దిశ యాప్‌లో పుష్‌ బటన్‌ ఆప్షన్‌

  • కొత్త సదుపాయాన్ని తెచ్చిన పోలీసు శాఖ
  • ఒకేసారి 12.57 లక్షల మందికి అలర్ట్‌ సందేశాలు పంపే అవకాశం
  • తప్పుడు ప్రచారాలకు తెర, అత్యవసర సమయాల్లో అప్రమత్తం చేసేందుకు వినియోగం

జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్న దిశ మొబైల్‌ అప్లికేషన్‌ (యాప్‌)లో కొత్త ఆప్షన్‌ పొందుపరిచారు. తప్పుడు ప్రచారాలకు తెర దించుతూ..అత్యవసర సమయాల్లో ప్రజలను అప్రమత్తం చేసేందుకు సందేశాలను పంపేలా రాష్ట్ర పోలీస్‌ శాఖ ‘పుష్‌ బటన్‌ మెస్సేజ్‌ ఆప్షన్‌’ను యాప్‌లో చేర్చింది. ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు జరుగుతున్న ‘దిశ’ కార్యక్రమాలు మంచి ఫలితాలు సాధిస్తున్న సంగతి తెలిసిందే. దిశ యాప్‌ గత 13 నెలల్లో నాలుగు జాతీయ అవార్డులు దక్కించుకోవడం గమనార్హం. దిశ కార్యక్రమాలను బలోపేతం చేసేలా ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. దిశ పెట్రోలింగ్‌ వాహనాలు, సైబర్‌ కియోస్క్‌ల ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇప్పటికే గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు.

ఫుష్‌ బటన్‌ ఆప్షన్‌ ఇలా…
రాష్ట్రంలో దిశ మొబైల్‌ యాప్‌ను 12.57 లక్షల మంది తమ డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. వారందరికీ పోలీసులు ఏదైనా సమాచారాన్ని పంపించి అప్రమత్తం చేయాలనుకుంటే పుష్‌ బటన్‌ ఆప్షన్‌ను వినియోగిస్తారు. ఈ బటన్‌ ఒకసారి ప్రెస్‌ చేస్తే చాలు అందరికీ ఏకకాలంలో పోలీస్‌ సందేశం చేరుతుంది. దీనిపై అజమాయిషీ పూర్తిగా పోలీసు ప్రధాన కార్యాలయంలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ పరిధిలో ఉంటుంది. డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్‌ ఆదేశాల మేరకు దిశ యాప్‌ను మరింత ప్రయోజనకరంగా తీర్చిదిద్దామని, ఇందులో భాగంగా పుష్‌ బటన్‌ ఆప్షన్‌ తెచ్చామని పోలీస్‌ శాఖ టెక్నికల్‌ చీఫ్‌ పాలరాజు తెలిపారు.

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/push-button-option-disha-app-1347073