జగనన్న విద్యాకానుక

          చదువును మరింత చేరువ చేసేందుకు బడి ఒడిలోకి  పిల్లలను చేర్చేందుకు తీసుకొచ్చిన మరో ప్రతిష్టాత్మక పథకం జగనన్న విద్యాకానుక. ఈ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 10వ తరగతి విద్యార్థులందరికీ అవసరమైన సామాగ్రిని ఉచితంగా అందజేస్తారు. విద్యా కానుక కిట్‌లో విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలతో ఇతర వస్తువులను పొందుపరిచారు. 

ఇందులో 3 జతల యూనిఫారాలు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, ఒక సెట్‌ పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, స్కూల్‌ బ్యాగ్‌ ఉంటాయి.

            బాలురలకు స్కై బ్లూ రంగు, బాలికలకు నేవీ బ్లూ రంగు బ్యాగులు అందిస్తారు. కోవిడ్‌ కారణంగా ఒక్కో విద్యార్థికి ఈసారి మూడు మాస్కులు కూడా పంపిణీ చేశారు. యూనిఫామ్‌ కుట్టించుకునేందుకు మూడు జతలకి 120 రూపాయల చొప్పున తల్లుల అకౌంట్‌కే నేరుగా జమ చేస్తున్నారు. అంతేకాదు జగనన్న విద్యాకానుక పథకానికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 91212 96051, 91212 96052 హెల్ప్‌లైన్‌ నంబర్లలో సంప్రదించేలా విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది.

ప్రభుత్వ పాఠశాలల్లో  పిల్లల నమోదును గణనీయంగా పెంచడంతో పాటు, మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యంగా విద్యార్థుల కోసం పథకాలను ప్రవేశపెడుతున్నారు. పిల్లలను బడిలో చేర్చే సమయంలో పేద తల్లిదండ్రులు పడే ఇబ్బందులను తొలగించేందుకు కిట్ అందిస్తున్నారు.