తక్కువ విస్తీర్ణంలో.. ఏడాదికి 12 రకాల పంటలు


“ఖేతీ పర్ కిస్కీ మార్? జంగ్లీ జాన్వర్, మౌసమ్ ఔర్ సర్కార్…”1980 దశకంలో, హరిత విప్లవం తరువాత హిమాలయ ప్రాంతమైన ఉత్తరాఖండ్ అంతటా ఈ నినాదం ప్రతిధ్వనించింది. “వ్యవసాయాన్ని దెబ్బతీసేది ఎవరు? అడవి జంతువులు, ప్రతికూల వాతావరణం, ప్రభుత్వం…”అన్నది ఈ నినాద సారాంశం.
‘బీజ్ బచావ్ ఆందోళన్’ (సేవ్ సీడ్స్) (Beej Bachao Andolan) (బీబీఏ) వ్యవస్థాపకులు శ్రీ విజయ్ జర్ధారీ నేతృత్వంలో ఏకీకృత వ్యవసాయానికి వ్యతిరేకంగా హిమాలయాల ప్రాంతంలో ఒక ఉద్యమం సాగింది. ఉత్తరాఖండ్‌లోనే కాక పలు రాష్ట్రాలకు ఈ ఆందోళన విస్తరించింది. చిరుధాన్యాల వంటి పోషకాహార పంటల సాగుకు బదులు రైతులపై వాణిజ్య పంటలను బలవంతంగా రుద్దడాన్ని ఈ ఉద్యమం వ్యతిరేకించింది.


తరతరాలుగా పలు రకాల పంటలను పండిస్తూ వచ్చిన విజయ్ జర్ధారీ కుటుంబం, ఒకే రకమైన మూస పంటలను (monoculture) సాగు చేసే సంస్కృతి తాలూకు దీర్ఘకాలిక విపరిణామాలను ముందే ఊహించింది. ఒకే రకం పంటను పండించడమన్నది చివరికి రైతులకు కష్టాలనే మిగుల్చుతుందని విజయ్ జర్ధారీ కుటుంబం హెచ్చరిస్తూ వచ్చింది.


ఒకే భూకమతంలో ఒకటి కంటే ఎక్కువ సంప్రదాయ పంటలను పండించడం ఆరోగ్యకరమనీ, పర్యావరణపరంగానూ అది ప్రయోజనకరమనీ విజయ్ జర్ధారీ తన దీర్ఘకాల పరిశీలనలో గ్రహించారు. తరచు ప్రభుత్వ అధికారులు, ఆయా కంపెనీల ప్రతినిధులు వచ్చి హిమాలయ ప్రాంతంలో రైతులకు సోయా బీన్స్ విత్తనాలిచ్చి సాగు చేయమని చెప్పేవారు. కొన్ని విత్తనాల కంపెనీలు పంట బై బ్యాక్ భరోసా కూడా ఇచ్చేవి. కానీ తీరా వాటిని వాడి పంట వచ్చాక ఎవరూ కనిపించేవారు కాదు. వారు సోయాబీన్స్‌ను, రసాయన ఎరువులు, క్రిమిసంహారకాలను అతి తక్కువ ధరలకే రైతులకు ఇవ్వజూపుతున్నప్పుడు విజయ్‌ జర్ధారీ తీవ్రంగా వ్యతిరేకించారు. సంప్రదాయ పంటల వంగడాలను పరిరక్షించడానికి ఆయన ‘బీజ్ బచావో ఆందోళన్’ ప్రారంభించారు.


ఈ ఉద్యమంలో భాగంగా విజయ్ జర్దారీ తన మిత్రులు, మద్దతుదారులతో కలిసి దేశీ విత్తనాలను సేకరించేందుకు దండియాత్ర నిర్వహించారు. అలా రాష్ట్రమంతా పర్యటించి ఆయన వివిధ పంటలకు సంబంధించిన వందలాది రకాల దేశీ విత్తనాలను సేకరించగలిగారు. విజయ్ జర్ధారీ బృందం ఇలా 700 రకాలకు పైగా దేశీ వంగడాల విత్తనాలను సేకరించింది. వీటిలో 220 రకాల రాజ్మా విత్తనాలు, 300 రకాల వరి వంగడాల విత్తనాలు, 10 రకాల మొక్కజొన్న విత్తనాలు, 12 రకాల రాగుల విత్తనాలు ఉన్నాయి. ప్రతి ఇంటి తలుపు తట్టిపప్పుడు, విజయ్ తన ‘బారా అనాజ్’ (Baranaj) (బారాహ్ అంటే 12 అనీ అనాజ్ అంటే పంట అనీ అర్థం) సంప్రదాయ వ్యవసాయ పరిజ్ఞానాన్ని రైతులతో పంచుకున్నారు.

