స్థాయిలో ఇంగ్లిష్ బోధన ప్రాధాన్యం, ఆవశ్యకతను ప్రత్యేకంగా ప్రస్తావించింది.

  ప్రాథమిక స్థాయి నుంచే ప్రత్యేకంగా ఇంగ్లిష్ మీడియం పాఠశాలలను ఏర్పాటు చేయడం వల్ల భవిష్యత్తులో మరిన్ని సత్ఫలితాలు వస్తాయన్న ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకటి నుంచి ఆరు తరగతులను 2020-2021 విద్యా సంవత్సరం నుంచి తదుపరి తరగతులను 2021-22 నుంచి ఇంగ్లిష్ మీడియంలోకి మార్చుతూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సీబీఎస్‌ఈ(సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) విధానం అమలు చేయడానికి సూత్రప్రాయంగా అంగీకరించారు. ఇప్పటికే ఇంగ్లిష్ మీడియంలో బోధించడానికి ఉపాధ్యాయులకు అవసరమైన నైపుణ్యం, అవగాహన కల్పించేందుకు శిక్షణ ఇవ్వడం, హ్యాండ్ బుక్స్ రూపకల్పన, వాటిని అభివృద్ధి చేయడం, తరగతి గదుల్లో ఉత్తమ బోధన పద్ధతుల గురించి వివరించడం, టీచర్లకు అవసరమైన బోధన మెటీరియల్‌ను రూపొందించారు. విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్సులతో పాటు ఇంగ్లీష్ ల్యాబ్స్ ఉండేలా చర్యలు చేపట్టారు. పిల్లల చదువు తల్లిదండ్రులకు భారం కాకూడదని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు.

  ప్రభుత్వ పాఠశాలల్లో విడతల వారీగా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం చారిత్రాత్మక నిర్ణయం. ఇంగ్లీష్ మీడియం ప్రాజెక్టు అమలు కోసం ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించారు. ఇంగ్లీష్ భాషపై శిక్షణ కోసం వెబ్ నార్ లు నిర్వహించారు. ఇప్పటికే డీడీ సప్తగిరి ఛానల్ ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధించారు. కరోనా విపత్కర సమయంలో ఆన్ లైన్ క్లాసులు నిర్వహించారు. విద్యార్థుల కోసం అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టి విద్యార్థుల తల్లుల అకౌంట్ లో ఏటా 15 వేలు జమచేసి ఆర్థిక చేయూతనిస్తున్నారు. ఇప్పటికే 2020 జనవరి 4 నుండి జనవరి 9 వరకు అమ్మఒడి వారోత్సవాలు జరిపి తల్లిదండ్రులతో విస్తృత చర్చలు జరిపారు.