- ఆగస్టు నెలలో రాష్ట్ర తయారీ రంగంలో 1.2 శాతం వృద్ధి
- ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా 8.6 శాతం క్షీణత
- ఏప్రిల్–ఆగస్టు కాలానికి దేశ సగటు కంటే మెరుగైన పనితీరు
- ఆదుకున్న ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, మెటల్స్, కెమికల్ రంగాలు..
- అర్థగణాంక శాఖ తాజా నివేదికలో వెల్లడి
లాక్డౌన్తో దెబ్బ తిన్న రాష్ట్ర పారిశ్రామికోత్పత్తి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ నెలలో రీస్టార్ట్ పేరుతో గ్రీన్ జోన్లో ఉన్న ఫ్యాక్టరీలను ప్రారంభించడానికి అనుమతించడం సత్ఫలితాలను ఇచ్చింది. దీంతో ఐదు నెలల విరామం తర్వాత రాష్ట్ర తయారీ రంగం వృద్ధి బాట పట్టింది. ఆగస్టు నెలలో తయారీ రంగంలో 1.2 శాతం వృద్ధి నమోదైనట్లు రాష్ట్ర అర్థగణాంక శాఖ తాజాగా విడుదల చేసిన ఇండెక్స్ ఆఫ్ ఇండిస్ట్రియల్ ప్రొడక్షన్ (ఐఐపీ) గణాంకాల్లో వెల్లడైంది.
రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లోని 353 కర్మాగారాల నుంచి సేకరించిన డేటా ఆధారంగా తయారీ రంగంలో వృద్ధిని అంచనా వేస్తారు. గతేడాది ఆగస్టు నెలలో 120.3 పాయింట్లు ఉన్న తయారీ రంగం ఈ ఏడాది ఆగస్టు నెలలో 121.7 పాయింట్లుగా నమోదైంది. ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా 8.6 శాతం క్షీణత నమోదు కావడం గమనార్హం. తయారీ రంగంలో లోహాలు, ఎలక్ట్రానిక్స్, పారిశ్రామిక మెషినరీ, రవాణా పరికరాలు, కెమికల్స్, అప్పరెల్స్ వంటి రంగాలు మంచి పనితీరు కనపరచడంతో ఆగస్టు నెలలో వృద్ధి రేటు నమోదైంది. ముఖ్యంగా క్యాపిటల్ గూడ్స్ రంగంలో 19.7 శాతం, ఇంటర్మీడియేట్ గూడ్స్ 7.0 శాతం, కన్జూమర్ డ్యూరబుల్స్ 7.1 శాతం, కన్జూమర్ నాన్ డ్యూరబుల్స్ 6.8 శాతం చొప్పున వృద్ధి నమోదైనట్లు ఐఐపీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
