ప్రకృతి వ్యవసాయంలో తన పట్టుదల కృషితో అంతర్జాతీయంగా పేరు సంపాందించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు ఇప్పుడు తెలుగు రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. సోషల్ మీడియాలో కూడ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సాధించుకున్న ఈ రైతు విజయ గాధ ఓ సారీ చూద్దాం.
రోమ్ ప్రధాన కేంద్రంగా కలిగిన యునైటెడ్ నేషన్స్ ఎఫ్ఏఓ సంస్థ బృందం.. ప్రకృతి వ్యవసాయంపై డాక్యుమెంటరీ కోసమని రెండేళ్ల క్రితం రాష్ట్రంలో పర్యటించింది. కృష్ణానదీ తీరంలో పర్యటిస్తున్న సమయంలో అప్పటికే చాలా చోట్ల భారీ గాలులతో అరటి తోటల్లో చెట్లు విరిగి పడిపోయాయి. కానీ అదే తీరానికి దగ్గరలోని కొల్లిపర మండలం అన్నవరం గ్రామంలో శివన్నారాయణ అరటి తోట మాత్రం ఆరోగ్యంగా నిలబడే ఉంది. ఆ రైతును కలిసి సమాచారం సేకరించి, వారు వీడియో రికార్డు చేశారు.

అర ఎకరం భూమిలో పసుపు,అరటి సాగుతో నష్టపోతూ వస్తున్న శివన్నారాయణ.. తాను ప్రకృతి వ్యవసాయం చేపట్టి, ఎలా లాభాల బాటలో ముందుకు సాగుతున్నాడో అందులో వివరించాడు. రసాయన ఎరువులను వాడటం మానేసి, ఘన, జీవామృతాల వినియోగంతో పెట్టుబడి రూ.20 వేల నుంచి రూ.3,500కు ఎలా తగ్గించుకోవాలో వివరించాడు.

అంతర పంటలుగా కూరగాయలు వేస్తూ, ఏటా రూ.70-80 వేల ఆదాయం సంపాదించే విధానాన్ని చెప్పాడు. ప్రకృతి వ్యవసాయంతో వానపాముల ప్రాముఖ్యతను తెలియచేసాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో 40 వేల మందికి పైగా వీక్షించిన ‘కాకానీస్ స్టోరీ’ కథానాయకుడుగా ఓ తెలుగు రైతుగా అభినందనలు అందుకున్నారు. ప్రస్తుతం అధికారుల ప్రోత్సాహంతో ఇంటర్నల్ క్లస్టర్ రిసోర్స్ పర్సన్‌గా ఇప్పుడు తోటి రైతులకు ఈ విధానంలో శివన్నారాయణ శిక్షణనిస్తున్నాడు. అందుకే ఫుడ్ హీరోస్ ప్రచారంలో ఎఫ్ఏవో సంస్థ.. ‘వ్యవసాయ క్షేత్రమనే పాఠశాల నుంచి రైతు, వ్యవసాయ శాస్త్ర శిక్షకుడిగా మారినప్పుడు..’ అంటూ ‘కాకానీస్ స్టోరీ’ గా శివన్నారాయణ కథనాన్ని రూపొందించారు. గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్‌కుమార్ శివన్నారాయణతో పాటు వ్యవసాయ ఉన్నతధికారులు ఆయన ప్రశంసించారు
SOURCE: Food and Agriculture Organization of the United Nations