టెలీమెడిసిన్‌ సేవల్లో ఏపీ రికార్డు

వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లో టెలీమెడిసిన్‌ ద్వారా హబ్‌లోని వైద్యుడితో వీడియోకాల్‌లో మాట్లాడుతున్న రోగి (ఫైల్‌)

  • ఒక్కరోజులో లక్ష కన్సల్టేషన్లు
  • దేశంలో మొదటి రాష్ట్రంగా గుర్తింపు
  • సోమవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 2.04 లక్షల కన్సల్టేషన్లు నమోదు
  • వీటిలో ఒక్క ఏపీ నుంచే 1,00,159
  • ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా నాలుగు కోట్లు దాటిన కన్సల్టేషన్లు
  • ఇందులో మన రాష్ట్రం నుంచే సుమారు 1.89 కోట్లు

టెలీమెడిసిన్‌ సేవల్లో ఏపీ ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టించింది. దేశంలోనే ఒక్కరోజులో లక్ష కన్సల్టేషన్ల మైలురాయిని దాటిన తొలి రాష్ట్రంగా ఘనత సాధించింది. దేశవ్యాప్తంగా సోమవారం 2,04,858 కన్సల్టేషన్లు నమోదవగా ఇందులో 48.89 శాతం అంటే 1,00,159 కన్సల్టేషన్లు ఏపీలోనే నమోదయ్యాయి. తమిళనాడు నుంచి 34వేలు, కర్ణాటకలో 15వేలు, తెలంగాణలో 5,574, కేరళలో 543 చొప్పున నమోదయ్యాయి.

వైద్య సేవలను ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యంతో ఈ–సంజీవని టెలీమెడిసిన్‌ సేవలను 2019 నవంబర్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభించాయి. ప్రజారోగ్యంపట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన సీఎం వైఎస్‌ జగన్‌ సర్కార్‌ ఈ కార్యక్రమం అమలులో తొలినుంచీ దూకుడుగా ముందుకెళ్తోంది. చిత్తశుద్ధితో కార్యక్రమాన్ని అమలుచేస్తూ ప్రజలకు వైద్య సేవలను మరింత అందుబాటులోకి తీసుకెళ్తోంది.

27 హబ్‌ల ద్వారా సేవలు
టెలీమెడిసిన్‌ సేవలు అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలలు, జిల్లా ఆస్పత్రుల్లో 27 హబ్‌లను ఏర్పాటుచేసింది. వీటికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,145 పీహెచ్‌సీలు, 560 వైఎస్సార్‌ పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 5,206 వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లను అనుసంధానం చేశారు. ఒక్కో హబ్‌లో ఇద్దరు జనరల్‌ మెడిసిన్, గైనకాలజీ, పీడియాట్రిక్స్, కార్డియాలజీ స్పెషలిస్ట్‌లు ఉంటారు.

పీహెచ్‌సీ, విలేజ్‌ క్లినిక్‌కు వచ్చిన రోగులు స్పెషాలిటీ వైద్యుల సేవలు కోరితే వెంటనే వైద్య సిబ్బంది టెలీమెడిసిన్‌ ద్వారా హబ్‌లోని వైద్యులను సంప్రదిస్తారు. హబ్‌లోని వైద్యులు ఆడియో, వీడియో కాల్‌ రూపంలో రోగులతో మాట్లాడి వారికి సలహాలు, సూచనలు తెలియజేయడంతో పాటు ప్రిస్క్రిప్షన్‌ తెలియజేస్తారు. అందులో సూచించిన మందులను పీహెచ్‌సీ, విలేజ్‌ క్లినిక్‌లోని వైద్య సిబ్బంది రోగులకు అందజేస్తున్నారు. మరోవైపు.. స్మార్ట్‌ ఫోన్‌ ఉన్నవారు ఈ–సంజీవని (ఓపీడీ) యాప్‌ ద్వారా ఇంటి నుంచి వైద్య సేవలు పొందుతున్నారు.  

ఆశా వర్కర్లకు స్మార్ట్‌ ఫోన్లు
స్మార్ట్‌ ఫోన్‌లేని, వాటి వాడకం రాని వారికి ఇళ్లవద్దే ఈ–సంజీవని ఓపీడీ (ఔట్‌ పేషెంట్‌ డిపార్ట్‌మెంట్‌) సేవలు అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం రాష్ట్రంలోని 42 వేల మంది ఆశా వర్కర్లకు స్మార్ట్‌ ఫోన్లు పంపిణీ చేసింది. వీటన్నింటినీ హబ్‌లకు అనుసంధానించారు. వీరు స్మార్ట్‌ఫోన్‌లేని, వాటి వాడకం రాని వారికి టెలీమెడిసిన్‌ సేవలు అందించడంతో పాటు, ప్రజలకు టెలీమెడిసిన్‌ సేవలపై అవగాహన కల్పిస్తున్నారు. 

మొత్తం కన్సల్టేషన్లలో 47.34 శాతం ఏపీ నుంచే..
టెలీమెడిసిన్‌ సేవలు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 4,00,40,925 కన్సల్టేషన్లు నమోదయ్యాయి. వీటిలో 47.34 శాతం 1,89,59,021 ఏపీ నుంచి ఉన్నాయి. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఏపీ దరిదాపుల్లో లేకపోవడం గమనార్హం. రాష్ట్రంలో టెలీమెడిసిన్‌ సేవలను ఇంత సమర్థవంతంగా అమలుచేస్తుండటంతో ఇప్పటికే పలుమార్లు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో దేశంలోనే మొదటి ర్యాంకును సైతం ప్రదానం చేసింది.   

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/andhra-pradesh-record-telemedicine-1468610