తాను సేకరించిన దేశీ వంగడాల విత్తనాలతో శ్రీ విజయ్ జర్ధారీ

“ఇది ఏడాదిలో పన్నెండు లేదా అంతకంటే ఎక్కువ పంటలను (అంచెల) సాగు చేసే అంతర పంటల పద్ధతి. సాధారణంగా తెహ్రీ-గఢ్వాల్ వర్షాధార ప్రాంతాలలో దీనిని అనుసరిస్తారు. ఈ అంతర పంటల సాగులో కాయధాన్యాలు, తృణధాన్యాలు, కూరగాయలు, చిక్కుళ్ళు, లతలు ఒకదానికొకటి పెనవేసుకుని పెరుగుతాయి. ఉదాహరణకు ధాన్యాల కాండాలు చిక్కుళ్ళు, ఇతర తీగజాతుల మొక్కలకు ఆలంబనగా పనిచేస్తాయి. ఒకనాడు మన పూర్వికులు వ్యవసాయంలో అద్భుత విజయాలు సాధించడానికి ఇదే కీలకం. అయితే ఈ పద్ధతి 80వ దశకంలో అంతరించడం మొదలుపెట్టింది. నిజానికి ఈ విధానం రైతుకు ఆహార భద్రతను అందిస్తుంది. భూసారాన్ని, ఉత్పత్తిని కూడా పెంచుతుంది”అని విజయ్ జర్ధారీ చెబుతారు.


విజయ్ జర్ధారీ, తన బీబీఏ ద్వారా, ‘బారా(హ్) అనాజ్ పద్ధతి’ని రైతులకు తెలియజెప్పి దేశీ విత్తనాల సంరక్షణకు కృషి చేసినందుకుగాను 2009లో ‘ఇందిరాగాంధీ పర్యావరణ్ పురస్కారాన్ని’ కూడా అందుకున్నారు. బీజ్ బచావో ఆందోళన్ ఉద్యమకారులు ఆధునిక వంగడాల కంటే ఎక్కువగా దిగుబడిని ఇచ్చే పలు దేశీ వంగడాల వివరాలను సంకలనం చేసి ఒక పట్టికను తయారు చేశారు. ఉదాహరణకు హిమాలయాల్లోని తెహ్రీకి చెందిన గోరఖ్‌పూరీ దేశీ వరి వంగడం 95 రోజుల్లోనే కోతకి వస్తుంది. ఇది హెక్టారుకు సగటున 35 నుండి 40 క్వింటాళ్ల దాకా దిగుబడినిస్తుంది. ఆధునిక వరి వంగడాల కన్నా దీని దిగుబడి తక్కువేమీ కాదు.

