జిల్లా కేంద్రాల్లో జగనన్న మహిళా మార్ట్‌

  • డ్వాక్రా మహిళల సహకార సూపర్‌ మార్కెట్ల ఏర్పాటుకు నిర్ణయం
  • ఇప్పటికే పులివెందులలో పైలట్‌ ప్రాజెక్ట్‌ విజయవంతం 
  • తరువాత 116 మున్సిపాలిటీల్లో ఏర్పాటు
  • మెప్మా కార్యాచరణ ప్రణాళిక

పట్టణ పేద మహిళల ఆర్థిక స్వయం సమృద్ధి సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమం చేపట్టింది. పూర్తిగా డ్వాక్రా మహిళలే యజమానులుగా జగనన్న మహిళా మార్ట్‌ పేరుతో సూపర్‌ మార్కెట్లను ఏర్పాటు చేయనుంది. పట్టణ సమాఖ్యల సభ్యుల పొదుపు మొత్తాలే పెట్టుబడిగా.. పురపాలకశాఖ మౌలిక వసతులు సమకూర్చేలా, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆర్థిక సహకారంతో ఈ మార్టుల ఏర్పాటుకు రూపకల్పన చేశారు. ఇప్పటికే వైఎస్సార్‌ జిల్లా పులివెందులలో పైలట్‌ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసిన జగనన్న మహిళా మార్ట్‌ విజయవంతమైంది. దీంతో వీటిని అన్ని జిల్లా కేంద్రాలు, మున్సిపాలిటీల్లో దశలవారీగా ఏర్పాటు చేయాలని మెప్మా నిర్ణయించింది. 

డ్వాక్రా మహిళలే యజమానులుగా..
పట్టణ మహిళా సమాఖ్యలో సభ్యులుగా ఉన్న మహిళలే ఈ జగనన్న మహిళా మార్ట్‌కు యజమానులు. ప్రతి పట్టణ ప్రాంతంలో డ్వాక్రా సంఘాలతో కూడిన పట్టణ మహిళా సమాఖ్య యూనిట్‌గా దీన్ని ఏర్పాటు చేస్తారు. సమాఖ్య సభ్యులు రూ.150 చొప్పున మూలధన నిధికి జమచేస్తారు. తద్వారా రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు పెట్టుబడి నిధి సమకూరుతుంది. మెప్మా రూ.3 లక్షలు సమకూరుస్తుంది. మున్సిపాలిటీ స్థలం కేటాయించటమేగాక సంబంధిత పట్టణాభివృద్ధి సంస్థ సహకారంతో భవనం నిర్మిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ సున్నా వడ్డీ వంటి పథకాలను కూడా ఈ మార్ట్‌కు వర్తింపజేస్తారు.

దీనికి అవసమైన సరుకుల సరఫరా కోసం కార్పొరేట్‌ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకునేందుకు మెప్మా సహకరిస్తుంది. కార్పొరేట్‌ సంస్థలు నిర్వహిస్తున్న సూపర్‌ మార్కెట్లకు దీటుగా జగనన్న మహిళా మార్ట్‌లను తీర్చిదిద్దుతారు. నిర్వహణ కోసం సమాఖ్యలోని 10 మంది సభ్యులతో కమిటీని మెప్మా ఏర్పాటు చేస్తుంది. సమాఖ్య మార్ట్‌లో 10 మంది సిబ్బందిని నియమించుకుంటుంది. ఈ మార్ట్‌లు ఆరునెలల్లోనే లాభాల్లోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. సమాఖ్య సభ్యులకు లాభాల్లో వాటాను 6 నెలలకు ఓసారి డివిడెండ్‌ రూపంలో పంపిణీ చేస్తారు. ఈ మార్ట్‌లో కొనుగోలు చేసే సమాఖ్య సభ్యులకు 3 శాతం రాయితీ కూడా ఇస్తారు. 

పులివెందులలో నెలకు రూ.10 లక్షల టర్నోవర్‌
పైలట్‌ ప్రాజెక్టుగా వైఎస్సార్‌ జిల్లా పులివెందులలో ప్రారంభించిన జగనన్న మహిళా మార్ట్‌ విజయవంతమైంది. 25 డ్వాక్రా సంఘాలతో కూడిన పట్టణ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నెలకొల్పిన ఈ మార్టు టర్నోవర్‌ నెలకు రూ.10 లక్షలకు చేరింది. దీంతో రాష్ట్రంలోని 13 జిల్లా కేంద్రాల్లో ఈ మార్ట్‌లను ఏర్పాటు చేయాలని మెప్మా నిర్ణయించింది. జిల్లా కేంద్రాల్లోని సమాఖ్య సభ్యులతో చర్చిస్తోంది. తరువాత దశలో రాష్ట్రంలో మిగిలిన  మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అనంతరం మున్సిపల్‌ కార్పొరేషన్లలో రెండుమూడు చొప్పున ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. 

మహిళల ఆర్థిక స్వయం సమృద్ధే లక్ష్యం
సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు పట్టణ మహిళల ఆర్థిక స్వయం సమృద్ధి సాధన కోసం ఈ జగనన్న మహిళా మార్ట్‌లకు రూపకల్పన చేశాం. ఇతర మార్ట్‌ల కంటే తక్కువ ధరకు, నాణ్యమైన సరుకులను అందించడం ద్వారా ప్రజల ఆదరణ పొందేందుకు అన్ని విధాలుగా సహకరిస్తాం. వీటి నిర్వహణపై మహిళా సమాఖ్య సభ్యులకు శిక్షణ కూడా ఇస్తాం.