జల వివాదాల పరిష్కార దిశగా ప్రభుత్వం

  • నీటి వివాదాల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి
  • 9న భువనేశ్వర్‌కు సీఎం వైఎస్‌ జగన్‌
  • ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌తో ఉన్నత స్థాయి సమీక్ష

దశాబ్దాలుగా ఒడిశాతో నెలకొన్న జల వివాదాలను పరిష్కరించే దిశగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అడుగులు వేస్తున్నారు. పోలవరం, జంఝావతి రిజర్వాయర్‌ ముంపు సమస్యల పరిష్కారంతోపాటు రెండు రాష్ట్రాల్లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి దిక్సూచిలా నిలిచే నేరడి బ్యారేజీ నిర్మాణానికి మార్గం సుగమం చేయడమే లక్ష్యంగా ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌తో చర్చించేందుకు ఈనెల 9న భువనేశ్వర్‌ వెళ్లనున్నారు. ఇద్దరు సీఎంలు కలసి జలవనరుల శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తారని అధికారవర్గాలు వెల్లడించాయి.

సరిహద్దు రాష్ట్రాలతో స్నేహపూర్వక సంబంధాలను నెరపడం, సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకుని అందరూ అభివృద్ధి చెందడమే తమ అభిమతమని సీఎం వైఎస్‌ జగన్‌ పలుదఫాలు వెల్లడించారు. ఈ క్రమంలో సమయం కేటాయిస్తే తానే వస్తానని ఈ ఏడాది ఏప్రిల్‌ 17న ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌కు లేఖ రాశారు. దీనిపై ఒడిశా సీఎం సానుకూలంగా స్పందించి ఆహ్వానించడంతో సీఎం జగన్‌ వచ్చే వారం భువనేశ్వర్‌ వెళ్లనున్నారు.

జంఝావతిపై కాంక్రీట్‌ డ్యామ్‌..
► జంఝావతిలో 75 శాతం లభ్యత ఆధారంగా 8 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని అంచనా వేసి ఒడిశా, ఏపీ చెరి సగం వాడుకునేలా 1978 డిసెంబర్‌ 25న రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. 
► ఈ ఒప్పందం ప్రకారం 4 టీఎంసీలను వాడుకుని విజయనగరం జిల్లాలో కొమరాడ, పార్వతీపురం, మక్కువ, సీతానగరం, గరుగుబిల్లి మండలాల్లోని 75 గ్రామాల్లో 24,640 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించేలా జంఝావతి ప్రాజెక్టును దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2004లో జలయ/æ్ఞంలో భాగంగా చేపట్టారు.
► 3.40 టీఎంసీల సామర్థ్యంతో విజయనగరం జిల్లాలో కొమరాడ మండలం రాజ్యలక్ష్మీపురం వద్ద జంఝావతిపై ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారు. ఈ ప్రాజెక్టుతో ఒడిశాలోని 1,175 ఎకరాల భూమి ముంపునకు గురవుతుంది. ఈ భూమిని సేకరించి ఇస్తే పరిహారం చెల్లిస్తామని అప్పట్లోనే ఒడిశా సర్కార్‌ను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కానీ.. ఒడిశా నిరాకరించడంతో జంఝావతి ప్రాజెక్టు ఫలాలను ముందస్తుగా అందించడానికి కాంక్రీట్‌ డ్యామ్‌ స్థానంలో రబ్బర్‌ డ్యామ్‌ను నిర్మించి 2006 జనవరి 1న నాటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి జాతికి అంకితం చేశారు. అప్పట్లో తొమ్మిది వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించారు.
► ముంపునకు గురయ్యే భూమిని సేకరించి ఇవ్వడానికి ఒడిశా సర్కార్‌ను ఒప్పించడం ద్వారా రబ్బర్‌ డ్యామ్‌ స్థానంలో శాశ్వతమైన కాంక్రీట్‌ డ్యామ్‌ను నిర్మించి విజయనగరం జిల్లాలో వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయించారు.

