డిగ్రీ కాలేజీల్లో ఇంగ్లీషు మీడియం

-11, 12 తరగతులు కూడా ఆంగ్లంలోనే
-బీఏ చదివీ ఇంగ్లీషులో మాట్లాడలేకుంటే ఎలా?
-ఇలా అయితే పోటీ ప్రపంచంలో రాణించేనా?
-ఉన్నత విద్యా బోధనలోనే మార్పులు రావాలి
-తెలుగు, ఇంగ్లీషులో పాఠ్యాంశాలు ముద్రించాలి
-ఉన్నత విద్యపై సమీక్షలో సీఎం జగన్‌ ఆదేశం
-ప్రతి గ్రామానికీ అన్‌లిమిటెడ్‌ ఇంటర్‌ నెట్‌

రాష్ట్రంలోని అన్ని డిగ్రీ కళాశాలల్లోనూ ఇంగ్లీషు మాధ్యమాన్ని ప్రవేశ పెట్టాలని ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయించారు. ఇంజనీరింగ్‌, వైద్య విద్య కళాశాలల మాదిరిగానే సాధారణ డిగ్రీ కాలేజీల్లోనూ ఇంగ్లీషులోనే బోధన జరగాలని, ఇంగ్లీషు మాధ్యమం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడకుండా తగిన కోర్సులను ప్రణాళికా బద్ధంగా తీసుకురావాలని సూచించారు. డిగ్రీ మొదటి ఏడాదిలోనే దీనికి సంబంధించిన కోర్సులను ప్రవేశ పెట్టాలని తెలిపారు. అలాగే 11, 12 తరగతుల్లో కూడా ఇంగ్లీషు మాధ్యమం ప్రవేశ పెట్టాలని సూచించారు. ఒకేసారి ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడం వల్ల ఇబ్బందులు రాకుండా పాఠ్యపుస్తకాలన్నీ ఇంగ్లీషు, తెలుగుమాధ్యమాల్లో ముద్రించాలని ఆదేశించారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయని సీఎం చెప్పారు. బీఏ, బీకాం లాంటి కోర్సులు చేసి.. ఇంగ్లీషులో మాట్లాడలేకపోతే ఎలా అని ప్రశ్నించారు. పోటీ ప్రపంచంలో రాణించడం కష్టం అవుతుందన్నారు. ఉద్యోగ అవకాశాలను కల్పించే పాఠ్యప్రణాళికను రూపొందించాలని సీఎం ఆదేశించారు. బీకాం చదివిన వారికి ప్రాథమిక ఆర్థిక కార్యాకలాపాలు సహా స్టాక్‌ మార్కెట్‌పై అవగాహన కల్పించాలన్నారు. దీనివల్ల స్వయం ఉపాధికి ఆస్కారం ఏర్పడుతుందన్నారు. ఈ మేరకు శుక్రవారం ఉన్నత విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు.

వచ్చే సమావేశాల్లో యూనివర్సిటీ యాక్ట్‌

తొలిసారిగా ప్రైవేటు యూనివర్సిటీలు పెట్టే వారికి అత్యున్నత ప్రమాణాలు నిర్దేశించాలని సీఎం ఆదేశించారు. ప్రపంచంలోని 200 అత్యుత్తమ విద్యా సంస్థలతో జాయింట్‌ సర్టిఫికేషన్‌ ఉండాలని, ఐదేళ్ల పాటు ఇది కొనసాగాలని, ఈ క్రైటీరియాను అందుకున్న పక్షంలోనే ప్రైవేటు యూనివర్సిటీగా వారికి అనుమతి ఇవ్వడానికి తగిన అర్హతగా పరిగణించాలని ఆదేశించారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లోనే ఏపీ ప్రైవేటు యూనివర్సిటీ యాక్ట్‌-2006కు సవరణ బిల్లు ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. కాగా, ఎయిడెడ్‌ కాలేజీలు పూర్తిగా ప్రభుత్వంలోనైనా లేక ప్రైవేటు యాజమాన్యాల చేతిలో అయినా ఉండాలని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది.

ప్రభుత్వానికి అప్పగిస్తే.. ప్రభుత్వమే నడపాలని, లేని పక్షంలో ప్రైవేటు యాజమాన్యాలే నడుపుకోవాలని నిర్ణయించారు. ప్రతి గ్రామానికీ అన్‌లిమిటెడ్‌ ఇంటర్నెట్‌ను తీసుకువస్తున్నామని సీఎం చెప్పారు. దీంతోపాటు అమ్మఒడి, వసతి దీవెన పథకాల లబ్ధిదారులకు ఆప్షన్‌గా ల్యాప్‌టా్‌పలను సరసమైన ధరకు అందించేలా చూస్తున్నామన్నారు. ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ కోసం ఇంటర్నెట్‌లేని వైఫై ప్రోటోకాల్‌, రిమోట్‌ డివైజ్‌ ద్వారా ఒకేసారి 500 మంది యూజర్ల కనెక్ట్‌ ప్రాజెక్టు ఏర్పాటుకు సీఎం అంగీకరించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యాశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సతీశ్‌చంద్ర తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Source : Andhra Jyothi