డ్రైవింగ్‌ శిక్షణ కేంద్రాల ఏర్పాటు

    రాష్ట్రంలో రహదారి భద్రత దిశగా మౌలిక వసతుల కల్పన వేగవంతమవుతోంది. అందుకోసం పూర్తిస్థాయిలో డ్రైవింగ్‌ శిక్షణ అందించేందుకు మరో 2 ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డ్రైవింగ్‌ ట్రైనింగ్‌ – రిసెర్చ్‌ (ఐటీడీఆర్‌)’లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కర్నూలు జిల్లా డోన్, విజయనగరం జిల్లా రాజాపులోవల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ప్రకాశం జిల్లా దర్శిలో ఐటీడీఆర్‌ మొదటి దశ పనులు పూర్తవడంతో కార్యకలాపాలు మొదలయ్యాయి. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఐటీడీఆర్‌లను నెలకొల్పుతాయి. ఏదైనా కార్పొరేట్‌ సంస్థగానీ ఎన్‌జీవో భాగస్వామ్యంతో సొసైటీని ఏర్పాటు చేసి వాటిని లాభాపేక్షలేకుండా నిర్వహిస్తారు. దర్శిలో ఐటీడీఆర్‌ను మారుతి సంస్థతో కలసి ఏర్పాటు చేసిన సొసైటీ కింద నెలకొల్పారు.

    తాజాగా డోన్‌లో ఐటీడీఆర్‌ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేయగా, విజయనగరం జిల్లా రాజాపులోవలో ఏర్పాటుకు సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. దీనిపై త్వరలో అధికారికంగా ఉత్తర్వులు రానున్నాయి. అశోక్‌ లేలాండ్‌ కంపెనీతో కలసి సొసైటీ కింద ఏర్పాటు చేస్తున్న వీటికి.. ఒక్కోదానికి రూ.18 కోట్లు చొప్పున కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ.36 కోట్లు మంజూరు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ఐటీడీఆర్‌కు 10 ఎకరాల భూమి కేటాయిస్తుంది. డోన్‌ ఐటీడీఆర్‌ కోసం ఇప్పటికే భూములను గుర్తించారు. రవాణా శాఖ ఉన్నతాధికారులు వచ్చేవారం వాటిని పరిశీలిస్తారు. అనంతరం రాజాపులోవలో అందుబాటులో ఉన్న భూములపై విజయనగరం జిల్లా అధికారులతో చర్చిస్తారు. ఈ రెండు ఐటీడీఆర్‌లలో ఒక్కోదాన్లో ఏడాదికి దాదాపు 10 వేలమంది చొప్పున డ్రైవర్లకు శిక్షణ ఇస్తారు. వారిలో కొత్త డ్రైవర్లతోపాటు ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో డ్రైవర్లుగా ఉన్నవారికి ఓరియంటేషన్‌ తరగతులు నిర్వహిస్తారు. 

    పూర్తిస్థాయి వసతులు
    శాస్త్రీయ విధానాల్లో డ్రైవింగ్‌ శిక్షణకు అవసరమైన మౌలిక వసతులను ఐటీడీఆర్‌లలో ఏర్పాటు చేస్తారు. వివిధ కేటగిరీలకు చెందిన వాహనాలను అందుబాటులో ఉంచుతారు. కార్లు, హెవీ వెహికిల్స్‌ స్టిమ్యులేటర్లు ఏర్పాటు చేస్తారు. కంప్యూటరైజ్డ్‌ క్లాస్‌రూంలు నెలకొల్పుతారు. వర్క్‌షాప్, ఇంజిన్‌ రూమ్, ఎలక్ట్రిక్‌ డిస్‌ప్లే రూమ్, లైబ్రరీ, క్యాంటిన్‌ మొదలైనవి సమకూరుస్తారు. డ్రైవింగ్‌లో శిక్షణ కోసం రెండు, నాలుగు, ఆరు లేన్ల రోడ్లు, పార్కింగ్‌ యార్డ్, త్రీపాయింట్, ఫైవ్‌ పాయింట్‌ టర్న్‌ రోడ్లు మొదలైనవి నిర్మిస్తారు.  

    Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/driving-training-centers-kurnool-and-vizianagaram-districts-1377616