త్వరలో ‘గిరిజన వికాసం’ వెబ్‌సైట్‌

  • త్వరలో ‘గిరిజన వికాసం’ వెబ్‌సైట్‌
  • కుటుంబ సభ్యులు, స్థిర, చరాస్తుల వివరాలు నిక్షిప్తం
  • ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలతో పాటు ఇతర వివరాలు నమోదు
  • భవిష్యత్‌లో భూ వివాదాలు వచ్చే అవకాశం లేకుండా చర్యలు
  • సంక్షేమ పథకాలు అందాయో లేదో తెలుసుకునే అవకాశం

గిరిజనుల ఆస్తులకు రక్షణ కల్పించే చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. త్వరలో ‘గిరిజన వికాసం’ పేరుతో వెబ్‌సైట్‌ను ప్రారంభించనుంది. గిరిజన సంక్షేమ శాఖ రూపొందించిన ఈ వెబ్‌సైట్‌లో గిరిజన కుటుంబాలకు చెందిన అన్ని వివరాలు పొందుపరచనున్నారు. వెబ్‌సైట్‌లో ప్రతి ఒక్క గిరిజన కుటుంబానికి సబంధించిన సమగ్ర వివరాలు ఉండటం వల్ల వారి ఆస్తులకు రక్షణ ఉంటుందని గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌ పి.రంజిత్‌ బాషా తెలిపారు. దీనివల్ల ఎలాంటి భూ వివాదాలకు తావుండదని చెప్పారు. ముఖ్యమంత్రితో ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభింపజేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.    

ఆధార్‌ నంబర్‌తో అనుసంధానం…..
రాష్ట్రంలో గిరిజన కుటుంబాలకు సంబంధించి నిర్వహించిన సమగ్ర సర్వేలో సేకరించిన సమాచారం పూర్తిగా ఒక చోట ఉండేలా చర్యలు తీసుకున్నారు. గిరిజన కుటుంబ యజమాని లేదా కుటుంబ సభ్యుని ఆధార్‌ నంబర్‌ వెబ్‌సైట్లో నమోదు చేయగానే ఆ కుటుంబానికి సంబంధించిన సమగ్ర సమాచారం కనిపిస్తుంది. ఒక వేళ సమాచారంలో లోపం ఉంటే సంబంధిత ఐటీడీఏలో వివరాలు తెలిపి మార్పులు చేయించుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ పథకాలు గిరిజన కుటుంబాలకు అందాయా? లేదా? అనే విషయం తెలుసుకునేందుకు కూడా ఇది ఉపయోగ పడుతుంది. 

వెబ్‌సైట్‌లో ఏముంటాయంటే….
► గిరిజన కుటుంబంలో సభ్యుల పూర్తి వివరాలు. స్థిర, చరాస్తుల వివరాలు 
► గిరిజన రైతుల పేరిట ఉన్న భూముల సమగ్ర వివరాల నమోదు, వెబ్‌ల్యాండ్, ఆర్‌వోఎఫ్‌ఆర్‌ çహక్కు పత్రాల వివరాలు. 
► పట్టాదారు పేరు, ఊరిపేరు, సర్వే నంబరు ఇతర వివరాలు.
► రైతు భరోసా కింద ప్రభుత్వం చేసిన ఆర్థిక సాయం వివరాలు. 
► అమ్మ ఒడి, వైఎస్సార్‌ చేయూత, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన వంటి వివిధ పథకాల ద్వారా ఎంత మొత్తం సాయం అందిందనే వివరాలు 
► భూములు లేని వారి వివరాలు కూడా నమోదు. వారు ఏ ప్రభుత్వ పథకం కింద ఎంత మొత్తం సాయం తీసుకున్నారనే వివరాలు. 
► ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టా భూమిలో గిరిజన రైతుతో జియో ట్యాగింగ్‌.