నేరడితో ఇరు రాష్ట్రాలు సస్యశ్యామలం..
► వంశధార ప్రాజెక్టు ఫేజ్‌–2 స్టేజ్‌–2 ద్వారా 2.45 లక్షల ఎకరాలకు నీళ్లందించే పనులను దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2004లో చేపట్టారు. నేరడి బ్యారేజీకి ఒడిశా సర్కార్‌ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆయకట్టు రైతులకు ముందస్తుగా ఫలాలను అందించడానికి కాట్రగడ్డ వద్ద సైడ్‌ వియర్‌ నిర్మించి వంశధార జలాలను మళ్లించేలా పనులు చేపట్టారు. ఈ క్రమంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్రం వంశధార ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసింది.
► జల వివాదాలకు చరమగీతం పాడుతూ ఈ ఏడాది జూన్‌ 23న కేంద్రానికి వంశధార ట్రిబ్యునల్‌ తుది నివేదిక అందజేసింది. శ్రీకాకుళం జిల్లాలో నేరడి వద్ద వంశధారపై బ్యారేజీ నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. నేరడి బ్యారేజీ వద్ద లభ్యమయ్యే 115 టీఎంసీల్లో రెండు రాష్ట్రాలకు చెరి సగం పంపిణీ చేసింది. నేరడి బ్యారేజీతో ముంపునకు గురయ్యే 106 ఎకరాల భూమిని సేకరించి ఏపీ ప్రభుత్వానికి అందజేయాలని ఒడిశా సర్కార్‌ను ఆదేశించింది.  నేరడి బ్యారేజీ కుడి వైపున కాలువ ద్వారా రోజూ ఎనిమిది వేల క్యూసెక్కులు వాడుకోవడానికి ఏపీ సర్కార్‌కు అనుమతి ఇచ్చింది. ఎడమ వైపున నీటిని వాడుకోవడానికి ఒడిశాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. బ్యారేజీ నిర్మాణ వ్యయాన్ని ఆయకట్టు ఆధారంగా దామాషా పద్ధతిలో భరించాలని ఆదేశించింది. ఈ బ్యారేజీ పూర్తయితే శ్రీకాకుళం జిల్లాలో వంశధార ప్రాజెక్టు ఆయకట్టులో రెండు పంటలకు, ఒడిశాలో వెనుకబడిన ప్రాంతాలకు నీళ్లందించి సస్యశ్యామలం చేయవచ్చు.
► రెండు రాష్ట్రాలకు ఉపయోగపడే ఈ బ్యారేజీ నిర్మాణానికి ఒడిశాను ఒప్పించే దిశగా సీఎం వైఎస్‌ జగన్‌ చర్యలు చేపట్టారు.

పోలవరంలో నీటి నిల్వే లక్ష్యంగా..
► పోలవరం ప్రాజెక్టులో 45.72 మీటర్లలో 194.6 టీఎంసీలను నిల్వ చేసినా ముంపు ప్రభావం తమ భూభాగంలో పడకుండా చూడాలని 2007 ఏప్రిల్‌ 3న అంతర్రాష్ట్ర సమావేశంలో ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ కోరాయి. 
► ఆంధ్రప్రదేశ్, నాటి మధ్యప్రదేశ్, ఒడిశా మధ్య 1980 ఏప్రిల్‌ 2న కుదిరిన ఒప్పందం ప్రకారం పోలవరం ముంపు ప్రభావం లేకుండా సీలేరు, శబరి నదులకు కరకట్టలు నిర్మించాలని గోదావరి ట్రిబ్యునల్‌ ఉత్తర్వులు జారీ చేసింది.
► ట్రిబ్యునల్‌ ఉత్తర్వుల ప్రకారం ఒడిశాలో సీలేరుపై 12 కి.మీ, శబరిపై 18.2 కి.మీ. వెరసి 30.2 కి.మీ. పొడవున సగటున 50 మీటర్ల వెడల్పు, 8 మీటర్ల ఎత్తుతో కరకట్టలు నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు తాజా ధరల ప్రకారం రూ.378.696 కోట్లు వ్యయం కానుందని అంచనా. ఇదే రీతిలో ఛత్తీస్‌గఢ్‌లో శబరిపై 25.19 కి.మీ.ల పొడవున, ఇతర వాగులపై 3.93 వెరసి 29.12 కి.మీ. పొడవున సగటున 50 మీటర్ల వెడల్పు, 8 మీటర్ల ఎత్తుతో కరకట్టల నిర్మాణానికి రూ.332.30 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
► కరకట్టల నిర్మాణానికి పర్యావరణ అనుమతి కోసం ఒడిశాలోని మల్కనగరి, ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాల్లోని ముంపు ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ సదస్సులు నిర్వహించాలని 2005 నుంచి ఒడిశా, ఛత్తీస్‌గఢ్, కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సార్లు లేఖలు రాసినా ప్రయోజనం కానరాలేదు.
► పోలవరం ప్రాజెక్టును 2022 నాటికి పూర్తి చేసే దిశగా సీఎం వైఎస్‌ జగన్‌ పనులను వేగవంతం చేశారు. గోదావరిలో వరద ప్రవాహం తగ్గగానే ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల మధ్యన ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌(ఈసీఆర్‌ఎఫ్‌) డ్యామ్‌ నిర్మాణాన్ని చేపట్టి 2022 నాటికి పూర్తి చేసేందుకు సర్వం సిద్ధం చేశారు. అయితే ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయాలంటే ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలో ముంపు సమస్యను పరిష్కరించాలి. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది పోలవరంలో నీటిని నిల్వ చేయడానికి మార్గం సుగమం చేసేందుకు ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌తో సీఎం జగన్‌ చర్చించనున్నారు. 

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/cm-ys-jaganmohan-reddy-focus-resolving-water-disputes-odisha-1409225