దేశంలోనే అతి పెద్ద సర్వేకి నేడు సీఎం జగన్‌ శ్రీకారం

  • పైలట్‌ ప్రాజెక్టు పూర్తయిన తక్కెళ్లపాడు నుంచి ప్రారంభం.. 
  • భూ యజమానులకు శాశ్వత హక్కులు
  • జగ్గయ్యపేట ఎస్‌జీఎస్‌ కళాశాలలో ఉదయం సీఎం జగన్‌ బహిరంగ సభ

పొలం గట్ల తగాదాలు, భూ వివాదాలకు శాశ్వతంగా తెరదించేందుకు ‘వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు– భూ రక్ష పథకం’ ద్వారా భూముల సమగ్ర రీసర్వే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం సోమవారం శ్రీకారం చుడుతోంది. పల్లె సీమల్లో శాంతి సౌభ్రాతృత్వాలు వెల్లివిరిసేలా వందేళ్ల చరిత్రలో దేశంలోనే అతి పెద్ద రీసర్వేను తలపెట్టిన ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడు నుంచి లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. పైలట్‌ ప్రాజెక్టు కింద ఇప్పటికే రీసర్వే పూర్తయిన తక్కెళ్లపాడులో స్థిరాస్తి హక్కు పత్రాలు (క్యూఆర్‌ కోడ్‌తో కూడిన కార్డులు), భూమి హక్కు పత్రాలను యజమానులకు సీఎం జగన్‌ అందజేస్తారు.

అనంతరం ఇక్కడ సరిహద్దు రాయిని ప్రారంభించి 13 జిల్లాలకు చెందిన సర్వే బృందాలకు పచ్చజెండా ఊపడం ద్వారా రీసర్వేకి గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తారు. మంగళవారం ప్రతి జిల్లాలో ఒక గ్రామంలో రీసర్వే పనులు ప్రారంభమవుతాయి. తదుపరి వారం రోజుల్లో ప్రతి రెవెన్యూ డివిజన్‌లో ఒక గ్రామంలోనూ, ఆ తర్వాత నాలుగైదు రోజుల్లో ప్రతి మండలంలో ఒకటి చొప్పున 670 గ్రామాల్లో రీసర్వే ప్రారంభమవుతుంది. తదుపరి మొదటి విడత నిర్ణయించిన 5,122 గ్రామాల్లో ఈ ప్రక్రియ ఆరంభమవుతుంది. రెండో దశలో 6000, మూడో దశలో మిగిలిన గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టి 2023 ఆగస్టు నాటికి రాష్ట్రమంతా రీసర్వే పూర్తి చేసేలా ప్రభుత్వం కాల వ్యవధితో ప్రణాళిక రూపొందించింది. దీర్ఘకాలంగా నెలకొన్న భూ వివాదాలను పరిష్కరించి యజమానులకు స్థిరాస్తులపై శాశ్వత హక్కులు కలి్పంచాలనే ఉదాత్త ఆశయంతో ముఖ్యమంత్రి ల్యాండ్‌ టైట్లింగ్‌ బిల్లు – 2020ని శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదింప చేశారు. కేంద్ర ప్రభుత్వ అనుమతి లభించగానే ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం – 2020  గెజిట్‌లో ప్రచురిస్తారు.