జర్నలిస్టులకు ప్రత్యేక యాప్‌ను రూపొందించిన సుప్రీం కోర్టు

    జర్నలిస్టుల కోసం ప్రత్యేక యాప్‌ను సుప్రీంకోర్టు రూపొందించింది. యాప్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ గురువారం అధికారికంగా ప్రారంభించారు. కరోనా తీవ్రత నేపథ్యంలో జర్నలిస్టుల సౌకర్యార్థం ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని ఆయన అన్నారు. జస్టిస్ కన్విల్ కర్, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ధనుంజయ్‌లతో కూడిన కమిటీ ఈ యాప్ రూపకల్పన చేసినట్లు ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే యాప్‌ను సుప్రీంకోర్టు సాంకేతిక బృందం రూపొందించిందని చెప్పారు. సుప్రీంకోర్టు రోజువారి కార్యకలాపాలు ఇకపై ఉన్న చోటు నుంచే పొందవచ్చని అన్నారు. కోర్టులో జరిగే కార్యకలాపాలు.. పారదర్శకంగా ఉండేదుకు గాను సాంకేతికంగా ముందుకు వెళ్లాలని భావించినట్లు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానం మరింత వినియోగంలోకి తీసుకురానున్నట్లు తెలిపారు. కోవిడ్ బారిన పడి మృతి చెందిన న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బందికి సిజేఐ, ఇతర న్యాయమూర్తులు సంతాపం తెలిపారు.

    Source: https://andhrajyothy.com/telugunews/cji-nv-ramana-launches-special-app-for-journalists-1921051301434972