ఏపీలో ప్రకటించిన దిశ చట్టానికి దేశ వ్యాప్తంగా ఆదరణ

  • కొత్త ఆలోచనలతో ప్రత్యేకతను చాటుకుంటున్న సీఎం
  • జగన్‌ వినూత్న సంక్షేమ పథకాలకు పలు రాష్ట్రాలు ఫిదా
  • దిశ చట్టంపై ఇతర రాష్ట్ర ప్రభుత్వాల ఆసక్తి
  • అదేబాటలో మహారాష్ట్రలో శక్తి చట్టం
  • పంజాబ్‌, హర్యానాల్లోనూ ఈ తరహా చట్టంకై కసరత్తు
  • ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి చట్టంకోసం ఉద్యమం
  • దేశవ్యాప్తంగా ఊపందుకుంటున్న డిమాండ్లు
  • పాకిస్తాన్‌లోనూ ఈ తరహా చట్టం కోసం ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న కొన్ని సంక్షేమ పథకాలు, చట్టాలకు దేశవ్యాప్తంగా ప్రాధాన్యత లభిస్తోంది. ఇందులో గతేడాది ప్రభుత్వం చేసిన దిశాచట్టం ఒకటి. దీన్ని ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తోంది. ఈ చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలన్న డిమాండ్‌ జోరందుకొంది. ఇందుకోసం గతేడాది ఢిల్లీ, మహిళా కమీషన్‌ చైర్‌పర్సన్‌ స్వాతిమాలివాల్‌ 13రోజుల పాటు నిరాహార దీక్షకూడా చేశారు. ఈ చట్టం ప్రకారం మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే 21రోజుల్లోనే విచారణ పూర్తి చేసి దోషులకు జీవితఖైదు లేదా మరణ శిక్ష విధిస్తారు. ఇలాంటి చట్టాల్ని దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకురావాలని స్వాతిమాలివాల్‌ అప్పట్లో కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. అనంతర పరిణామాలపై ఆమె కేంద్ర ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. యాసిడ్‌ దాడులు, అత్యాచారాలు వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడితే ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుల ద్వారా వాటిని విచారించాలనేది దిశ చట్టం ముఖ్యోద్దేశ్యం. ఖచ్చితమైన ఆధారాలుంటే 21రోజుల్లోనే మరణశిక్ష విధించేలా ఏపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని తెచ్చింది.


ఇప్పుడు మహరాష్ట్ర కూడా ఇదే రకమైన చట్టాన్ని రూపొందించింది. దిశా నుంచి ప్రేరణ పొంది, శక్తి పేరిట కొత్త చట్టాన్ని తయారుచేసింది. దీన్ని తాజా అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టింది. వారం క్రితమే ఈ బిల్లును మహరాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. లైంగికదాడి, యాసిడ్‌ దాడి, పిల్లలు, మహిళలపై సోషల్‌ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టడం వంటి నేరాలకు మరణశిక్షతో పాటు పదిలక్షల వరకు జరిమానా విధించేలా శక్తి చట్టాన్ని మహరాష్ట్ర ప్రభుత్వం రూపుదిద్దింది. అంతేకాదు.. మహిళలపై దాడులకు సంబంధించి మరిన్ని శిక్షల్ని ఈ చట్టంలో పొందుపర్చింది.

ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి దాదాపు ప్రతి విషయంలోనూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయాల్లో దిశా వంటివి దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపాయి. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం ఈ తరహా చట్టాన్ని రూపొందించగా పంజాబ్‌, హర్యానా ప్రభుత్వాలు కూడా ఇలాంటి చట్టం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాయి. మరో పక్క ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇలాంటి చట్టం తేవాలని ఉద్యమిస్తున్నారు. మహిళ భద్రతకు భరోసానిస్తున్న ఇలాంటి చట్టాల్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలన్న డిమాండ్‌ ఇప్పుడు ఊపందుకుంటోంది. భారత్‌లోనే కాదు.. పొరుగునున్న పాకిస్థాన్‌లోనూ ఈ తరహా చట్టం చేయాలని ఆ దేశ ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనిపై అధ్యయనాలు కూడ జరుగుతున్నాయి.

ఇంతకీ ఈ చట్టం ఏంటి ?

ఈ చట్టం ప్రకారం అత్యాచారం, హత్యాచారం, యాసిడ్‌ దాడులు వంటి నేరాలకు సంబంధించి 14రోజుల్లోపే విచారణ పూర్తి చేస్తారు. 21రోజుల్లో నిందితునికి శిక్ష విధిస్తారు. పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడే వారికి జీవితఖైదు లేదా ఉరిశిక్షకు అవకాశముంది. సోషల్‌ మీడియాలో వేధింపులకు పాల్పడే వార్ని శిక్షించేందుకు ఐపిసి లో 354 (ఇ) అనే కొత్త సెక్షన్‌ తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం మొదటి తప్పుకు 2ఏళ్ళు, రెండో తప్పుకు నాలుగేళ్ళు శిక్ష విధిస్తారు. మహిళలు, పిల్లలపై జరిగే నేరాల విచారణకు ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తారు. ఈ దిశా చట్టానికి సంబంధించిన బిల్లును 2019 డిసెంబర్‌ 13న హోంమంత్రి సుచరిత అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీన్ని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది.

Source : Andhra Prabha