దేశీ ఆవు పాలకు జాతీయ, అంతర్జాతీయ డిమాండ్‌

  • స్వదేశీ జాతుల సంరక్షణ, ఏ–2 పాల ఉత్పత్తి పెంపే లక్ష్యంగా.. 
  • 13 జిల్లాల్లో 58 క్షేత్రాలు ఏర్పాటు 
  • ఇప్పటికే పూర్తయిన జేఎల్‌జీ గ్రూపుల ఎంపిక 
  • ఒక్కో యూనిట్‌కు రూ.30 లక్షలు వ్యయం 
  • 60 శాతం సబ్సిడీ అందిస్తోన్న ప్రభుత్వం 
  • మరో 30 శాతం బ్యాంకు రుణ సదుపాయం 
  • జూన్‌ నెలాఖరులోగా రుణాల మంజూరు 
  • జూలై నుంచి క్షేత్రాల్లో పాల ఉత్పత్తికి శ్రీకారం

  దేశీయ మేలు జాతి పాడి ఆవుల పెంపకం, పాల ఉత్పత్తి, మార్కెటింగ్‌ను ప్రోత్సహించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం స్వదేశీ నాటు ఆవుల పెంపక క్షేత్రాలను ఏర్పాటు చేస్తోంది. ఈ క్షేత్రాల ద్వారా అటు స్వదేశీ జాతి ఆవుల సంరక్షణ, ఇటు రైతుకు అదనపు ఆదాయం సమకూరేలా ప్రభుత్వం సంకల్పించింది. వీటి ఏర్పాటుకు రాష్ట్ర వ్యాప్తంగా జాయింట్‌ లయబిలిటీ గ్రూపు (జేఎల్‌జీ)లను ఎంపిక చేసింది. ఈ గ్రూపులు ఇప్పటికే తమ వాటా సొమ్మును జమ చేయగా, జూన్‌ నెలాఖరులోగా గ్రూపులకు బ్యాంకు నుంచి రుణం మంజూరుతో పాటు సబ్సిడీ సొమ్ములు విడుదల చేసి, జూలై నాటికల్లా క్షేత్రాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 

  ఒక్కో యూనిట్‌ రూ.30 లక్షలతో.. 
  రూ.17.40 కోట్ల అంచనాతో రాష్ట్ర వ్యాప్తంగా 58 యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కొక్కటి రూ.75 వేల విలువైన 25 దేశీ నాటు ఆవులను ఒక్కో యూనిట్‌కు అందజేస్తారు. వీటి కోసం రూ.10.50 కోట్లు ఖర్చు కానుంది. గోవుల కోసం నిర్మించే షెడ్లు, ఫెన్సింగ్‌ కోసం ఒక్కో యూనిట్‌కు రూ.10 లక్షల చొప్పున రూ.5.80 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇక ఒక్కో యూనిట్‌కు పాల ఉత్పత్తి కోసం ఉపయోగించే పరికరాల కోసం రూ.1,12,250 చొప్పున రూ.65.54 లక్షలు, నిర్వహణ కోసం రూ.1,37,250 చొప్పున రూ.79.46 లక్షలు ఖర్చు చేయనున్నారు. ఈ విధంగా ఒక్కో యూనిట్‌కు రూ.30 లక్షల చొప్పున ఖర్చు కానుంది. ఈ మొత్తంలో రూ.3 లక్షలు (10 శాతం) జేఎల్‌జీ గ్రూపు భరించనుండగా, రాష్రీ్టయ కృషి వికాస్‌ యోజన (ఆర్‌కేవీవై), నేషనల్‌ ఎడాప్షన్‌ ఫండ్‌ ఫర్‌ క్‌లెమైట్‌ చేంజ్‌ (ఎన్‌ఎఎఫ్‌సీఎస్‌) నిధుల నుంచి సబ్సిడీ రూపంలో రూ.18 లక్షలు (60 శాతం) అందించనున్నారు. మిగిలిన రూ.9 లక్షలు (30 శాతం) బ్యాంకుల నుంచి రుణంగా మంజూరు చేయనున్నారు. 

