దిశలో పెరుగుతున్న భర్త భాధితుల ఫిర్యాధులు

మహిళలు, చిన్నారుల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ బిల్లు ఇప్పుడు భర్త బాధిత మహిళలకు కూడ వరంగా మారింది. తమ భర్తల వేదింపులను తట్టుకోలేక దిశ యాప్ లో ఫిర్యాదులు చేసే వారి సంఖ్య మరింతగా పెరుగుతుంది. దిశ బిల్లులో భాగంగా ఆపదలో ఉన్న వారిని ఆదుకునేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి మొబైల్‌ యాప్‌ను ప్రారంభించారు. ఈ యాప్‌ను దాదాపు 12 లక్షలమంది డౌన్‌లోడ్‌ చేసుకోగా.. ఆపదలో ఉన్న మహిళలు, బాలికలు నేరుగా ఫిర్యాదు చేస్తున్నారు. దిశ యాప్‌లో వస్తున్న ఫిర్యాదుల్లో భర్త బాధితులు ‘భర్త పెట్టే బాధలు భరించలేకపోతున్నాం కాపాడండి’ అంటూ వేడుకుంటున్నారు. గడిచిన పదినెలల కాలంలో 675 మంది మహిళలు, బాలికలు దిశ కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేయగా వీరిలో భర్త వేధింపులు తాళలేకపోతున్నామంటూ 267 మంది కాల్‌ చేశారు.

ఈ ఘటనల్లో మద్యం తాగిన మత్తులో భార్యను కొట్టిన పురుషులు ఎక్కువగా ఉన్నారు. దీనికి తోడు అధిక కట్నం కోసం వేధిస్తున్న వారు మరికొందరు. ఈ వేదింపులు రాత్రివేళ 10.30 గంటల నుంచి తెల్లవారుజాము 3.30 గంటల మధ్య ఎక్కువ జరిగినట్టు దిశ కాల్స్ లో రికార్డయ్యాయి. భర్త కొడుతున్న సమయంలో తమ మొబైల్స్‌లో దిశ యాప్‌ను ఓపెన్‌ చేసి ఎస్‌వోఎస్‌ బటన్‌ ప్రెస్‌ చేసే అవకాశం లేకపోవడంతో తమ చేతిలోని సెల్‌ ఫోన్‌ను అటు ఇటు ఊపి (షెక్‌ చేయడం) ఆపదలో ఉన్నాం ఆదుకోండి.. అని సమాచారం అందించగా.. దిశ కాల్‌ సెంటర్‌కు సమాచారం వచ్చిన వెంటనే సమీపంలోని పోలీసులను అప్రమత్తం చేయడంతో.. అక్కడి చేరుకొని బాధితులను కాపాడుతున్నారు. వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి కాపురాలు చక్కదిద్దుతున్నారు. భర్తల వేధింపులపై 267 మంది ఫిర్యాదు చేయగా కౌన్సెలింగ్‌ అనంతరం అనేక కాపురాలు చక్కబడ్డాయి. అప్పటికీ మాట వినని 20 మంది పురుషులపై కేసులు నమోదు చేశామని దిశ ప్రత్యేక అధికారి దీపికా పాటిల్ తెలిపారు.

పదినెలల్లో దిశ యాప్‌కు వచ్చిన ఫిర్యాదులు
భర్త వేధింపులు: 267
బయటివారి వేధింపులు: 115
గుర్తుతెలియనివారి వేధింపులు: 69
పనిచోసేచోట వేధింపులు: 67
బంధువుల వేధింపులు: 68
తప్పుడు ఫిర్యాదులు: 22
అసభ్య ప్రవర్తన: 19
మహిళ అదృశ్యం: 13
బాలికలపై అకృత్యాలు: 9
సివిల్‌ వివాదాలు: 8
బాలికల అదృశ్యం: 8
ప్రమాదాలు: 6
పురుషుల అదృశ్యం: 3
వెంటపడి వేధింపులు: 1
మొత్తం: 675