విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంతో ప్రెస్ అకాడమీ ఒప్పందం

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంతో ప్రెస్ అకాడమీ ఒప్పందం

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టుల వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రెస్ అకాడమీ వివిధ విశ్వవిద్యాలయాలతో కలిసి పని చేయాలని నిర్ణయించినట్లు అకాడమి ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ తెలిపారు. వివిధ విశ్వవిద్యాలయాల్లోని జర్నలిజం శాఖలో అడ్మిషన్ తీసుకున్న జర్నలిస్టులకు ఫీజు రాయితీ కల్పించాలని భావిస్తున్నాయని తెలిపారు.

అందులో భాగంగా నెల్లూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో బుధ‌వారం ఒప్పందం కుదుర్చుకున్న‌ట్లు చెప్పారు. రాష్ట్రంలో అన్ని విశ్వవిద్యాలయాలతో సంప్రదింపులు జరిపి జర్నలిస్టుల, అడ్మిషన్లు, ఫీజురాయితీల గురించి ఒప్పందాలు చేసుకునేందుకు కోఆర్డినేషన్ అధికారిగా విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్. విజయ కృష్ణా రెడ్డిని నియమించామని తెలిపారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా జర్నలిస్టులు తమ నైపుణ్యాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందని, విశ్వవిద్యాలయాల్లో ఆ మేరకు సిలబస్ లో మార్పులు చేయాలని కోరారు. జర్నలిస్టులకు శిక్షణ తరగతులు నిర్వహించే ఏర్పాట్లు కూడా చేస్తామని తెలిపారు. వివిధ విశ్వవిద్యాలయాల సమన్వయంతో సదస్సులు, వర్కుషాపులు నిర్వహించేందుకు కూడా సమాయత్తమవుతున్నామని వివరించారు.

ప్రభుత్వ పథకాలు, వివిధ కార్యక్రమాల్ని ఆయా వర్గాలకు చేర్చడానికి యూనివర్సిటీలతో కలిసి పని చేయాలని భావిస్తున్నామని వివరించారు. వి.ఎస్.యుతో కుదుర్చుకున్న ఒప్పంద పత్రాల్లో ఆ యూనివర్సిటీ రిజిస్ట్రారు విజయకృష్ణా రెడ్డి, ప్రెస్ అకాడమి కార్యదర్శి ఎం.బాలగంగాధర్ తిలక్ సంతకాలు చేసి ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ సమక్షంలో పరస్పర ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు.