రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇళ్ళ పట్టాల పంపిణీ

నవ రత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్లు పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేయనున్న గృహ నిర్మాణానికి ఆయా జిల్లాలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. శంకుస్థాపనతో పాటు పంపిణీ చేయనున్న ఈ రెండు కార్యక్రమాలను సీఎం జగన్‌ తూర్పుగోదావరి జిల్లాలో లాంఛనంగా ప్రారంభిచనున్నారు. యు.కొత్తపల్లి మండలం కొమరగిరిలో 354 ఎకరాల్లో కాకినాడ నగర పేదల కోసం లే-అవుట్‌ను సిద్ధం చేస్తున్నారు. ఇక్కడే సీఎం ఇళ్ల పట్టాల పంపిణీతోపాటు గృహ నిర్మాణాలకు భూమిపూజ చేస్తారు. దీంతో ఈ-లేఅవుట్‌లో పది మోడల్‌ హౌసెస్‌ (ఆదర్శ గృహాలు) నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకు ఆకృతులను కూడా గృహ నిర్మాణ శాఖ సిద్ధం చేసింది. పది ఆదర్శ గృహాల నిర్మాణానికి (ఒక్కొక్కటి 54 గజాల్లో) ఏర్పాట్లు చేస్తున్నారు. అదే లే-అవుట్‌లో 16,601 మంది లబ్ధిదారులు ఇదే ఆకృతితో 52 గజాల్లో వ్యక్తిగత ఇళ్లను నిర్మించే వీలుందని అధికారులు చెబుతున్నారు. ఇక్కడ తొలి దశలో 12,500 ఇళ్లు కట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీన్ని మెగా టౌన్‌షిప్‌గా తయారు చేయడానికి కసరత్తు మొదలుపెట్టారు. పల్లెల్లో ఒక్కొక్కరికి 72 గజాల్లో ఇల్లు నిర్మించనున్నారు. పల్లెలు, పట్టణాల్లో ఇళ్ల నిర్మాణ ఆకృతులపై ఇంకా అధికారిక ఉత్తర్వులు రాలేదు. పది ఆదర్శ గృహాల నిర్మాణానికి ప్రాథమికంగా నమూనా ఆకృతి రూపొందించారు. పల్లెలు, పట్టణాల్లో ఇదే ఆకృతితో కేటాయించిన స్థలంలో వ్యక్తిగత ఇళ్లను నిర్మించే వీలుందని అధికారులు అంటున్నారు.