తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

     ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కంకణం కట్టుకుంది.  రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ.. ప్రాధాన్యత క్రమంలో ఈ సమస్య పరిష్కారానికి ప్రణాళిక రూపొందించింది. నీటి ఎద్దడి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తొలి విడతలో రక్షిత మంచినీటి పథకాల నిర్మాణంతోపాటు ఇతర తాగునీటి వసతి సౌకర్యాల కల్పనపై దృష్టి పెట్టింది. ఇందుకోసం వచ్చే మూడేళ్లలో రూ.15,989 కోట్ల ఖర్చు చేసేందుకు గ్రామీణ మంచినీటి సరఫరా (ఆర్‌డబ్ల్యూఎస్‌) శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. తాగునీటి సౌకర్యాల కల్పనకు ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో రూ.3,720 కోట్లు, 2022–23లో రూ.8,089 కోట్లు, 2023–24లో రూ.4,180 కోట్లు వెచ్చించనున్నారు. పనిచేయని మంచినీటి పథకాలను వినియోగంలోకి తీసుకురావడానికి, జిల్లాల్లో తీవ్ర నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో కొత్త మంచినీటి పథకాల నిర్మాణానికి మొదటి విడతలో రూ.3,090 కోట్లు వెచ్చిస్తారు. ప్రభుత్వం ఇటీవల పేదలకు పెద్ద ఎత్తున ఇంటి పట్టాలు పంపిణీ చేసిన నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న జగనన్న కాలనీల్లో పూర్తిస్థాయిలో తాగునీటి వసతుల కల్పన ప్రాధాన్యత అంశంగా నిర్ధారించారు.  

    ఇప్పటికే పనులు మొదలైన 3 జిల్లాలకు తోడు..
    జగన్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో రూ.700 కోట్లతో మంచినీటి పథకాన్ని మంజూరు చేశారు. అక్కడ పనులు వేగంగా సాగుతున్నాయి. కర్నూలు జిల్లా డోన్, వైఎస్సార్‌ జిల్లా పులివెందుల ప్రాంతాల్లో రూ.684 కోట్లతో వాటర్‌గ్రిడ్‌ పనులు చేపట్టారు. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతం, ప్రకాశం జిల్లాలోని కనిగిరి, గిద్దలూరు ప్రాంతాలతో కూడిన పశ్చిమ ప్రాంతంతో పాటు చిత్తూరు జిల్లా ఉత్తర ప్రాంతంలో వాటర్‌గ్రిడ్‌ పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రొయ్యల చెరువులు, సముద్రజలాల ఉప్పునీటితో ఇబ్బందులు పడుతున్న తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణాజిల్లాలో రూ.7,840 కోట్లతో వాటర్‌గ్రిడ్‌ పనులకు ప్రతిపాదనలు రూపొందించారు. ఏపీలోని 13 జిల్లాల్లో రూపుదిద్దుకుంటున్న జగనన్న కాలనీల్లో  పూర్తిస్థాయిలో మంచినీటి వసతుల కల్పనకు రూ.3,250 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు.  

    Source:https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/permanent-solution-drinking-water-problem-9-districts-andhra-pradesh