తెలంగాణాకు ఆదర్శంగా ఏపీ నాడు – నేడు

    • సాఫ్ట్‌వేర్‌ వినియోగానికి అనుమతి కోరిన తెలంగాణ 
    • తగిన సహకారం అందిస్తామన్న ఏపీ ప్రభుత్వం

    ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన నాడు–నేడు కార్యక్రమం దేశంలోని పలు రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. ఈ కార్యక్రమం కింద రాష్ట్రంలోని 45 వేల ప్రభుత్వ పాఠశాలలతో పాటు డిగ్రీ కాలేజీలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఆస్పత్రులలో ప్రభుత్వం మౌలిక సదుపాయాలను సమకూరుస్తూ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్న సంగతి తెలిసిందే. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అత్యంత ప్రాధాన్యతగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందుకు వేల కోట్ల రూపాయలను కేటాయించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసే ప్రతి వస్తువు నాణ్యతతో ఉండేలా, ప్రక్రియ అంతా అత్యంత పారదర్శకంగా కొనసాగేలా చూస్తున్నారు. ఎన్ని పనులు చేపట్టారు? ఎన్ని పనులు పూర్తయ్యాయి? ఎన్ని నిధులు ఖర్చయ్యాయి? తదితర అంశాలన్నీ ప్రతి ఒక్కరికీ తెలిసేలా టీసీఎస్‌ సంస్థ ద్వారా ప్రత్యేక పోర్టల్‌ ఏర్పాటు చేయించారు. ఈ కార్యక్రమం మంచి ఫలితాలు ఇస్తుండటంతో రాష్ట్ర విద్యా రంగం దేశంలో ముందంజలోకి వెళ్తోంది. 

    ఈ  నేపథ్యంలో పక్కనే ఉన్న తెలంగాణ ప్రభుత్వం కూడా నాడు–నేడు పథకాన్ని ఆ రాష్ట్రంలో అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగు పరచడం కోసం ఏపీ రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ను వినియోగించుకొనేందుకు నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ (ఎన్‌ఓసీ) ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి సందీప్‌ సుల్తానియా ఏపీ విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్‌కు ఈ నెల 15న లేఖ రాశారు. దీనికి ఏపీ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తూ నిరభ్యంతర పత్రం మంజూరుకు అంగీకరించింది. ‘తెలుగు ప్రజలకు ప్రయోజనం చేకూరేందుకు అవసరమైన సహకారాన్ని తెలంగాణ ప్రభుత్వానికి అందించడానికి సిద్ధంగా ఉన్నాం’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.    

    Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/telangana-govt-implement-nadu-nedu-scheme-andhra-pradesh-1372022