త్వరలో గిరిజన ఇంజనీరింగ్‌ కాలేజీ

  • ఈ నెలలోనే భూమి పూజకు ఏర్పాట్లు
  • జేఎన్‌టీయూ కాకినాడకు అనుబంధంగా ఏర్పాటు
  • రూ.153 కోట్లతో 105 ఎకరాల్లో భవన నిర్మాణాలు
  • 2021–22 విద్యా సంవత్సరం నుంచి 5 బ్రాంచ్‌లలో తరగతులు  

పట్టణాలు, నగరాలకే పరిమితమైన ఇంజనీరింగ్‌ విద్య త్వరలో ఏజెన్సీ ప్రాంతంలోనే గిరిజనులకు అందుబాటులోకి రాబోతోంది. గిరిజనులు కూడా తమ ప్రాంతంలోనే మెరుగైన ఉన్నత విద్య అభ్యసించేలా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయనగరం జిల్లా కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్‌ కాలేజీ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. కాలేజీ భవనాల నిర్మాణం కోసం ఇప్పటికే 105.32 ఎకరాల భూమిని, రూ.153 కోట్లను కేటాయించారు. వీలైనంత వేగంగా పనులు జరిగేలా ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ గిరిజన కాలేజీని జేఎన్‌టీయూ కాకినాడకు అనుబంధం చేస్తూ ఇటీవలే రాష్ట్ర మంత్రి మండలి తీర్మానం చేసింది. ఈ నెలలోనే మంత్రుల చేతుల మీదుగా ఈ కాలేజీ భవన నిర్మాణాలకు భూమి పూజ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. భవన నిర్మాణాలకు ఇప్పటికే ప్లానింగ్‌ పూర్తి చేశామని జేఎన్‌టీయూకే రిజిస్ట్రార్‌ డాక్టర్‌ సత్యనారాయణ చెప్పారు. 2021–22 విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశించినట్లు తెలిపారు. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. 2021–22 విద్యా సంవత్సరం నుంచి ఐదు బ్రాంచ్‌లలో తరగతులు ప్రారంభిస్తామని రిజిస్ట్రార్‌ సత్యనారాయణ పేర్కొన్నారు.