దిశ వన్‌ స్టాప్‌ తో మహిళలపై వేధింపులకు ఫుల్‌స్టాప్‌

  • మహిళలకు సత్వర న్యాయం చేసే దిశగా 13 జిల్లా కేంద్రాల్లో వన్‌స్టాప్‌ సెంటర్లు
  • గృహ హింస, అత్యాచారాలు, లైంగిక వేధింపులు, బాల్య వివాహాలు, బాధిత మహిళలకు ఆశ్రయం 
  • దిశ యాప్, 108 కమాండ్‌ కంట్రోల్, పోలీస్‌ స్టేషన్ల నుంచి సమాచారం
  • 2018 కంటే 35 శాతం పెరిగిన సమస్యల పరిష్కారం

దిశ వన్‌స్టాప్‌ సెంటర్లు మహిళల భద్రతకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతున్నాయి. పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లేందుకు వెనకంజ వేసే బాధిత మహిళలకు అండగా నిలుస్తూ భరోసా కల్పిస్తున్నాయి. కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్‌ ఇవ్వడం నుంచి అవసరమైన కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు వరకు పూర్తి బాధ్యత వహిస్తున్నాయి. దాంతో గతానికి భిన్నంగా బాధిత మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి వన్‌స్టాప్‌ సెంటర్ల ద్వారా సత్వర న్యాయాన్ని పొందుతున్నారు.

ఐదు రకాలుగా భరోసా
బాధిత మహిళలకు సత్వర న్యాయం చేసే దిశగా రాష్ట్రంలోని 13 జిల్లా కేంద్రాల్లో వన్‌స్టాప్‌ సెంటర్లను తీర్చిదిద్దడంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక కార్యాచరణ నిర్దేశించారు. దిశ వ్యవస్థ పరిధిలోకి వీటిని తీసుకువచ్చి ‘దిశ వన్‌స్టాప్‌ సెంటర్లు’గా తీర్చిదిద్దారు. దాంతో దిశ వన్‌స్టాప్‌ సెంటర్లు మహిళల సమస్యల పరిష్కారంలో సమర్థవంతమైన పాత్ర పోషిస్తున్నాయి. జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్లకు ప్రభుత్వం ప్రత్యేకంగా సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ సహా 18 మంది సిబ్బందిని నియమించింది. వీరిలో వీలైనంత వరకు మహిళలనే నియమించారు. ఈ సెంటర్లు 24 గంటలూ అందుబాటులో ఉంటూ బాధిత మహిళలకు ఐదు రకాల సేవలు అందిస్తున్నాయి. గృహ హింస, అత్యాచారాలు, లైంగిక వేధింపులు, బాల్య వివాహాలు, బాధిత మహిళలకు ఆశ్రయం  కల్పించడంలో కీలక భూమిక పోషిస్తున్నాయి. బాధిత మహిళలకు ఐదు రోజుల వరకు ఆశ్రయం కల్పించేందుకు వసతి ఏర్పాట్లు చేశారు. 

సమస్య పూర్తిగా పరిష్కారమయ్యే వరకు..
పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లేందుకు భయపడే మహిళల పరిస్థితిని గుర్తించి వారికి తగిన సహాయం చేసి సమస్య పరిష్కారానికి వన్‌స్టాప్‌ సెంటర్లు చొరవ చూపిస్తున్నాయి. అందుకోసం మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. దిశ యాప్, 108 కమాండ్‌ కంట్రోల్, పోలీస్‌ స్టేషన్ల నుంచి వన్‌స్టాప్‌ సెంటర్లకు సమాచారం వస్తుంది. ఆ వెంటనే ఇక్కడి సిబ్బంది బాధిత మహిళలతో మాట్లాడి వారి సమస్య గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటున్నారు. వారి సమస్య పూర్తి పరిష్కారమయ్యే వరకు వారికి అండగా ఉంటున్నారు. గృహ హింస, బాల్య వివాహాల కేసుల్లో కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు. అత్యాచారం, లైంగిక దాడుల కేసుల్లో బాధితులకు అవసరమైన వైద్య పరీక్షల నిర్వహణ, అనంతరం ఎఫ్‌ఐఆర్‌ నమోదు వరకు వన్‌స్టాప్‌ సెంటర్ల సిబ్బంది బాధ్యత వహిస్తున్నారు. ఉచితంగా న్యాయ సహాయాన్ని అందిస్తున్నారు. బాధిత మహిళలకు పూర్తి భరోసా కలిగేంత వరకు వన్‌స్టాప్‌ సెంటర్లే బాధ్యత తీసుకుంటుండటం విశేషం. 

35 శాతం పెరిగిన కేసుల పరిష్కారం
వన్‌స్టాప్‌ సెంటర్‌ను ఆశ్రయిస్తే చాలు తమకు న్యాయం జరుగుతుందన్న భరోసా కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విజయవంతమైంది. మహిళలపై వేధింపులను ప్రభుత్వం తీవ్రమైన అంశంగా పరిగణిస్తూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించడమే దీనికి కారణం. దాంతో గతంలో కంటే బాధిత మహిళలు ధైర్యంగా వన్‌స్టాప్‌ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. 2018 నాటితో పోలిస్తే వన్‌స్టాప్‌ సెంటర్ల ద్వారా మహిళలపై వేధింపుల కేసుల పరిష్కారం 35 శాతం పెరగడం విశేషం.

కొత్తగా 5 వన్‌స్టాప్‌ కేంద్రాల నిర్మాణం
రాష్ట్రంలో ప్రస్తుతం 8 జిల్లా కేంద్రాల్లో వన్‌స్టాప్‌ సెంటర్లకు శాశ్వత భావనాలు ఉన్నాయి. మిగిలిన ఐదు జిల్లాల్లో కూడా వన్‌స్టాప్‌ సెంటర్లకు శాశ్వత భవనాలను నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. కర్నూలు, తూర్పు గోదావరి, కృష్ణా, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో శాశ్వత భవనాలు 2022 ఏప్రిల్‌ నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. 

బాధిత మహిళలకు పూర్తి భరోసా
బాధిత మహిళల సమస్యల పరిష్కారం కోసం వన్‌స్టాప్‌ సెంటర్లు పూర్తిస్థాయిలో సహకారం అందిస్తున్నాయి. అవసరమైతే బాధిత మహిళల ఇంటికే సిబ్బంది వెళ్లి మరీ సమస్య పరిష్కారానికి చొరవ చూపిస్తున్నారు. కౌన్సెలింగ్‌ నిర్వహించడంతోపాటు అవసరమైన మహిళలకు ఆశ్రయం కల్పిస్తున్నాం. తీవ్రమైన కేసుల్లో మహిళలకు వైద్య పరీక్షల నిర్వహణ, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం వరకూ అన్నీ వన్‌స్టాప్‌ సెంటర్ల సిబ్బందే పర్యవేక్షిస్తున్నారు.
–  కృతికా శుక్లా, కమిషనర్, మహిళా–శిశు సంక్షేమ శాఖ 

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/one-stop-disha-centers-13-district-centers-speedy-justice-women-1403511