‘బారా అనాజ్’ సాగు పద్ధతిలోని విశిష్టత ఇదే…

బారా అనాజ్ పద్ధతి ప్రధాన ప్రయోజనాల్లో ఒకటేమిటంటే, రైతు ఆకలితో అలమటించడం, అప్పుల పాలు కావడం అంటూ ఉండదు.
“ఈ పద్ధతిలో మొత్తంగా పంట నష్టం జరగడం ఉండదు. వేసిన కొన్ని పంటలు కరువు వల్లనో, తెగుళ్ళ వల్లనో లేక వరదల వల్లనో చేతికి రాకపోయినా ఇంకొన్ని తట్టుకుని నిలిచి ఆదుకుంటాయి. కాబట్టి ప్రకృతి విపత్తుల సమయంలో, కొన్ని పంటలు దెబ్బతిన్నప్పటికీ మొత్తంగా నష్టం వాటిల్లదు. రైతు మార్కెట్లో విక్రయించడానికి లేదా సొంత వినియోగం కోసం తగినంత పంటని పొందుతాడు. అదనంగా, బారాహ్ అనాజ్ ప్రక్రియ అడవుల్లో మాదిరిగానే ఉంటుంది. అందువల్ల దీనికి రసాయన ఉత్పాదకాలు లేదా అధిక నీటిపారుదల వసతులు అవసరం లేదు. అవన్నీ వర్షాధారమైన పంటలు. పంటల వైవిధ్యాన్ని కాపాడుకోవడంతో పాటు ఇది భూసారాన్ని కూడా పెంచుతుంది. అలాగే ఈ విధానం పశువులకు సరిపడా పశుగ్రాసాన్ని కూడా అందిస్తుంది,” అని విజయ్ జర్ధారీ వివరిస్తారు.
ధాన్యాలు, మసాలాదినుసులు, కూరగాయలు, పప్పుధాన్యాల మిశ్రమంగా పంటల సాగు అంచెల్లో జరిగినంత వరకు రైతు ప్రత్యేకంగా అనుసరించవలసిన స్థిరమైన విధానాలేవీ ఇందులో ఉండవని ఆయన చెబుతారు.


బారా అనాజ్ అంచెల పద్ధతిలో విజయ్ సూచించే పంటలు ఈ క్రింది విధంగా ఉంటాయి.
ధాన్యాలు: రాగులు, జొన్న, ఎర్రతోటకూర గింజలు (amaranthus), కుట్టు (buckwheat) మొక్కజొన్న.
పప్పుధాన్యాలు / బీన్స్: రాజ్మా, బొబ్బర్లు, నల్ల సోయా చిక్కుళ్లు (black soybean), నౌరంగీ దాల్ (రైస్ బీన్స్), మినుములు మరియు పెసలు.
కూరగాయలు: తోటకూర, కీర దోసకాయ, ఓగల్ (స్థానిక రకం), అలసందలు (black-eyed beans)


మసాలా దినుసులు: నువ్వులు. స్థూలంగా ఇదీ బారా అనాజ్ సాగు పద్ధతి.
“జొన్న వేర్లు మట్టిని గట్టిగా పట్టుకుని ఉంటాయి. వరదల సమయంలో అవి నేలకోతను నివారిస్తాయి. మరోపక్కన బొబ్బర్లు లేదా నౌరంగీ వంటి పప్పులు పొలంలోని తోటకూర, క్యాబేజీ వంటి ఇతర కూరగాయలకు కావలసిన నత్రజనిని అందిస్తాయి. ఎందుకంటే వీటికి చాలా పోషకాలు అవసరం. చిరుధాన్యాలు ప్రధానంగా వర్షాధారపంటలు. అవి అధికంగా ఉండే నీటిని పీల్చుకుంటాయి. వరదలను నివారిస్తాయి. ఈ మొక్కలన్నీ ఎదిగేప్పుడు వేర్వేరు ఎత్తులను కలిగి ఉంటాయి, కాబట్టి పొడవైనవి తీవ్రమైన వేడిమి సమయంలో మిగతా వాటికి కావలసిన నీడను, చల్లదనాన్ని అందిస్తాయి”అని ఆయన వివరిస్తారు.
విపరీత వాతావరణ పరిస్థితులను ఇవి తట్టుకోవడమేగాక ఈ పంటలన్నీ ఒకదానిని మరొకటి బలోపేతం చేసుకుంటాయి. ఈ పంటల మార్పిడి అన్నది అడవి జంతువులు, పక్షులు మొత్తం పంట పొలాన్ని నాశనం చేయకుండా చూస్తుంది. ఉదాహరణకు, పక్షులు జొన్నకంకులు తింటాయి కాబట్టి విజయ్ వాటి కోసం ప్రత్యేకంగా ఒక భాగాన్ని ఉంచుతారు. అందుకు ప్రతిగా, పక్షులు జీవవైవిధ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి.
పంటలు వార్షిక ప్రాతిపదికన మారతాయి కాబట్టి, పొలంలో కీటకాల వృద్ధి తక్కువగా ఉంటుంది. ఇక తెగుళ్లను నివారించడానికి ఆవు పేడ, గోమూత్రం నుండి తయారైన ఎరువును ఉపయోగించాలని విజయ్ సూచిస్తారు. దీని వల్ల రైతుకు రసాయన ఉత్పాదకాల అవసరం ఉండదు.

