జూలైలో కరవు భత్యాల చెల్లింపు

  • పీఆర్‌సీని ఎలాంటి మార్పు లేకుండా 2022 వరకు కొనసాగిస్తాం
  • కరోనాతో మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం
  • విద్యుత్‌ ఉద్యోగ సంఘాలకు మంత్రి బాలినేని హామీ

  విద్యుత్‌ ఉద్యోగులకు ఆ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీపికబురు చెప్పారు. పెండింగ్‌లో ఉన్న కరవు భత్యాన్ని జూలైలో ఇస్తామని వెల్లడించారు. ఈ మేరకు విద్యుత్‌ ఉద్యోగ సంఘాలతో మంత్రి సచివాలయంలో మంగళవారం దాదాపు నాలుగు గంటలకుపైగా చర్చలు జరిపారు. వేతనాలు తగ్గిస్తున్నారని పుకార్లు చెలరేగిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన అనేక డిమాండ్లకు మంత్రి సానుకూలంగా స్పందించారు. విద్యుత్‌ ఉద్యోగులకు 2018లో ప్రకటించిన పీఆర్‌సీని 2022 వరకు ఎలాంటి మార్పు లేకుండా కొనసాగిస్తామన్నారు. కరోనా బాధిత ఉద్యోగులను అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

  అసువులు బాసిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వడానికి ఆమోదం తెలిపారు. విద్యుత్‌ సంస్థల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి సానుకూల అభిప్రాయం ఉందని, వారి సేవలను గుర్తించిందన్నారు. వీలైనంతవరకూ వారికి న్యాయం చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. వారిని తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే పుకార్లను నమ్మొద్దని కోరారు. ఉద్యోగులు డిమాండ్ల సాధన కోసం ఉద్యమించిన నేపథ్యంలో నమోదైన కేసులను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అన్ని అంశాలపై మంత్రి బాలినేని ఓపికగా చర్చించారని, ప్రభుత్వంపై అపారమైన నమ్మకం ఏర్పడిందని చర్చల్లో పాల్గొన్న విద్యుత్‌ ఉద్యోగ సంఘాల నేతలు వెంకట రమణారెడ్డి, సురేష్‌ కాంతారెడ్డి, వేదవ్యాస్, చంద్రశేఖర్‌ తదితరులు మీడియాకు తెలిపారు. గత కొంతకాలంగా వస్తున్న పుకార్లతో నెలకొన్న ఆందోళన మంత్రి హామీతో తొలగిపోయిందన్నారు.

  Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/balineni-srinivas-assures-electricity-employees-unions-1371487