త్వరలో జగనన్న సంపూర్ణ గృహ హక్కు రిజిస్ట్రేషన్లు

  • ముమ్మరంగా కొనసాగుతున్న అర్హుల గుర్తింపు
  • ఇప్పటివరకు 14.34 లక్షల మందిని అర్హులుగా తేల్చిన అధికారులు

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకానికి అర్హుల గుర్తింపు ప్రక్రియ వేగంగా జరుగుతోంది. పథకం కింద 1983 నుంచి 2011 ఆగస్టు 15 వరకు గృహ నిర్మాణ సంస్థ నుంచి రుణం పొంది, లేదా రుణం పొందకుండా నిర్మించిన ఇళ్లపై లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్య హక్కులు కల్పిస్తోంది. దీని కోసం 4 దశల్లో అర్హుల గుర్తింపు ప్రక్రియ జరుగుతోంది. వైఎస్సార్‌ జిల్లా మినహా మిగిలిన 12 జిల్లాలకు సంబంధించిన 47,37,499 మంది లబ్ధిదారుల వివరాలను మునిసిపాలిటీలు, పంచాయతీలకు గృహ నిర్మాణ శాఖ బదిలీ చేసింది.

ఆయా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి గ్రామ/వార్డు వలంటీర్లు, వీఆర్‌వో, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్నారు. ప్రస్తుత గృహ అనుభవదారుడు ఎవరు? స్థలం స్వభావమేంటి? సరిహద్దులు గుర్తించడం తదితర విచారణలు చేపట్టి అర్హులను గుర్తిస్తున్నారు. ఇప్పటివరకు 12 జిల్లాల్లో 14,34,037 మందిని అర్హులుగా తేల్చారు. వైఎస్సార్‌ జిల్లాలో ఎన్నికల కోడ్‌ వల్ల అర్హుల గుర్తింపు చేపట్టలేదు. బద్వేలు ఉప ఎన్నిక ముగిసినందున వైఎస్సార్‌ జిల్లాలో కూడా గుర్తింపు ప్రక్రియ మొదలుపెడతామని అధికారులు చెప్పారు. 

నిర్దేశించిన మొత్తాలిలా.. 
రుణ గ్రహీతలు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి రూ.10 వేలు, మునిసిపాలిటీల్లో రూ.15 వేలు, కార్పొరేషన్ల పరిధికి సంబంధించి రూ.20 వేలు చెల్లిస్తే ప్రభుత్వం స్థలాలపై పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తూ ధ్రువపత్రం జారీ చేస్తుంది. ప్రభుత్వం నిర్ధేశించిన మొత్తం కన్నా వాస్తవ లబ్ధిదారులు గృహ నిర్మాణ సంస్థకు బకాయి ఉన్న రుణం తక్కువ ఉంటే ఆ మొత్తాన్ని చెల్లిస్తే సరిపోతుంది. వాస్తవ లబ్ధిదారుడు నుంచి ఇల్లు కొనుగోలు చేసిన వారు, వారసులు గ్రామీణ ప్రాంతాల్లో రూ.20 వేలు, మునిసిపాలిటీల్లో రూ.30 వేలు, కార్పొరేషన్లలో రూ.40 వేలు చెల్లిస్తే పూర్తి యాజమాన్య హక్కులు దక్కుతాయి.

గృహ నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి రుణం తీసుకోకుండా ఇళ్లు నిర్మించుకున్న వారికి కూడా ప్రభుత్వం ఉచితంగా యాజమాన్య హక్కులు కల్పిస్తోంది. గృహ నిర్మాణ సంస్థ ఎండీ నారాయణ భరత్‌ గుప్తా మాట్లాడుతూ.. క్షేత్ర స్థాయి పరిశీలన, విచారణల అనంతరం అర్హులైన లబ్ధిదారుల వివరాలను నమోదు చేసుకుంటున్నామని చెప్పారు. నిర్దేశించిన రుసుము చెల్లించిన వారికి త్వరలో రిజిస్ట్రేషన్‌లు ప్రారంభిస్తామని వెల్లడించారు.   

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/coming-soon-jagananna-sampoorna-gruha-hakku-registrations-1409287