‘బీజ్ బచావో ఆందోళన్’ నాయకుడు శ్రీ విజయ్ జర్ధారీ

‘బరా అనాజ్’ జీరో బడ్జెట్ లాంటిదే!

తక్కువ ఖర్చుతో కూడిన చౌక చిట్కాలు, సమర్థవంతమైన దిగుబడి పద్ధతులను సూచిస్తూ విజయ్ గత 30 ఏళ్లలో బారా అనాజ్ సాగు విధానాన్ని అవలంబించేందుకు వేలాది మంది రైతులను ప్రేరేపించారు. ఆయన ఊరికి సమీపంలోని 15-20 గ్రామాల రైతులు ఈ పద్ధతినే అనుసరిస్తున్నారు. ఖరీదైన ఎరువుల వినియోగంతో నిమిత్తం లేకుండా బారా అనాజ్ విధానంలో రైతుకు పెట్టుబడి వ్యయం చాలా తక్కువగా ఉండడమే ఇందుకు కారణం.
“బహుశా మొదటి సారి, మీరు విత్తనాల కోసం మార్కెట్‌పై ఆధారపడవలసి ఉంటుంది. కానీ ఆ తర్వాత, మీరు కొన్ని విత్తనాలను ఆదా చేసి, ప్రతి సంవత్సరం వాటిని తిరిగి నాటుకోవచ్చు. విత్తనాలకు సంబంధించి మేము ఇప్పటికీ పాత వస్తుమార్పిడి పద్ధతినే అనుసరిస్తాం. నా విత్తనాలలో ఒకటేదైనా సరైన దిగుబడి ఇవ్వకపోతే నేను మరో రైతు నుండి విత్తనాలు తీసుకుంటాను. ఆ రైతుకు అందుకు బదులుగా నా దగ్గర మంచి దిగుబడినిచ్చిన విత్తానాలను అందిస్తాను. ఈ విధానంతో ఇద్దరమూ లాభపడతాం. ఇలా ఇద్దరికీ కొత్త విత్తనాల సాగుకు వీలు కలుగుతుంది. చాలా సందర్భాలలో, ఈ పద్ధతి మంచి ఫలితాలనిచ్చింది కూడా. డబ్బు ఆదా చేయడానికి ఇది చాలా మంచి మార్గం”అని విజయ్ జర్ధారీ గ్రామానికే చెందిన చిప్కో ఉద్యమ నాయకుడు ధుమ్ సింగ్ నేగి చెప్పారు. నేగి గత 60 సంవత్సరాలుగా బారా అనాజ్ పద్ధతిని అనుసరిస్తున్నారు.
వ్యవసాయ శ్రామికుల విషయంలో కూడా ఈ ఇచ్చిపుచ్చుకోవడాలు ప్రయోజనం కలిగిస్తాయి. రైతుల మధ్య వెల్లివిరిసే సామరస్యం వ్యవసాయ శ్రామికుల ఖర్చును కూడా తగ్గించి వేస్తుంది. వేతనం ఇచ్చి శ్రామికుల చేత పని చేయించుకునే బదులు, రైతులు నాట్ల ప్రక్రియలో పరస్పరం సహకరించుకుంటూ ఉంటారు. ఒక రైతు పొలంలో విత్తనాలు వేసేందుకు మిగతా రైతులు కూడా తరలివస్తారు. బృందాలుగా రైతులు ఈ నాట్ల పనులను పూర్తి చేయడం ఇక్కడ కనిపించే విశేషం.
“విత్తనాలు విత్తడం మాకు పండుగ లాంటిదే. ఆ సమయంలో మేము పొలాలలో డోళ్లు, డప్పులు మోగిస్తూ, నృత్యాలు చేస్తూ విత్తనాలు నాటుతాము. ఇది మేము ఐక్యంగా ఉండటానికి సహాయపడుతుంది”అని విజయ్ చెబుతారు. ఇలా విత్తనాలు, నాట్లు, పురుగుమందులు, రసాయన ఎరువుల కొనుగోలు వంటి వాటి విషయంలో ఆదా చేసినందున రైతుకు ఉత్పాదక వ్యయం దాదాపు సున్నా అవుతుంది.

