జూలై 10 నాటికి పిల్లల తల్లులకు కరోనా వ్యాక్సిన్‌ పూర్తి

    మహమ్మారి వైరస్‌ ఆంధ్రప్రదేశ్‌లో నియంత్రణలోకి వస్తోంది. కరోనా కట్టడికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనా కట్టడి చర్యలు కఠినంగా అమలవుతున్నాయి. ఈ కరోనా కట్టడిలో.. వ్యాక్సిన్‌ పంపిణీలో ఏపీ సరికొత్త రికార్డు నెలకొల్పింది. కరోనా పరీక్షలు ఇప్పటివరకు 2 కోట్ల మందికిపైగా చేసినట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్ తెలిపారు. ఏపీలో యాక్టివ్ కేసులు తగ్గుతున్నాయని చెప్పారు.

    అమరావతిలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఏకే సింఘాల్‌ మీడియాతో మాట్లాడారు. మే 16వ తేదీన పాజిటివిటీ రేటు 25.56% ఉండగా ప్రస్తుతం 9.37%గా ఉందని, రెట్టింపు స్థాయిలో పాజిటివ్‌ రేటు తగ్గిందని వివరించారు. ఇప్పటివరకు 1.09 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు వెల్లడించారు. జులై 10వ తేదీ నాటికి ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు కరోనా వ్యాక్సిన్‌ మొదటి డోస్‌ పూర్తి చేస్తామని ఏకే సింఘాల్‌ ప్రకటించారు.