  జూలై నాటికి క్షేత్రాలు ప్రారంభం.. 
  జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలో ఏర్పాటైన జిల్లా స్థాయి మానిటరింగ్‌ కమిటీల ద్వారా ఎంపిక చేసిన జేఎల్‌జీ గ్రూపులు తమ వాటాగా రూ.3 లక్షలు ఇప్పటికే జమ చేశారు. ఈ నెలాఖరులోగా గ్రూపులకు బ్యాంకు రుణాలు మంజూరుతో పాటు పాల ఉత్పత్తుల కోసం అవసరమైన పరికరాల ఎంపిక పూర్తి చేస్తారు. ఎంపిక చేసుకున్న పరికరాలను జూన్‌ 15 నుంచి 30వ తేదీలోగా కొనుగోలు చేస్తారు. ఏపీ పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ద్వారా ఈ క్షేత్రాల కోసం షెడ్లు నిర్మించే ప్రక్రియను జూన్‌ 24వ తేదీలోగా పూర్తి చేయనున్నారు.

  పశుగ్రాసం కొరత లేకుండా చేసేందుకు ఆర్గానిక్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాన్‌ (ఓఎంపీ) ద్వారా పశుగ్రాసం సాగు చేసేందుకు బెంగుళూరుకు చెందిన అదితి ఆర్గానిక్‌ సరి్టఫికేషన్‌ ద్వారా జూన్‌ 1 నంచి 10వ తేదీ వరకు క్షేత్ర స్థాయి పరిశీలన చేస్తారు. జూన్‌ 10 నుంచి 30వ తేదీలోగా రుణంతో పాటు సబ్సిడీ మొత్తం జమ చేస్తారు. జూలై మొదటి వారంలో ఎంపిక చేసుకున్న దేశీ ఆవులు కొనుగోలు ప్రక్రియ చేపడతారు. రెండో వారంలో పాల ఉత్పత్తికి శ్రీకారం చుడతారు. 

  ఏ–2 మిల్క్ కు జాతీయ, అంతర్జాతీయ డిమాండ్‌ 
  దేశీయ నాటు ఆవులుగా పిలిచే గిర్‌ (గుజరాత్‌), షాహివాలా (హరియాణా, పంజాబ్‌), ఒంగోలు, పుంగనూరు జాతి పశువుల పాలను ఏ–2 మిల్క్‌గా పిలుస్తారు. ఈ పాలకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. ఒక్కో లీటర్‌ మన రాష్ట్రంలోనే రూ.80 నుంచి రూ.100 పలుకుతోంది. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై వంటి నగరాల్లో లీటర్‌ రూ.150 నుంచి రూ.180కి పైగా పలుకుతుంది. క్యాన్సర్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధి నివారణకు ఎంతో ఉపయోగపడే ఏ–2 పాల ఉత్పత్తి, వినియోగాన్ని పెంచడంతో పాటు స్వదేశీ జాతులను సంరక్షించడం లక్ష్యంగా దేశీ నాటు ఆవు క్షేత్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.

  పాలకు మంచి ధర.. 
  మా గోశాలలో వివిధ జాతులకు చెందిన 112 ఆవులు, గేదెలు ఉన్నాయి. జేఎల్‌జీ గ్రూపుగా ఏర్పడి స్వదేశీ నాటు ఆవుల కోసం దరఖాస్తు చేసాం. మా వాటాగా రూ.3 లక్షలు చెల్లించాం. ఈ ప్రాజెక్టు కింద 25 నాటు ఆవులిస్తారు. ఒక్కో ఆవు 4 నుంచి 5 లీటర్ల పాలిస్తుంది. వీటికి విజయవాడ మార్కెట్‌లోనే లీటర్‌ రూ.100 ధర పలుకుతోంది. హైదరాబాద్‌లో ఏకంగా రూ.150 నుంచి రూ.180 వరకు ధర ఉంటోంది. 
  – రవికుమార్, సురభి గోశాల. 

  రైతుకు అదనపు ఆదాయం.. 
  దేశీ నాటు ఆవులను సంరక్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ క్షేత్రాలను ఏర్పాటు చేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉన్న ఏ–2 పాల ఉత్పత్తిని పెంచడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం సమకూర్చాలన్నదే ప్రభుత్వం సంకల్పం. ఇప్పటికే గ్రూపుల ఎంపిక పూర్తయ్యింది. వచ్చే నెలలో రుణాల మంజూరు, షెడ్ల నిర్మాణ ప్రక్రియ పూర్తి చేసి, జూలై మొదటి వారంలో క్షేత్రాలను ప్రారంభించేలా కసరత్తు చేస్తున్నాం. 
  – ఆర్‌.అమరేంద్రకుమార్, డైరెక్టర్, పశుసంవర్ధక శాఖ  

  Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/ap-govt-setting-indigenous-cow-breeding-farms-dairy-production-1367659