రైతు ఆత్మహత్యలను నివారించగలం…

అప్పులు తిరిగి చెల్లించలేక పోవడం, అస్థిరమైన వాతావరణ పరిస్థితులు తరచుగా రైతు ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. ఈ విషయంలో చిన్న, సన్నకారు రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. ఒకే పంటల విధానంలో రైతు నిరంతరం ఒత్తిడికి లోనవుతాడు. కృత్రిమంగా దిగుబడిని పెంచేందుకు మరింత ఎక్కువగా రసాయన ఎరువులు వాడడం మొదలుపెడతాడు. పంటల నాణ్యతతోను, భూసారంతోనూ రాజీపడతాడు. అంతిమంగా ఇది భూమి ఉత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. రైతు ఈ విషవలయంలో చిక్కుకుపోతాడు. ఈ దుష్టవలయాన్ని బద్దలు కొట్టడానికి బారా అనాజ్ పద్ధతే శరణ్యమని విజయ్ జర్ధారీ, నేగీ ఘంటాపథంగా చెబుతారు.

“మా పూర్వికులు అందించిన పరంపరాగత వ్యవసాయ విజ్ఞానం మేము స్వావలంబన (ఆత్మనిర్భర్) సాధించేందుకు తోడ్పడింది. ఎందుకంటే, మేము ఎటువంటి బాహ్య ఉత్పాదకాలపై ఆధారపడవలసిన అవసరం లేదు. ఒక రైతు.. ఒక్కసారిగా ఒకే రకం పంటల పద్ధతిని (మోనోకల్చర్) మాని బహుళ పంటల విధానాన్ని అనుసరించడం కష్టమే. మొదట్లో పంటలు దెబ్బతినవచ్చు కూడా. కానీ దీర్ఘకాలంలో రైతులు ఈ పద్ధతి వల్ల తప్పక ప్రయోజనం పొందుతారు. దీన్ని ప్రోత్సహించడం ద్వారా, మనం రైతు ఆత్మహత్యలను నిరోధించవచ్చు. ఇందులో చెప్పుకోవలసిన విశేషం మరొకటి ఉంది. జంగ్లీ జాన్వర్ (అడవి జంతువులు), మౌసమ్ (ప్రతికూల వాతావరణ పరిస్ఖితులు), సర్కార్‌ (ప్రభుత్వం) … ఇవేవీ ఈ విధానాన్ని అనుసరించే రైతును ఏమీ చేయలేవు” అని విజయ్ జర్ధారీ ధీమా వ్యక్తం చేస్తారు.
కొన్నేళ్ల కిందటి వరకు చిరుధాన్యాలంటే కేవలం పేదల ఆహారమనుకునేవారు. కానీ రాగులు, ఊదల వంటివి ఇప్పుడు సంపన్న వర్గాల్లోనూ ఆదరణ పొందుతున్నాయి. దీంతో పోషక విలువలు కలిగిన చిరుధాన్యాల సాగుకు ప్రోత్సాహం లభిస్తోందని విజయ్ జర్ధారీ సంతృప్తి వ్యక్తం చేస్తారు.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 40 లక్షల మంది రైతులు బారా(హ్) అనాజ్ పద్ధతిలో దేశీ వంగడాలతో వ్యవసాయం చేయడం విశేషం. ఒకేరకం పంట స్థానంలో పన్నెండు అంతర పంటల పద్ధతిని హిమాలయాల్లో రైతులు అనుసరించి విజయం సాధించారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని చోట్ల రైతులు ఇటీవల నాలుగైదు పంటల విధానాన్ని అనుసరించి ప్రయోగాలు చేస్తున్నారు. మొత్తం మీద ఒకే పంట విధానం లాభదాయకం కాదన్న అవగాహన క్రమంగా పెరుగుతోంది. మన వ్యవసాయరంగంలో ఇది స్వాగతించదగిన పరిణామం.

ఆసక్తిగలవారు మరిన్ని వివరాలకు ఈ క్రింది చిరునామాను సంప్రదించవచ్చు.
Mr Vijay Jardhari
Jardhar village, Tehri Garhwal,
Uttarakhand 249175
Mobile:: 09411777758

12 అంచెల పంట పద్ధతిని వివరించే డాక్యుమెంటరీ (వీడియో)